రాష్ట్ర భవిష్యత్తు, మీ భవిష్యత్తుకు నాదీ బాధ్యత

175 స్థానాలు గెలవడమే లక్ష్యంగా మనం ముందుకు కదలాలి

ఏకగ్రీవంగా పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు

దశాబ్దం పాటు నాకు అండగా, తోడుగా నిలిచిన మహాసైన్యానికి సెల్యూట్‌

ఈ మూడేళ్లు నా ఫోకస్‌ అంతా మంచి పరిపాలన అందించడంపైనే పెట్టా

ఒక్క ఎమ్మెల్యేతో మొదలైన ప్రస్థానం.. 151కు చేరింది.. 2024లో 175 సాధిస్తాం

మూడేళ్లలో డీబీటీ ద్వారా అక్షరాల రూ.1.63 లక్షల కోట్లు అందించాం

విద్యా, వ్యవసాయం, వైద్యం, మహిళా సాధికారత, భద్రత, సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం

మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలు మూడేళ్లలోపే 95 శాతం అమలు చేశాం

చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవనే భయంతో దుష్టచతుష్టయం దుష్ప్రచారం

గతంలో చంద్రబాబు చేసిన అప్పులకంటే మీ జగనన్న చేసిన అప్పులు తక్కువే

బాబు హయాంలో దోచుకో.. దాచుకో సిద్ధాంతం ఉండేది

మీ జగన్‌ ప్రభుత్వంలో బటన్‌ నొక్కగానే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ

2019 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ విజయ ఢంకామోగించింది

మనందరి ప్రభుత్వాన్ని అడుగడుగునా కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే

గడప గడపకూ వెళ్లండి.. మేనిఫెస్టో చూపించి జరుగుతున్న మంచిని వివరించండి

ప్లీనరీ ముగింపు సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం

గుంటూరు: ‘‘రాష్ట్రంలో మహాయజ్ఞం జరుగుతుంది. మరో 30 సంవత్సరాల భవిష్యత్తుకు కావాల్సిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, వైద్య, వ్యవసాయ, మహిళా అభ్యుదయ మూలాలకు మూడు సంవత్సరాల్లో అడుగులు పడ్డాయి. ఇది మరింతగా బలపడాలంటే అందులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల పాత్ర చాలా కీలకం. మీ తోడు, మీ దీవెనలు నన్ను ఇంతవాడిని చేశాయి. జగన్‌ అనే నేను చెబుతున్నా.. ఈ రాష్ట్ర భవిష్యత్తుకు, మీ భవిష్యత్తుకు నాదీ బాధ్యత’’ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 13 సంవత్సరాలు అయిపోయింది. 13 ఏళ్లుగా ఇదే అభిమానం, ఇదే నమ్మకం నాపై చూపిస్తూ.. మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా.. రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ రెండో రోజు సమావేశంలో పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్‌ జగన్‌ ముగింపు ఉపన్యాసం చేశారు. సుదీర్ఘమైన ప్రసంగంలో పార్టీ ప్రస్థానం, కార్యకర్తలు, నాయకుల పాత్ర, ఎదుర్కొన్న సవాళ్లు, అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. 

ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..
విజయవాడ – గుంటూరు మధ్య ఈరోజున ఒక మహా సముద్రం కనిపిస్తోంది. కనుచూపుమెరలో ఎక్కడా ఖాళీ స్థలం కనిపించడం లేదు. వర్షం పడుతున్నప్పటికీ ఏ ఒక్కరూ చెక్కుచెదరలేదు. అంచెంచెల విశ్వాసంతో, చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తున్నారు.. అనురాగాన్ని పంచిపెడుతున్నారు. ఇది పార్టీ కార్యకర్తలు, అభిమానుల మహాసముద్రం కనిపిస్తుంది. ఆత్మీయుల సునామీ. 

నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్న పార్టీగా

దశాబ్దం పాటు కష్టాలను భరించి, అవమానాలను సహించి, త్యాగాలు చేసిన సైన్యం ఇక్కడుంది. మన పార్టీ భావాలను, విధానాలను, బాధ్యతలను ఎంతో అభిమానంతో మీ భుజాల మీద మోస్తున్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులు.. ఈ మహాసైన్యానికి నిండుమనసుతో సెల్యూట్‌ చేస్తున్నాను. నా కష్టంతో పాటు, మీ త్యాగాలు, శ్రమ, మీ కష్టాల పునాదుల మీద ఏర్పడిన మనందరి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ మూడేళ్ల కాలంలో మనందరి ప్రభుత్వం ద్వారా దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనల వల్ల వచ్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవం గురించి రైతు, మహిళా, విద్య, వైద్యం, వ్యవసాయ విప్లవాల గురించి గ్రామం నుంచి జిల్లా వరకు పరిపాలనలో తీసుకువచ్చిన మార్పుల గురించి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్న పార్టీగా, రాబోయే తరం మీద బాధ్యత ఉన్న పార్టీగా మన భవిష్యత్తును ఎంత గట్టి పునాదుల మీద నిర్మించుకున్నామో.. వివరిస్తూ నా భావాలను ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 

వెనకడుగు వేయలేదు. 

13 ఏళ్ల మన ప్రయాణాన్ని క్లుప్తంగా ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే.. 2009 సెప్టెంబర్‌ 2వ తేదీన దివంగత నేత, మన ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి గారు అనూహ్యంగా మరణించడం. ఆయన మరణంతో తమకు దిక్కు ఎవరు, బతకలేమన్న భావనతో ఉమ్మడి ఆంధ్రరాష్ట్రంలో దాదాపుగా 700 మందికి పైగా మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వీల్లేదన్న పార్టీని ఎదురించినందుకు అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్‌ రెండూ కలిసి నాపై కేసులు వేశాయి. దేశంలో శక్తివంతమైన వ్యవస్థలను నా మీదకు ఉసిగొల్పారు. అన్యాయమైన ఆరోపణలు, అరెస్టు సైతం చేయించడానికి వెనకడుగు వేయలేదు. 

దేవుడి స్కిప్టు మరోలా రాశాడు.

జగన్‌ ఆరోజు ఓదార్పు యాత్ర మానుకుంటే..  ఆ కేసులే ఉండేవికాదు. అలాంటి బెదిరింపులకు జగన్‌ లొంగే వ్యక్తే అయితే.. ఈరోజు మీ జగన్‌.. మీ సమక్షంలో, మీ ముందు ఇలా ఉండేవాడే కాదు. కానీ, ఆరోజున నన్ను టార్గెట్‌ చేసిన మనుషులు ఒకటి అనుకుంటే.. దేవుడి స్కిప్టు మరోలా రాశాడు. మరి ఈరోజున ఆ పార్టీల పరిస్థితి ఏంటీ..? మన పార్టీ పరిస్థితి ఏంటీ..? ఒక్కసారి గమనిస్తే.. 

ఒక్కడితో ప్రారంభమైన ప్రయాణం

ఆరోజున చట్టసభల్లో మన సంఖ్యాబలం కేవలం 2, నేను ఎంపీగా, అమ్మ ఎమ్మెల్యేగా.. అది కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి మా ప్రయాణం ప్రారంభించాం. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఒకటితో ప్రారంభమైన ఎమ్మెల్యేల ప్రయాణం ఈరోజు 151కి చేరింది. ఒక్కడితో ప్రారంభమైన ఎంపీల ప్రయాణం.. ఈరోజు లోక్‌సభలో 22కు చేరింది. అన్యాయంగా అరెస్టు చేయించిన ఆ పార్టీకి ఈ రాష్ట్రంలో నామరూపాలు కూడా లేకుండా చేశారు ప్రజలు, దేవుడు. ప్రజలందరి చల్లని దీవెనలు, దేవుడి దయ, మీ అందరి అండదండలతో మాత్రమే అది సాధ్యమైంది. 

