తాడేపల్లి: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో టీడీపీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడి విజయవాడ సన్‌రైజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైయస్ఆర్ సీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావును రేపు సాయంత్రం 4 గంటలకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించనున్నారు. బెంగళూరు పర్యటన ముగించుకొని గన్నవరం చేరుకోనున్న వైయస్ జగన్, అక్కడి నుంచి నేరుగా సన్‌రైజ్ ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైయస్ఆర్ సీపీ నేత శ్రీనివాసరావును పరామర్శించిన అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. బుధ, గురువారం రెండు రోజులు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులతో వైయస్ఆర్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ వరుసగా సమావేశం కానున్నారు. ఈ రెండురోజులు పూర్తిగా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశాల నేపథ్యంలో ఇతరులెవ్వరినీ పార్టీ అధ్యక్షులు కలవలేరని పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. దీన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్తించాలని విజ్ఞప్తి చేసింది.