తప్పుడు కేసులపై భయపడేది లేదు

ఆ బాలికకు న్యాయం జరగాలన్నదే మా ఆకాంక్ష

వైయస్ఆర్‌సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టీకరణ

బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లాను

బాలికపై దాడి ఘటనపై నేను ఎక్కడా మాట్లాడలేదు

తిరుపతి పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారు

ఈ తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేస్తాను

అలాగే నా ప్రతిష్టకు కూడా భంగం కలిగించారు

అందుకు పరువు నష్టం కేసు వేయబోతున్నాను

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వెల్లడి

బాలిక తండ్రిని భయపెట్టి మాపై కేసులు పెట్టించారు

ఎవరి సంతోషం కోసమో తిరుపతి ఎస్పీ, ఎఎస్పీలు పని 

వారు న్యాయస్థానం ముందు తప్పక నిలబడాల్సిందే

నాపై కేసులకు యాంటిసిపేటరీ బెయిల్‌ కోరను

నన్ను అరెస్ట్‌ చేసి జైలుకు పంపుతామన్నా సిద్దం

అంతిమంగా న్యాయం తప్పకుండా గెలుస్తుంది

ప్రెస్‌మీట్‌లో తేల్చిచెప్పిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

తాడేపల్లి: తప్పుడు కేసులపై భయపడేది లేద‌ని, ఆ బాలికకు న్యాయం జరగాలన్నదే మా ఆకాంక్ష అని వైయస్ఆర్‌సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి పోలీసులు తనపై నమోదు చేసిన తప్పుడు కేసులపై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయ‌న‌ ప్రకటించారు. తన ప్రతిష్టను భంగం కలిగించేలా పోక్సో, ఎస్సీ ఎస్టీ, ఐటి యాక్ట్‌లతో, 11 సెక్షన్‌లతో కేసులు నమోదు చేశారని ఆయన తెలిపారు. అందుకు బాధ్యులైన పోలీస్‌ అధికారులపై పరువు నష్టం దావా వేస్తానని వెల్లడించారు. తిరుపతి ఎస్పీ, అడిషనల్‌ ఎస్పీలు కావాలని తనపై నమోదు చేసిన కేసులను కోర్టులో సవాల్‌ చేస్తానని చెప్పారు. బుధ‌వారం వైయస్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఆ ఘటనపై ఎక్కడా మాట్లాడలేదు:
– చంద్రగిరి నియోజకవర్గం ఎల్లమందలో బాలికపై జరిగిన దాడి ఘటనపై ఎక్కడా కూడా నేను మీడియాతో మాట్లాడలేదు. అయినా కూడా బాలిక పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించానంటూ తిరుపతి పోలీసులు నాపై పోక్సోతో సహా 11 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన 22 రోజుల తరువాత బాలిక తండ్రితో బలవంతంగా స్టేట్‌మెంట్‌ తీసుకుని ఈ కేసు నమోదు చేశారు. 

పరామర్శకు వెళ్లాను. బాలిక తండ్రి కోరారు:
– దాడి ఘటన తరువాత బాలిక తండ్రి నాకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. ఆ తరువాతే నేను తలకోన ప్రాంతంలోని ఆ ఆస్పత్రికి వెళ్లాను. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని పోలీసులకు, వైద్యులకు సూచించాను. అదే సమయంలో బాలిక తండ్రి చాలా ఆవేశంతో ఉన్నారు. అక్కడే ఆయన మీడియాతో మాట్లాడిన మాటల వీడియోలను కూడా ప్రజలు తెలుసుకునేందుకు ఇక్కడ ప్రదర్శిస్తున్నాను. 
– బాలిక తండ్రి మాట్లాడుతూ.. తన పరువు పోయినా ఫరవాలేదు. కానీ తన బిడ్డను హింసించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తరువాత మెరుగైన వైద్యం కోసం బాలికను తిరుపతి ఆసుపత్రికి తీసుకు రావడం జరిగింది. బాలిక తండ్రిని మా పార్టీ నేత నాగార్జునరెడ్డి తన కారులో తీసుకువచ్చారు.
– బాలికకు వైద్యం అందిస్తుండటంతో నేను ఒంగోలుకు వెళ్ళిపోయాను. ఎక్కడా నేను మీడియాతోనూ, పబ్లిక్‌గానూ ఈ ఘటనపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అయినా కేసు పెట్టడం దారుణం.