సంతలో పశువుల మాదిరిగా కొన్నారు

ఆ తరువాత 2014 ఎన్నికల్లో 45 శాతం ఓట్లు వచ్చి.. కేవలం 1 శాతం ఓట్ల తేడాతో శాసనసభలో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. 67కు మనబలం పరిమితమైంది. 9 మంది ఎంపీలను గెలుచుకున్నాం. 2014లో అప్పుడు కూడా మళ్లీ కుట్రలు, కుతంత్రాలే. జగన్‌కు ఊపిరాడనివ్వకూడదని కుట్రలు చేశారు. 67 మంది ఎమ్మెల్యేల్లో 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొన్నారు. 9 మంది ఎంపీల్లో ముగ్గురు ఎంపీలను సంతలో పశువుల మాదిరిగానే కొన్నారు. పార్టీ నిర్వీర్యం అయిపోవాలి.. జగన్‌ కనపడకుండా పోవాలని కుయుక్తులు, కుతంత్రాలు చేశారు. కానీ, దేవుడు మరోలా స్క్రిప్టు రాశాడు.

మీ అందరి అండదండలతో

2019 ఎన్నికలు వచ్చిన తరువాత మన దగ్గర నుంచి అన్యాయంగా ఏ పార్టీ అయితే 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేసిందో.. అదే పార్టీకి మళ్లీ 2019లో వచ్చింది.. అవే 23స్థానాలు ఎమ్మెల్యేలు, అవే 3 స్థానాలు ఎంపీలు. దేవుడు స్క్రిప్టు చాలా గొప్పగా రాస్తాడు. అది కూడా మే 23వ తేదీన ఎన్నికల రిజల్ట్‌. ఎప్పటికైనా కూడా మంచే గెలుస్తుందనేందుకు ఇదే నిదర్శనం. ఎన్నికలు అయిపోయాయి.. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు, మీ అందరి అండదండలతో ఈ మూడేళ్లలో మన ప్రభుత్వం కొనసాగుతోంది. ఎన్నికలు అయిపోయిన తరువాత ప్రమాణస్వీకారం రోజున, మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో.. అవన్నీ కూడా తూచా తప్పకుండా నెరవేర్చేందుకు ప్రతిరోజూ అడుగులు వేస్తున్నాం. 

ఈ మూడేళ్లలో నా ఫోకస్‌..

గత ప్రభుత్వం మాదిరిగా ఎమ్మెల్యేలను కొనాలని, వారి పార్టీని నిర్వీర్యం చేయాలని దిక్కుమాలిన ఆలోచనలు ఎప్పుడూ చేయలేదు. నా ఫోకస్‌ ప్రతిపక్షం మీద పెట్టలేదు. నా ఫోకస్‌ అంతా ఎంత మంచి చేస్తాం.. ఎలాంటి పాలన అందించగలుగుతామనే అంశంపై నా ఫోకస్‌ పెట్టాను. ఒక పేద కుటుంబం, ఒక రైతు కుటుంబం, ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో ఉండే సభ్యులు, వారి అవసరాలు.. అణగారిన సామాజిక వర్గాలకు ఆర్థికంగా, అధికారంలో వాటాపరంగా రెండు అంశాల్లో న్యాయం చేయడం. అవ్వాతాతలకు, అక్కచెల్లెమ్మలకు, పిల్లలకు న్యాయం చేయడం.. ఇలాంటి అంశాల మీదనే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌  పార్టీ ప్రభుత్వం.. ఫోకస్‌ పెట్టింది. 

నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను

నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఏదైతే మాటలు చెప్పానో.. ఆ చెప్పిన ప్రతి మాట కూడా అమలు చేసేందుకే దృష్టిపెట్టడం జరిగింది. ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రజల్లో, వారి గుండెల్లో చెరగని స్థానం కల్పించుకోవాలని ఆరాటపడ్డాం. 

క్యారెక్టర్, క్రెడిబులిటీ

ఒక మనిషికైనా, రాజకీయ పార్టీకైనా రెండు గుణాలు ఉండాలి. క్యారెక్టర్, క్రెడిబులిటీ. ఈ రెండే మనిషిని, నాయకుడిని, పార్టీనైనా నడిపించేవి ఈ రెండు గుణాలే. ఇవే మన పార్టీ ఫిలాసఫీ. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. ఐదు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాలను ప్రారంభించాం. ఏడాదిలో రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాం. 

పాలనను మరింత పారదర్శకంగా

అంతకుముందు ప్రభుత్వం గ్రామాన్ని దోచుకునేందుకు జన్మభూమి కమిటీలు పెడితే.. మనందరి ప్రభుత్వం గ్రామస్వరాజ్యాన్ని నిజం చేస్తూ దేశ పరిపాలన చరిత్రలోనే గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు వలంటీర్‌ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ స్థానిక పరిపాలనలో గొప్ప విప్లవాత్మక మార్పు తీసుకువచ్చేందుకు ఉపయోగపడుతున్నాయి. పాలనను మరింత పారదర్శకంగా, మరింత మెరుగ్గా అందించేందుకు, పాలనను సూపరవైజ్‌ చేసేందుకు, పర్యవేక్షించేందుకు జిల్లాల పునర్‌ విభజన, మరిన్ని రెవెన్యూడివిజన్లు, పోలీస్‌ డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 

చిప్‌ మైండ్‌లోనూ, గుండెలోనూ ఉండాలి

44 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం ఉన్నాయని ఢంకా భజాయించుకొని కొంతమంది చెప్పుకుంటుంటారు. నేను అడుగుతున్నా.. ఏరోజు అయినా ఇలాంటి విప్లవాత్మక ఆలోచన వచ్చిందా.. అని అడుగుతున్నా. ఎందుకంటే ప్రజల కష్టాలు, వారి బాగోగుల గురించి అర్థం చేసుకొని ఆలోచించే చిప్‌ మైండ్‌లోనూ, గుండెలోనూ ఉండాలి. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు ఒక రింగ్‌ను చూపించి ఆ రింగ్‌లో చిప్‌ ఉందని చెప్తున్నాడు. చంద్రబాబు మాదిరిగా వేలి ఉంగరం, మోకాళ్లలో, అరికాళ్లలో చిప్‌ ఉంటే లాభం ఉండదు. చిప్‌ ఉండాల్సింది మెదడులో, గుండెలో ఉంటే.. అప్పుడే ప్రజలకు మంచి చేసే ఆలోచనలు వస్తాయని చంద్రబాబుకు తెలియజేస్తున్నాను. 

కుప్పం ప్రజలకు మంచి జరగాలని చేశాం

చంద్రబాబుకు మంచి చేయాలనే ఆలోచన, తపన లేదు. ఆయనకు ఉన్నది పదవి వ్యామోహం తప్ప.. ప్రజల మీద మమకారం ఆయనకు ఎప్పుడూ లేదు. అందుకే కదా 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు.. అప్పట్లో ఏమీ చేయకపోగా.. ప్రజల ఒత్తిడి మేరకు చివరకు మన ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు. తన కుప్పం నియోజకవర్గంలో రెవెన్యూ డివిజన్‌ ఇవ్వండి అని అర్జీ పెట్టుకున్నాడు. ఆ రెవెన్యూ డివిజన్‌ కూడా ఇచ్చింది మీ జగనన్న ప్రభుత్వమే.. మన ప్రభుత్వమే.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయే. అది కూడా ఎందుకు చేశామంటే.. కుప్పం ప్రజలకు మంచి జరగాలని చేశాం. 

ప్రజల మీద మమకారం. 

ఒకసారి ఆలోచన చేయమని అడుగుతున్నా.. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది. ఆ పార్టీకి, మన పార్టీకి తేడా ఏమిటీ..? వారికి రాజకీయం అంటే ప్రజలతో వ్యాపారం చేయడమే. వారి దృష్టిలో రాజకీయం అంటే ప్రజల నుంచి ఎలా దోచుకోవాలి.. దోచుకున్న సొమ్మును ఎలా పంచుకోవాలి.. అదే వారికి తెలిసిన నిర్వచనం. రాజకీయం అంటే మనకు తెలిసిన నిర్వచనం.. ప్రజల మీద మమకారం. 

టీడీపీ సిద్ధాంతం వెన్నుపోట్లు

తెలుగుదేశం పార్టీ అంటేనే పెత్తందారి పార్టీ. పెత్తందారుల చేత, పెత్తం దారుల వల్ల, పెత్తం దారుల కోసం నడుస్తున్న  పార్టీ.. చంద్రబాబు హయాంలోని తెలుగుదేశం పార్టీ. దాని భావజాలంలోనే ఏ కోశాన కూడా మానవత్వం, హృదయం, పేదల పట్ల మమకారం అనేవి ఎక్కడా కనిపించవు. చంద్రబాబు పార్టీ చరిత్ర అడుగడుగునా.. ఒకటే నిరూపిస్తుంది. అది వెన్నుపోట్లు. టీడీపీ స్థాపకుడు ఎన్టీఆర్‌ అయినా సరే.. ఎన్నికలప్పుడు ఉపయోగించుకొని ప్రజలనైనా సరే. టీడీపీ సిద్ధాంతం వెన్నుపోట్లు. చరిత్ర కూడా ఇదే చెబుతుంది. 

పేదల గుండెల చప్పుడుగా మన పార్టీ పరిపాలన సాగిస్తుంది. మనకు, వాళ్లకు మధ్య ఉన్న తేడాను గమనించండి. కాబట్టే మన రాష్ట్రంలో ఒక యుద్ధం జరుగుతుంది. రెండు సిద్ధాంతాల మధ్య, భావాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో పేదలు, దిగువ మధ్య తరగతి వర్గాలకు న్యాయం చేయాలి.. అండగా నిలవాలని మనం..ఆ పేదలకు, దిగువ మధ్య తరగతి వర్గాలకు న్యాయం చేయడానికి వీల్లేదని టీడీపీకి తోడు దుష్టచతుష్టయం ఎలా వాదిస్తున్నాయో.. ఎంత నిసిగ్గుగా ప్రయత్నం చేస్తున్నాయో..  కొన్ని ఉదాహరణలు. 

తనకో నీతి, ఎదుటివారికి ఒక నీతి పాటించేవారిని, రెండు నాల్కల వారు, నీతిలేని వారు అలాంటి వారిని ఏమంటామో మీరే చెప్పండి. 

తమ పిల్లలను, తమ మనవళ్లను ఇంగ్లిష్‌ మీడియం బడుల్లో చదివిస్తారంట.. పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియం బడుల్లోనే చదవాలంట. ఈ టీడీపీ భావాలకు, దుష్టచతుష్టయం భావాలకు.. పేద పిల్లలు చదివే గవర్నమెంట్‌ బడుల్లో కూడా ఇంగ్లిష్‌ మీడియం ఉండాలన్న మన పార్టీ సిద్ధాంతానికి మధ్య ఎంత తేడా కనిపిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. పేద కుటుంబాల పిల్లలు కూడా వారి పొలాల్లోనే కూలీలుగా, వారి వ్యాపారాలకు, పరిశ్రమలకు వెట్టిచాకిరి చేసేవారికి మన పిల్లలు మిగిలిపోవాలనేది ప్రతిపక్షాల ఆలోచన, దుష్టచతుష్టయం ఆలోచన. అణగారిన కులాలు, వర్గాలు ఏనాటికి ఎదగకూడదు అనేది చంద్రబాబు విధానం. ఆ విధానంలో భాగంగానే.. విద్యా విధానం కూడా వారిది ఈ మాదిరిగానే సాగుతోంది. ఈ విషయంలో ఈ మాదిరిగా చేయడం అధర్మం కాదా ఆలోచన చేయండి. 

ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలు 8వ తరగతిలోకి వచ్చేసరికి మంచి ట్యాబ్‌ ఉచితంగా ఇచ్చి.. మార్కెట్‌లో రూ.24 వేలకుపైగా విలువ చేసే పాఠాలను ఆ పిల్లలకు ఉచితంగా అందించేందుకు బైజూస్‌ యాప్‌ను ఉచితంగా ఇస్తుంటే.. అదేం జ్యూస్‌ అని చంద్రబాబు వెటకారం చేస్తున్నాడు. ఇలాంటి ఉద్దేశాలు ఉన్న చంద్రబాబును ఒక్కసారి చూడండి. టీడీపీ గవర్నమెంట్‌ ఎవరిని ప్రోత్సహిస్తుందంటే.. నారాయణ, చైతన్య స్కూళ్ల కోసం, బాగు కోసం శ్రమిస్తుంది. మన ప్రభుత్వం గవర్నమెంట్‌ బడులను కార్పొరేట్‌ స్థాయికి తీసుకెళ్లేందుకు పనిచేస్తుంది. 

తపన, తాపత్రయంతో

గవర్నమెంట్‌ బడుల్లో కార్పొరేట్‌ స్థాయిలో చదువులు అందాలి.. రావాలి అని, పేదలకు అవసరం అని, తలరాతలు మారాలంటే ఇది జరగాలని, మన సిద్ధాంతమని శ్రమిస్తున్నాం. తేడా కూడా చూపిస్తున్నాం. మనం ఏకంగా ఒక్క చదువుల రంగంలోనే తొమ్మిది పథకాలను అమలు చేస్తున్నాం. పిల్లలను చదివిస్తున్న తల్లులకు ప్రోత్సాహకంగా జగనన్న అమ్మ ఒడి ద్వారా ఇప్పటి వరకు మనం అందించింది.. రూ. 19,617 కోట్లు కేవలం ఒక్క పథకం ద్వారా అందించాం. ఎన్నికలప్పుడు చెప్పాను.. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి.. రెండు నెలలు ఓపికపట్టు అక్క, చెల్లెమ్మ అన్న వస్తాడు.. మన పిల్లలను కేవలం బడికి పంపిస్తే చాలు అమ్మ ఒడి అనే పథకాన్ని ఇస్తాడు.. సంవత్సరానికి రూ.15వేలు మన చేతుల్లో పెడతాడని చెప్పిన మాట గుర్తుందా..? ఎన్నికలు అయిపోయాయి.. మూడో సంవత్సరం దాటింది..  అక్షరాల అక్కచెల్లెమ్మలకు కేవలం అమ్మ ఒడి పథకం ద్వారానే రూ.19,617 కోట్లు అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టడం జరిగింది. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. కేవలం బటన్‌ నొక్కుతున్నాం.. 44 లక్షల మంది ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతున్నాయి. 80 లక్షల మంది పిల్లలకు మంచి జరుగుతుంది. నాడు–నేడు వంటి తొమ్మిది పథకాలు కేవలం  విద్యారంగంలో అడుగులు ముందుకేస్తున్నాం. నాడు–నేడు పథకం మంచి చేస్తుందని నమ్మి 56,703 గవర్నమెంట్‌ బడుల రూపురేఖలు మార్చడం కోసం రూ.16,352  కోట్లు ఖర్చు చేస్తున్నాం. మన పిల్లలు వెళ్లి బడులు బాగుండాలి.. గొప్పగా చదవాలి.. ఆ చదువులతో తలరాతలు మారాలని తపన, తాపత్రయంతో చేస్తున్నాం. 