ఘటన జరిగిన 22 రోజుల తర్వాత..:
– ఈ సంఘటన జరిగిన 22 రోజుల తర్వాత, ఉద్దేశపూర్వకంగా బాలిక తండ్రితో నాపైన, నాగార్జునరెడ్డిపైనా కేసు పెట్టించారు. బాధిత బాలికను  ఆస్పత్రిలో చేర్చినప్పుడు ఇచ్చిన రిపోర్ట్‌లోనూ, ఆమె తండ్రి రిపోర్ట్‌లోనూ, ఘటనపై తిరుపతి ఎస్పీ స్టేట్‌మెంట్‌లోనూ ఎక్కడైనా మా పార్టీ వారి పేర్లు ఉన్నాయా?.
– ఘటనకు బాధ్యుడైన వ్యక్తి నుంచి తీసుకున్న రిపోర్ట్‌లోనూ ఎవరి పేర్లు లేవు. బలవంతంగా బాలిక తండ్రితో పోలీసులు సొంతంగా తయారు చేసుకున్న 5 పేజీల స్టేట్‌మెంట్‌ పై సంతకాలు చేయించుకున్నారు. 

కేసులకు భయపడబోను:
– ఇదే ఘటనపై ఈనాడు, ఆంధ్రప్రభ పత్రికలతో పాటు పలు ప్రసార మాధ్యమాల్లో బాలికపై అత్యాచారం అంటూ రాశారు. మరి మీడియా మీద కూడా ఇదే తరహాలో కేసు నమోదు చేస్తారా? అసలు ఎటువంటి వ్యాఖ్యలు చేయని నాపైన ఇన్ని కేసులు ఎలా నమోదు చేస్తారు?.
– ఇలాంటి కేసులు పెట్టి భయపెట్టి, బెదిరించాలని అనుకుంటే ఎవరూ భయపడేవారు లేరు. 2011–19 వరకు 88 కేసులు పెట్టారు.  తమిళనాడు, కడప సెంట్రల్‌ జైల్‌కు తీసుకువెళ్ళి కొట్టారు. అన్నింటినీ ఎదుర్కొన్నాను తప్ప పారిపోలేదు. ఇంకా ఎన్ని సెక్షన్లు పెట్టినా భయపడే సమస్యే లేదు. తప్పుడు కేసులపై యాంటిసిపేటరీ బెయిల్‌ కోసం కూడా దరఖాస్తు చేయను.

పోలీసులపైనే కేసు పెట్టాలి:
– పోక్సో పేరుతో విపరీతంగా హడావుడి చేసి, ఈ సమస్యను రోడ్డుపైకి లాగిన పోలీసులపైనే నిజానికి కేసు పెట్టాలి. ఆ బాలికతో పీలేరు, రొంపిచర్ల, తిరుపతి అంటూ.. కనీసం ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియకుండా, వందలాది పోలీసులతో రాద్దాంతం చేశారు. ప్రెస్‌మీట్లు పెట్టి ఆ బాలికతో పాటు, ఆమె తండ్రి పరువును రోడ్డు మీదకు లాగింది పోలీసులే. 
– తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, ఎఎస్పీలు కూటమి ప్రభుత్వం కళ్ళలో సంతోషం చూడాలని తపిస్తున్నారు. 22 రోజుల పాటు ఆ తండ్రి చుట్టూ పోలీసులను కాపలా పెట్టారు. ఏదో ఒక రకంగా ఆయనను భయపెట్టి, బలవంతం చేసి ఆయనతో స్టేట్‌మెంట్‌ ఇప్పించి మా అందరి మీద కేసులు పెట్టించారు. 

దోషులుగా నిలబెడతాను:
– న్యాయశాస్త్రం చదువుకున్న నేను ఈ తప్పుడు కేసులు పెట్టిన వారిని న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెడతాను. వారిపై పరువునష్టం దావా వేస్తాను.
– గతంలో చంద్రశేఖర్‌రెడ్డి అనే ఎఎస్సీ ఇలాగే మా పార్టీనేత కరుణాకర్‌రెడ్డిని తప్పుడు కేసులతో వేధిస్తే, ప్రైవేటు కేసు వేశాం. దాన్ని ఆయన కోర్టులో ఎదుర్కోలేక, వైయస్సార్‌గారిని కలిసి మొర పెట్టుకోవడంతో, కరుణాకర్‌రెడ్డిగారు ఆ కేసు ఉపసంహరించుకున్నారు.
– ఎవరి ఒత్తిడితోనో చట్టాలకు, న్యాయానికి విరుద్ధ్దంగా వ్యవహరించే అధికారులు, పోలీసులు చివరికి న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడాల్సిందే. చివరకు వారు రిటైర్‌  అయినా కూడా వారిని ఈ కేసులు వదిలిపెట్టవని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు.

Back to Top