ఈ మూడేళ్లలో విద్యారంగంలో వివిధ పథకాల మీద పిల్లల చదువుల కోసం మనం ఖర్చు చేసింది అక్షరాల రూ.52 వేల కోట్లు అని సగర్వంగా చెబుతున్నా. గవర్నమెంట్‌ బడుల గురించి, పిల్లల గురించి కానీ, తల్లిదండ్రుల గురించి కానీ, టీడీపీ, చంద్రబాబు, దుష్టచతుష్టయం ఏరోజైనా ఆలోచించిందా..? ఈ మాదిరిగా చేస్తున్న మనం ధర్మం వైపున ఉన్నాం.. అధర్మం వైపున వాళ్లున్నారు. 

చంద్రబాబు సీఎంగా ఉండగా ఆరోగ్యశ్రీ నీరుగార్చడమే కాకుండా.. ప్రభుత్వ ఆస్పత్రులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఆస్పత్రులకు వెళ్లాలంటే ఆరోగ్యశ్రీ పేషంట్లు భయపడే పరిస్థితి. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు నెలల తరబడి బిల్లులు పెండింగ్‌. గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో డాక్టర్లు ఉండరు.. వసతులు ఉండవు.. ఆపరేషన్‌ చేయాలంటే సెల్‌ఫోన్‌ లైట్లతో చేసేవారు. ఆస్పత్రిలో పిల్లలను ఎలుకలు సైతం కొరికిన సన్నివేశాలు గుర్తుకు తెచ్చుకోండి. 108, 104 వాహనాల సంగతి పట్టించుకున్న పాపాన పోలేదు. తేడా గమనించండి. 

ప్రజల జీవితాలను గొప్పగా మార్పు చేసే దిశగా

ఈ మూడు సంవత్సరాల్లో మొత్తంగాగవర్నమెంట్‌ ఆస్పత్రులను నాడు–నేడుతో పూర్తిగా రూపురేఖలు మారుస్తున్నాం. ఏకంగా 16 మెడికల్‌ కాలేజీలను నిర్మిస్తున్నాం. ఆరోగ్యశ్రీ పరిధిని 1000 రోగాల నుంచి ఏకంగా 2466 రోగాలకు పెంచడం జరిగింది. గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి పీహెచ్‌సీలో పనిచేస్తున్న డాక్టర్ల నుంచి మండలానికి రెండు  పీహెచ్‌సీలు, గ్రామంలో విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టు దిశగా అడుగులు వేస్తూ.. ఆరోగ్యశ్రీని, ప్రజల జీవితాలను గొప్పగా మార్పు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. 

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో వైద్య, ఆరోగ్య రంగం మీద చేసిన ఖర్చు కేవలం రూ.7464 కోట్ల అయితే.. మనందరి ప్రభుత్వం మూడేళ్ల కాలంలోనే రూ. 30 వేల కోట్ల ఖర్చు చేసింది. పేదలను బతికించే విషయంలో ఏ పార్టీ, ఏ మాదిరిగా పనిచేసిందో గమనించండి. 

చంద్రబాబు మేనిఫెస్టో పరిస్థితి చెత్తబుట్టకు పరిమితమైంది

గతంలో చంద్రబాబు వాగ్దానం చేసిన మేనిఫెస్టో పరిస్థితి చెత్తబుట్టకు పరిమితమైంది. వాళ్ల వెబ్‌సైట్‌లో కూడా మేనిఫెస్టో కనిపించకుండాతీసేశారు. ఏకంగా 650 వాగ్దానాలు చేసి.. కేవలం 10 శాతం కూడా అమలు చేయని అధ్వాన్న పరిస్థితుల్లో చంద్రబాబు  ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చి ఇప్పటికి మూడేళ్లు  అవుతుంది. ఇంటింటికీ వెళ్లి ఇదిగో మా పార్టీ మేనిఫెస్టో ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు.. మూడు సంవత్సరాల్లో అక్షరాల 95 శాతం అమలు చేశాం.. మేనిఫెస్టో చూసి అవునా.. కాదా నువ్వే చెప్పు అక్కా, చెల్లెమ్మ అంటూ మన ప్రజాప్రతినిధులు గడప గడపకూ వెళ్తున్నారు. 

మీకు ప్రభుత్వ పథకాలు అందితేనే.. మీకు జగనన్న న్యాయం చేశాడని నమ్మితేనే వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించండి.. జగనన్నకు తోడుగా నిలవండి అని చెప్పి నిబద్ధత, మంచిచేసి అడుగుతున్న మనకు, వాళ్లకు మధ్య తేడా గమనించండి. 

అప్పట్లో ఎన్నికలప్పుడు మీకు గుర్తుందా..?

గతంలో చంద్రబాబు హయాంలో 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి.. చివరకు రూ.15 కోట్లు కూడా ఇవ్వకుండా చంద్రబాబు దిగిపోయాడు. రుణాల మాఫీ కథ దేవుడు ఎరుగు.. చివరకు సున్నావడ్డీని ఎగురగొట్టేశాడు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, కరెంటు, విత్తనాలు, ధాన్యం కొనుగోలులో కూడా బకాయిలు పెట్టివెళ్లాడు. చివరకు బీమాలో కూడా బకాయిలు పెట్టాడు. అప్పట్లో ఎన్నికలప్పుడు మీకు గుర్తుందా..? ప్రతి ఇంటికీ వెళ్లండి.. ప్రతి గ్రామంలోకి వెళ్లండి.. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అన్నకు,తమ్ముడికి చెప్పండి.. అన్నా.. రెండు నెలలు ఓపిక పట్టండి అన్న.. జగనన్న వస్తున్నాడు.. రైతు భరోసా కింద సంవత్సరానికి రూ.13500 మీ చేతుల్లో పెడతాడని చెప్పాను. 

అక్షరాల మన ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది. ఈ మూడేళ్లలో కేవలం రైతు  భరోసా కింద రూ.23,875 కోట్లు ఖర్చు చేశాం. దాదాపు 50 లక్షల పైచిలుకు కుటుంబాలకు మేలు జరిగిస్తూ అడుగులు పడ్డాయి. ఈ మూడేళ్లలో ఉచిత విద్యుత్‌ మీద ఏకంగా 27 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. పంటల బీమాగా ఇచ్చింది మరో 6684 కోట్ల రూపాయలు, ధాన్యం కొనుగోలు మీద రూ.45 వేల కోట్లు,  ఇతర పంటల కొనుగోలు మీద రూ.7వేల  కోట్లు, గతప్రభుత్వ కరెంటు బకాయిలు కూడా 9 వేల కోట్ల రూపాయిలు మన ప్రభుత్వమే చెల్లించింది. విత్తన బకాయిలు రూ.385 కోట్లు, ధాన్యం సేకరించిన బకాయిలు రూ.960 కోట్లు ఇవన్నీ మన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమే చిరునవ్వుతో కట్టింది. 

రైతును గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వం కాబట్టే ఎప్పుడూ జరగని విధంగా గ్రామ స్థాయిలో ఆర్బీకేలు స్థాపించాం. పంట వేసే విత్తనం దగ్గర్నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి అడుగులోనూ రైతన్నకుసూచనలు, సలహాలు ఇస్తూ తోడుగా నిలబడుతున్నాం. ఈ మూడేళ్ల కాలంలో వ్యవసాయ రంగం మీద చేసిన ఖర్చు రూ.1.27 లక్షల కోట్లు ఖర్చు చేశాం. 

పశ్చిమ గోదావరి జిల్లాలో పామాయిల్‌ రైతులు, తెలంగాణలో మెరుగైన రేట్లు వస్తాయి.. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు పామాయిల్‌ రేట్లు ఏకంగా టన్నుకు రూ.22 వేల రోజులు ఇక్కడ కనిపిస్తున్నాయి. 

ఇక అక్కచెల్లెమ్మల విజయానికి వస్తే.. ఈ మూడేళ్ల పాలనలో ఒక్క జగనన్న  అమ్మ ఒడి పథకం ద్వారా 44.49 లక్షల మంది తల్లులకు మేలు చేస్తూ.. రూ.19,617 కోట్లు ఇస్తే.. వైయస్‌ఆర్‌ ఆసరా ద్వారా  ఇప్పటికే 78.74 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు సగం డబ్బు రూ.12,758 కోట్లు ఇవ్వడం జరిగింది. వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా 25 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు అందించిన సొమ్ము రూ.9,180 కోట్లు. ప్రతి అక్కకు రూ.18,750 చొప్పున రెండు దఫాల్లో రూ.37500 అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. 

ఇళ్ల నిర్మాణం..అక్కచెల్లెమ్మల పేరుతోనే ఇంటి పట్టాలు అందిస్తున్నాం. 31 లక్షల ఇంటి పట్టాలు..ప్రతి అక్కను లక్షాధికారిని చేయాలనే తపన,తాపత్రయంతో వారికి అన్నగా,తమ్ముడిగా అడుగులు ముందుకువేశాం. ఇప్పటికే దాదాపు 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే.. ప్రతి  ఇంటికి లెక్క వేసుకున్నా.. 5 నుంచి 10 లక్షలు నేరుగా పెట్టినట్టు అవుతుంది. 

అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు దిశ చట్టాన్ని తీసుకువచ్చాం. ఏ అక్క, ఏ చెల్లెమ్మ అయినా ఆపదలో ఉంటే చాలు.. 1.20 కోట్ల మంది అక్కచెల్లెమ్మలు వారి ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఆపదలో ఉన్నప్పుడు ఐదుసార్లు ఫోన్‌ను షేక్‌ చేసినా సరే. ఎస్‌ఓఎస్‌బటన్‌ నొక్కినా సరే పది నిమిషాల్లో పోలీసులు వస్తున్నారు. ఈలోగా ఫోన్‌ చేసి ఏమైందని ఆరా తీస్తున్నారు. దిశా పోలీస్‌ స్టేషన్లు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, ప్రతి రెండు వేల జనాభాకు గ్రామసచివాలయంలో మహిళా పోలీసు ఇవన్నీ చంద్రబాబు పాలనలో కనీసం ఎక్కడైనా చూశామా అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను. 

పైపెచ్చు పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలు రూ.14,205 కోట్ల రుణాలు మొదటి సంతకంతో మాఫీ చేస్తానని ఎగ్గొట్టి, సున్నావడ్డీని కూడా రద్దు చేసిన పాపానికి ఆ అక్కచెల్లెమ్మలు ఏ,బీ గ్రేడులో ఉన్న సంఘాలు సీ, డీ గ్రేడ్‌లకు పడిపోయాయి. ఆ తరువాత చాలా సంఘాలు ఎన్‌పీఏలకు దిగజారిపోయాయి. మహిళా సాధికారతకు, వారి ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధికారతకు, విద్యా సాధికారతకు,రక్షణకు నిండు మనసుతో సహకరిస్తున్న పార్టీ ఏదీ  అని ఒక్కసారి ఆలోచన చేయండి అని అడుగుతున్నాను. 

సామాజిక న్యాయం..
సామాజిక న్యాయం అంటే చంద్రబాబు దృష్టిలో.. ఎన్నికల  సమయంలో వాడుకోవడం, ఆ తరువాత వదిలేయడం. మన సిద్ధాంతానికి, చంద్రబాబు సిద్ధాంతానికి తేడా చూడండి. 

మనహయాంలో మన ప్రభుత్వం రాగానే.. తొలి కేబినెట్‌లో, రెండో క్యాబినెట్‌లో ఐదుగురు చొప్పున ఉప ముఖ్యమంత్రులు ఉంటే.. అందులో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలేనని సగర్వంగా తెలియజేస్తున్నాను. శాసనసభ స్పీకర్‌గా కూడా బీసీ ఉన్నారు. శాసనమండలి చైర్మన్‌గా ఎస్సీ, డిప్యూటీ చైర్మన్‌గా మైనార్టీ మహిళ, మండలిలో మన పార్టీకి చెందిన 32 మందిని నియమించాల్సి వస్తే.. 18 మంది ఎమ్మెల్సీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారని చెప్పడానికి గర్వపడుతున్నాను. మనం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన రాజ్యసభ సభ్యులు ఎనిమిది మందిలో నలుగురు బీసీలేనని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

ఇందులో దాదాపు 80శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలు

నామినేటెడ్‌పోస్టులు, కాంట్రాక్టుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇవ్వాలని ఏకంగాచట్టం చేశాం. అందులో సగం మహిళలకే ఇవ్వాలని, రాజ్యాధికారంలో వారికి న్యాయబద్ధమైన వాటా ఉండాలని, ఎలాంటి ఉద్యమాలు, విప్లవాలు లేకుండా మనసుతో వారికి మంచి చేయాలనే ఆరాటంతో అడుగులు ముందుకువేశాం. తొలిసారిగా శాశ్వత బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశాం. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మనది. వివక్ష లేకుండా, లంచాలకు తావులేకుండా నేరుగా బటన్‌ నొక్కి ప్రతి అక్క, చెల్లెమ్మకు, ప్రతి పేద కుటుంబానికి మంచి చేసేందుకు బటన్‌ నొక్కి ట్రాన్స్‌ఫర్‌ చేసింది అక్షరాల రూ.1.63 లక్షల కోట్లు అందించాం. ఇందులో దాదాపు 80శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలు ఉన్నారు. 

అప్పుడు కూడా ఇదే బడ్జెట్

అప్పుడు కూడా ఇదే బడ్జెట్, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడూ ఇదే బడ్జెట్‌.. ముఖ్యమంత్రి మీ అన్న జగన్‌. మరి అప్పుడు వారు ఎందుకు చేయలేకపోయారు.. ఇప్పుడు మీ జగన్‌ ఎలా చేయగలుగుతున్నాడని ఆలోచన చేయండి. అప్పుల విషయానికొస్తే.. అప్పట్లో చంద్రబాబు మీ అన్న జగన్‌  కంటే ఎక్కువగానే చేశాడు. మీ జగన్‌ అంతకంటే తక్కువగా అప్పులు చేశాడు. అయినా వారు ఎందుకు చేయలేకపోయారు.. మీ అన్న మీ తమ్ముడు ఎందుకు చేయగలుగుతున్నాడు.. కారణం మీ జగన్‌ బటన్‌ నొక్కుతున్నాడు.. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు.. నేరుగా అక్కచెల్లెమ్మల అకౌంట్‌లోకి డబ్బులు వెళ్తున్నాయి. 

చంద్రబాబుహయాంలో బటన్‌లు లేవు, నొక్కేది లేదు.. డబ్బులు నేరుగా దోచుకో.. పంచుకో పద్థతి ఉండేది. డబ్బులో ఇంత ఈనాడుకు, ఇంత ఆంధ్రజ్యోతికి, ఇంత టీవీ5కి, ఇంత తన దత్తపుత్రుడికి, మిగిలిందంతా తనకు.. తేడాను గమనించండి.. 

గజదొంగల ముఠాకు, మంచి పాలనకు మధ్య తేడా గమనించండి.

బాబూ హయాంలో సామాజిక న్యాయం అంటే.. ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అవహేళన చేసిన రోజులు. బీసీల తోకలు కత్తిరిస్తా అని అపహాస్యం చేసిన రోజులు చంద్రబాబు హయాంలో ఉండేవి. ఎస్టీలకు, మైనార్టీలకు కనీసం ఒక్క మంత్రి పదవి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. కనీసం ట్రైబల్‌ అడ్వయిజరీ కమిటీ అనే రాజ్యాంగబద్ధసంస్థను ఏర్పాటు చేయని హయాం చంద్రబాబు పాలనలో ఉండేది. ఈరోజు అందుకు భిన్నంగా ఈ వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులతో పాటు, ఏఎంసీలు, ఆలయ బోర్డుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు కల్పించి మొత్తం మంత్రిమండలిలో 70 శాతం పదవులు ఇచ్చాం. 

ఇవాళ జరుగుతున్న యుద్ధంలో ధర్మం, న్యాయం ఎవరివైపున ఉంది.. అధర్మం, అన్యాయం ఎవరిపైపున ఉంది అనేది ఆలోచన చేయండి. 

పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తుంటే దాన్ని అడ్డుకునేందుకు రకరకాలుగా కోర్టుల్లో కేసులు వేశారు. అమరావతిలో 54 వేల ఇళ్లు పేద అక్కచెల్లెమ్మలకు ఇస్తుంటే అడ్డుకుంటూ.. అమరావతిలో ఇళ్లు ఇస్తే.. సామాజిక సమతూల్యత దెబ్బతింటుందని నిసిగ్గుగా ఏకంగా కోర్టులో కేసులు వేసిన చరిత్ర చంద్రబాబుది. బృహత్తర యజ్ఞంగా అక్కచెల్లెమ్మలకు ఇళ్లు కట్టించే కార్యక్రమం మీ ప్రభుత్వం చేస్తుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా అడుగులు ముందుకే పడతాయి.

మూడు ప్రాంతాలకు న్యాయం చేస్తూ

రాష్ట్రంలో మూడు ప్రాంతాలు ఉన్నాయి.. మూడు ప్రాంతాల ప్రజలకు ఆత్మగౌరవం ఉంది. మరోసారి మన రాష్ట్రంలో ఎలాంటి ఉద్యమాలు రాకుండా అన్యాయం జరిగిందనే వాదనలకు అవకాశం ఇవ్వకుండా మూడు ప్రాంతాలకు న్యాయం చేస్తూ మూడు రాజధానులు ఇస్తామంటే.. అందులో అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తామంటే.. టీడీపీ కేవలం బాబు అండ్‌ కో, దుష్టచతుష్టయం కొనుగోలు చేసిన బినామీ భూముల రేట్ల కోసం అడ్డుపడుతున్నారు. ఇది టీడీపీకి, దుష్టచతుష్టయానికి తెలిసిన ప్రాంతాల న్యాయం. ఇది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో వాళ్లకు తెలిసిన న్యాయం. 

ఏకంగా 26 జిల్లాలను

రాష్ట్రంలో గత 75 సంవత్సరాల్లో కేవలం రెండు జిల్లాలు మాత్రమే అదనంగా ఏర్పడితే.. ఇప్పుడు మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత మరో 13 జిల్లాలు ఏర్పాటు చేసి.. ఏకంగా 26 జిల్లాలను చేసి.. అందులో ఒక జిల్లాకు మన రాజ్యాంగ నిర్మాత, దళిత శిఖరం అంబేడ్కర్‌ పేరు పెట్టినందుకు ఏకంగా ఎస్సీ మంత్రి ఇంటిని, బీసీ ఎమ్మెల్యే ఇంటిని తగులబెట్టించిన దుర్మార్గం చంద్రబాబుది, ఆయన దత్తపుత్రుడిది. అంబేడ్కర్‌ పేరు పెట్టడం తప్పు అయినట్టుగా ఏకంగా ఎస్సీ మంత్రి ఇంటిని, బీసీ ఎమ్మెల్యే ఇంటిని తగులబెట్టడం చేశారు. ఇది నిజంగా న్యాయమేనా.. వీళ్లు మనుషులేనా ఒక్కసారి ఆలోచన చేయండి. 

మీ ప్రభుత్వం చేసింది కాబట్టే

ఇంతగా మనం ప్రజల గురించి పట్టించుకున్నాం కాబట్టే.. రైతుకు న్యాయం చేశాం కాబట్టే, సామాజిక న్యాయాన్ని అనుసరించాం కాబట్టే, ఆర్థిక న్యాయాన్ని కులమతాలకు, ప్రాంతాలకు, వర్గాలకు అతీతంగా పాటించాం కాబట్టే, ఇంతగా మహిళా సాధికారతకు బాటలు వేశాం కాబట్టే.. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు త్రికర్ణ శుద్ధితో తీసుకువచ్చాం కాబట్టే.. ఇంతగా అర్హులైన ప్రతి అక్కచెల్లెమ్మకు సంతృప్తస్థాయిలో ఇళ్ల పట్టాలు ఇచ్చాం కాబట్టే.. ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం కాబట్టే.. నవరత్నాల అమలు, ప్రభుత్వ పథకాల అమలు నిండు మనసుతో మీ అన్న, మీ ప్రభుత్వం చేసింది కాబట్టే 2019లో మనకు ఓటు వేయని వారికి కూడా పార్టీ కూడా చూడకుండా పథకాలన్నీ అర్హత ఆధారంగా అమలు చేశాం కాబట్టే.. ఈ మూడేళ్లలో జరిగిన ప్రతీ ఒక్క ఎన్నికల్లో సర్పంచ్‌ నుంచి మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, ఉప ఎన్నికల్లో ఫ్యాన్‌ గి్రరున తిరిగితే.. సైకిల్‌ చక్రాలు ఊడిపోయాయి.

దత్తపుత్రుడిని అరువుతెచ్చుకున్నాడు.

ఈ చక్రాలు లేని సైకిల్‌ను బాబు తాను తొక్కలేక తన కొడుకుతో తొక్కించలేక.. దత్తపుత్రుడిని అరువుతెచ్చుకున్నాడు. వీరు ఎన్ని కుయుక్తులు పన్నినా.. దుష్టచతుష్టయం ఎన్ని అబద్ధాలు చెప్పినా.. చివరకు దేవుడి దయతో మంచే గెలుస్తుంది. దేవుడి దయతో మొన్న 151 స్థానాలు.. 2024లో 175 స్థానాలతో తిరిగి వస్తామని తెలియజేస్తున్నాను. 

గట్టిగా మొరిగినంత మాత్రాన గ్రామ సింహాలు.. సింహాలు అయిపోవు.

ఎల్లో పేపర్లు, ఎల్లో టీవీలు, ఎల్లో సోషల్‌ మీడియా రాసినంత మాత్రాన, చూపినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవు. గట్టిగా మొరిగినంత మాత్రాన గ్రామ సింహాలు.. సింహాలు అయిపోవు. గ్రామ సింహాలన్నీ తమ బాబు మంచి చేశాడని చెప్పడం లేదు.. ఎందుకంటే చేసిన మంచి ఏమీ లేదు కాబట్టి.. మనం ఇంటింటికీ ఈ మూడేళ్లలో చేసిన మంచిని చూసి గ్రామ సింహాలుతట్టుకోలేక రోజూ అరుస్తున్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 మనం బటన్‌ నొక్కి ప్రజలకు మంచి చేస్తుంటే.. వాళ్ల బాబుకు డిపాజిట్లు కూడా దక్కవు అనే భయంతో, దురుద్దేశంతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అరుస్తున్నాయి. బాబు హయాంలో రాష్ట్రం ఏమైనా అమెరికా అయ్యింది. 

అధికారంలోకి వస్తారని పగటి కలలు కంటున్నారు

పేదలకు నెల నెలా రూ.2500 పెన్షన్‌ చెల్లిస్తుంటే.. అక్కచెల్లెమ్మలకు అమ్మఒడి పథకం ద్వారా మంచి చేస్తుంటే.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఆసరా పథకం ద్వారా మంచి జరుగుతుంటే.. చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇస్తుంటే.. రైతులకు మంచి చేస్తూ రైతు భరోసా, ఉచిత విద్యుత్, పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం చేస్తుంటే.. ఇలాంటి పథకాలకు డబ్బు పుట్టేందుకు వీల్లేదని వీరంతా ఒక్కటయ్యారు. సంక్షేమ పథకాలన్నీ ఆపేయాలని తెలుగుదేశం పార్టీ గజెట్‌ పేపర్‌ ఈనాడు.. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని వక్రీకరించి చెప్పింది. అమ్మ ఒడి బూటకం, విద్యా దీవెన నాటకం అని వీటన్నింటినీ ఎత్తేసేందుకు స్కెచ్‌లు కూడా గీస్తున్నారు. వీళ్లను ఎవరో నమ్మినట్టుగా.. అధికారంలోకి వస్తారని పగటి కలలు కంటున్నారు. 

ఎవరైనా పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే..

బాబు రాబోయే ఏ ఎన్నికల్లో అయినా, ఎవరైనా పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. ఈ సంక్షేమ పథకాలన్నింటికీ వ్యతిరేకంగా ఓటు వేసినట్టేనని కచ్చితంగా ప్రతి ఇంటికి తీసుకెళ్లండి. ఇలాంటి పత్రికలు, ఇలాంటి పార్టీలు ప్రజా జీవితంలో ఉండొచ్చా.. ఇంతటి దుర్బుద్ధితో ఉన్నవారు రేపు పొద్దున ఏం చేస్తారో ఆలోచన చేయండి. వీళ్లకు ప్రజల మీద మమకారం లేదు, చిత్తశుద్ధి లేదు. ఇలాంటి పత్రికలు, ఇలాంటి పార్టీలు రేపు పొద్దున ఎన్నికల్లో మేలు కోసం దుర్బుద్ధితో వీరంతా దొంగ వాగ్దానాలు చేస్తారని ప్రతి ఇంటికీ తీసుకెళ్లండి. అన్న కంటే ముందు చంద్రబాబు పాలన చూశారు.. ఆ పాలనలో మీరు మోసపోయారా లేదా అని అడగండి.. ఆ పార్టీ, దుష్టచతుష్టయం చరిత్ర అందరికీ తెలియజేయండి. 

ఈ దొంగలముఠాతో తస్మాత్‌ జాగ్రత్త​

సంక్షేమం, అభివృద్ధి పథకాలన్నీ ఆగిపోవాలి. వారి బాబు మాత్రమే సీఎం కుర్చీలో కూర్చోవాలి. సంక్షేమ పథకాలన్నీ పూర్తిగా ఆపేస్తే.. ఆ తరువాత వాళ్ల బాబూ.. చంద్రబాబు ఈనాడు కానుక, బాబు ఏబీఎన్‌ దీవెన, నారా టీవీ5 భరోసా ఇలాంటి పథకాలు తీసుకొచ్చి.. దోచుకో.. పంచుకో జరుగుతుంది. ఈ దొంగలముఠాతో తస్మాత్‌ జాగ్రత్త అని ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఇలాంటి దుష్టచతుష్టయం, గజదొంగల ముఠా నుంచి మనందరి ప్రభుత్వాన్ని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా.. మన రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్న సామాజిక న్యాయాన్ని రక్షించుకుంటూ, కొనసాగించుకుంటూ.. ఇటువంటి తరుణంలో మరిన్ని అడుగులు ముందుకుపడాలంటే మనందరి ప్రభుత్వాన్ని అడుగడుగునా కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అని తెలియజేస్తున్నాను. లబ్ధిపొందుతున్న బాధ్యత కూడా. 

మనకు ఉన్నదల్లా నీతి, నిజాయితీ, మాటకు ప్రాణం ఇచ్చే గుణం

మనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు ఎవరూ మనకు లేరు. మనకు అసత్యాలు ప్రచారం చేయడం కూడా రాదు. మనకు వెన్నుపోట్ల ద్వారా అధికారం తీసుకోవడం అంతకంటే రాదు.. ఆ చరిత్ర మనకు లేదు. మనకు ఉన్నదల్లా నీతి, నిజాయితీ, మాటకు ప్రాణం ఇచ్చే గుణం, నిబద్ధతతో పనిచేసే ఆలోచనలు. ప్రజలకు మేలు చేయాలనే తపన. నిజాయితీతోనే మన మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలు మూడేళ్లు కాకముందే 95 శాతం అమలు చేశాం. అయినా దుష్టచతుష్టయం ప్రతి రోజూ అసత్యాలు ప్రచారం చేస్తుంది. ఎన్నికలు దగ్గరపడే కొద్ది అసత్యాల ప్రచారం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇటువంటివి అన్నీ జరుగుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో నాకున్న గుండె ధైర్యం మీరే అని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

అర్జునుడి పాత్ర మీదే

ఈ కౌరవ సైన్యాన్ని ఓడించడంలో అర్జునుడి పాత్ర మీదే. మన కార్యకర్తలు, మన అభిమానులు, మన సంక్షేమ పథకాలు అందుకుంటున్న కుటుంబ సభ్యులు, ప్రతి గ్రామంలో కనీసంగా 85 శాతం మేర అందుకుంటున్న ప్రజలు.. మీరే మన సైన్యం. ఇంటింటికీ, మనిషి మనిషికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ఎలా అందించామో.. గడప గడపకూ వెళ్లి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు వెళ్లి వివరిస్తున్నారు. ప్రతి ఇంటికి అందిన ప్రయోజనాలను లెటర్ల రూపంలో చూపిస్తూ పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త, ప్రతి వలంటీర్‌ ఏకంకండి. మొత్తం ప్రభుత్వమంతా ప్రతి ఇంటికి వెళ్లి చేసిన మంచిని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు వివరించండి. 

175 సీట్లకు 175 గెలుచుకునేందుకు అడుగులు

95 శాతం వాగ్దానాలు నెరవేర్చి, 85 శాతం ఇళ్లకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందించిన ప్రభుత్వాన్ని ప్రజలు సంతోషంగా దీవిస్తున్నారని, మీ అందరి అండదండలు, తోడు ఉన్నంత వరకు, దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు 175కు 175 సీట్లు లక్ష్యంగా అడుగులు ముందుకేస్తామని చెప్పండి. ఇది అసాధ్యం కానే కాదు. ఇది సుసాధ్యం. కారణం ఏంటంటే.. మనం చేసిన మంచిని చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పం ప్రజలు కూడా గుర్తించారు.. ఆమోదించారు కాబట్టే కుప్పం మున్సిపాలిటీ క్లీన్‌స్వీప్‌ చేశాం. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు క్లీన్‌స్పీప్‌ చేశాం. మీ జగన్‌.. మీ పార్టీ 175 సీట్లకు 175 గెలుచుకునేందుకు అడుగులు ముందుకు వేస్తుంది. 

అండగా నిలబడదామని ప్రతి ఒక్కరినీ అడగండి. 

మనందరి ప్రభుత్వం ద్వారా జరిగిన మంచిని వివరిస్తూ దీవించమని ప్రతి అక్కను, చెల్లెమ్మను అడగండి. చంద్రబాబు పాలనలో ఇలాంటి పథకాలు ఏనాడైనా ఇచ్చాడా.. మీ అకౌంట్లలో లంచాలు, వివక్ష లేకుండా ఏనాడైనా వేశాడా అని అడగండి. ఇంటింటికీ వెళ్లి వారికి జరిగిన మంచిని వివరించి.. మన ప్రభుత్వాన్ని, పార్టీని సమర్ధించాల్సిందిగా అర్థించండి. మంచి చేస్తున్న జగనన్న ప్రభుత్వానికి అండగా నిలబడదామని ప్రతి ఒక్కరినీ అడగండి. 

ఎన్నికలకు సన్నద్ధం కండి. ​

గడప గడపకూ కార్యక్రమం జరుగుతున్న సమయంలో వార్డు, గ్రామ, మండల, నియోజకవర్గ, బూత్‌ కమిటీలు కూడా గడువులోగా పూర్తిచేయండి. ఈ కార్యక్రమంలో సహకరించండి. అన్ని కమిటీలు త్వరితగతిన పూర్తిచేసి ఎన్నికలకు సన్నద్ధం కండి. గడప గడపకూ వెళ్లినప్పుడు ఏమైనా సమస్యలు చెబితే.. వెంటనే పరిష్కరించేలా పార్టీ నాయకత్వంలో కోఆర్డినేట్‌ చేసుకుంటూ కార్యకర్తలు, అభిమానులు చొరవ చూపాల్సిందిగా కోరుతున్నాను. బూత్‌ కమిటీ సభ్యులుగా, కార్యకర్తలుగా మీ ఎమ్మెల్యేలతో కలిసి మీ గ్రామంలో కొత్తగా వచ్చిన ఆర్బీకేలు, నాడు–నేడు ఇంగ్లిష్‌ మీడియం స్కూల్, విలేజ్‌ క్లినిక్, నిర్మాణంలో ఉన్న డిజిటల్‌ గ్రంథాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలు చూపించండి. మారుతున్న మన గ్రామాన్ని చూపించండి.. వారితో కలిసి వివరించండి. 

దుష్టచతుష్టయం పన్నాగాలకు సోషల్‌ మీడియా ద్వారా తిప్పికొట్టాలి

బూత్‌ కమిటీల్లో సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 50 శాతం ఉండేలా.. అందులో 50 శాతం అక్కచెల్లెమ్మలు ఉండేలా బాధ్యత తీసుకోండి. పేద సామాజిక వర్గాలు గట్టిగా మద్దతు పలికేలా, ప్రతి ఇంటికీ వెళ్లి వారి ఆశీస్సులు కోరండి.. అంతేకాకుండా టీడీపీ చేస్తున్న లెక్కలేనని, ఎల్లో మీడియా దుష్ప్రచారాలకు, దుష్టచతుష్టయం పన్నాగాలకు సోషల్‌ మీడియా ద్వారా తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి గ్రామంలోనూ సోషల్‌ మీడియా సైన్యాన్ని తయారు చేయండి. మన పాలన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మరో 30 సంవత్సరాల భవిష్యత్తుకు కావాల్సిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, వైద్య, వ్యవసాయ, మహిళా అభ్యుదయ మూలాలకు మూడు సంవత్సరాల్లో అడుగులు పడ్డాయి. ఇది మరింతగా బలపడాలంటే అందులో మీ పాత్ర చాలా కీలకం అనేది గుర్తుపెట్టుకోండి. 

లక్షల మంది కార్యకర్తల అవిశ్రాంత కృషి

మీ తోడు, మీ అండ నన్ను ఇంతటి వాడ్ని చేశాయి. ఈరోజు ఈ స్థాయిలో మీతో మాట్లాడగలిగే పరిస్థితుల్లో పెట్టాయి. 2009లో సంఘర్షణ మొదలైన దగ్గర్నుంచి కూడా మీరు నా వెంటే ఉన్నారు. జెండాను మీ భుజానికి ఎత్తుకొని మోశారు. అన్నగా ఆప్యాయత చూపారు. తమ్ముడిగా తోడుగా నిలబ్డారు. బిడ్డగా దీవించారు. 2019లో పార్టీకి చారిత్రాత్మక విజయం సాధించి పెట్టడంతో పాటు ఆ తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లో దుష్టచతుష్టయం చెవులకు చిల్లులు పడేలా వైయస్‌ఆర్‌ సీపీ విజయ ఢంకా మోగించిందంటే.. అందుకు కారణం.. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో పాటు లక్షల మంది కార్యకర్తల అవిశ్రాంత కృషి అని సగర్వంగా తెలియజేస్తున్నాను. దేశ చరిత్రలో మన పార్టీ ఒక బలమైన ముద్ర వేయగలిగిందంటే.. కారణం మూల స్తంభాలు మీరు ఉండబట్టే.. మనం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఉజ్వల భవిష్యత్తును నిర్మించడానికి పూర్తిస్థాయిలో దృష్టిపెట్టానంటే కారణం.. క్షేత్రస్థాయిలో మీరు ఉన్నారనే ధీమా నన్ను నడిపించింది. 

మీ కష్టాల్లో, సుఖాల్లో పార్టీ ఎల్లప్పుడూ తోడుగా

అలాంటి కార్యకర్తలకు ఈరోజు ఒక్కటే చెబుతున్నా.. ఈ పార్టీ మీది. జగన్‌ మీ వాడు. మీ అన్న, మీ తమ్ముడు. ఈ పార్టీ మీది.. మనందరిది అని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. జగన్‌ అనే నేను చెబుతున్నా.. ఈ రాష్ట్ర భవిష్యత్తుకు, మీ భవిష్యత్తుకు నాదీ బాధ్యత అని కచ్చితంగా తెలియజేస్తున్నాను. మీ కష్టాల్లో, సుఖాల్లో పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 

సురక్షితంగా , జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లండి

రాష్ట్రం నలుమూలల నుంచి బక్రీద్‌ పండుగను సైతం పక్కనబెట్టి ఆశీర్వదించడానికి వచ్చారు. మీ చెరుగని చిరునవ్వులను నా గుండెల్లో పెట్టుకుంటాను. మీ ఆప్యాయతలే నన్ను  ఇంతవాడిని చేశాయి. రేపు జగన్‌ మరింత ఎదుగుతాడు అంటే అది కేవలం మీ అండదండలతోనే అని సగర్వంగా తెలియజేస్తున్నాను. మీ అందరి తోడు, దీవెనలు, దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులు సదా మనకు, మీ జగనన్నకు, మీ పార్టీకి ఎప్పుడూ ఉండాలని వినయపూర్వకంగా కోరుకుంటూ.. ఎంతో దూరం నుంచి, ఎంతో అభిమానంతో ప్లీనరీకి వచ్చిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరింత ఆత్మవిశ్వాసంతో సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని, వెళ్లేటప్పుడు నెమ్మదిగా, జాగ్రత్తగా వెళ్లండి అని సలహా ఇస్తున్నాను. 

తాజా వీడియోలు

Back to Top