స్థిరత్వం లేని వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌

స్థిరత్వం లేని వ్యక్తిని బీజేపీ నమ్ముకుంది

అసలు మీ పార్టీ సిద్ధాంతం ఏమిటి?

రెండు, మూడు పార్టీలు కలిసినా మాకేమి అభ్యంతరం లేదు

కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదుతామంటే మాకేం అభ్యంతరం లేదు

ప్రజలను మభ్యపెట్టాలనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారా? 

2019లో టీడీపీతో పవన్‌ లాలూచీ ఒప్పందం 

మేం ఎవరితో కలవకుండా ఒంటిచేత్తో విజయం సాధించాం

వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం గురించి అనవసరంగా మాట్లాడటం విజ్ఞత కాదు

ఏడు నెలల్లోనే మా ప్రభుత్వం విఫలమైందనటం సరికాదు

ప్రభుత్వంలో అస్థిరత్వం సృష్టించాలన్న చంద్రబాబుకు పవన్‌ సాయం 

రాష్ట్ర రాజకీయాలకు చంద్రబాబు, పవన్‌ అర్హులు కాదు

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేపల్లి: రాజకీయాల్లో, వ్యక్తిగతంగా స్థిరత్వం లేని వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు.  ఏడు నెలల ప్రభుత్వం విఫలమైందని జనసేన, బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎవరు ఎన్ని కూటములు కట్టినా..మాకెలాంటి అభ్యంతరం లేదని, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్న చంద్రబాబుకు పవన్‌ సాయం చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..అంబటి మాటల్లోనే..

 బీజేపీ-జనసేన పొత్తు అని ప్రకటించారు. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లు, సీట్లు పరిశీలిస్తే..పెద్దగా ప్రభావితమైన పార్టీలుగా గుర్తింపు పొందాయి. సహజంగా రాజకీయ కూటములు కలిసి పనిచేయడం తరుచుగా జరుగుతుంటాయి. ఎన్నికలు సమీపిస్తున్న ముందు ఇలాంటివి జరగడం సహజం. కానీ చెప్పుకోదగ్గ ఎన్నికలు లేని సమయంలో ఇలాంటి పొత్తులు ప్రజల దృష్టిని మళ్లించడమే. వీరి చర్చలపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. దీనిపై మా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ వారు చేసిన ఆరోపణలపై స్పందించాలి. ప్రస్తుత ప్రభుత్వంపై బీజేపీ, జనసేన నేతలు కొన్ని విమర్శలు చేశారు. ఏడు నెలల్లో ఈ ప్రభుత్వం విఫలమైందని మాట్లాడారు. కులతత్వం, అవినీతి, కుటుంబ పాలనను మాపై రుద్దే ప్రయత్నం చేశారు. ఏడు మాసాల్లో మా ప్రభుత్వంపై ఈ మాటలు మాట్లాడినప్పుడు స్పందించాల్సి వచ్చింది. అందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. రాజకీయ పరిణామాలు చూసినప్పుడు ప్రజలకు కొన్ని విషయాలు వెల్లడిపరచాలి. రాజకీయాల్లో స్థిరత్వం లేని వ్యక్తి. వ్యక్తిగతంగా కూడా తన జీవితంలో స్థిరత్వం లేని వ్యక్తి జనసేన పార్టీని నడుపుతున్నారు. సుందరయ్య విజ్ఞానకేంద్రంలో పుచ్చపల్లి సుందరయ్య పుస్తకం చదవుతుంటే చాలా గొప్పవ్యక్తిగా కనిపించారు. తరిమెళ నాగిరెడ్డి, చెగువీరలు గొప్ప వ్యక్తులుగాను కనిపిస్తుంది. కమ్యూనిస్టు సిద్ధాంతం ఈ మానవాళిని బాగు చేసేదిగా ఆయనకు అనిపిస్తుంది.ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో కూర్చొని పుస్తకాలు చదువుతుంటే చంద్రబాబు అంత గొప్ప మేధావి, పరిపాలన దక్షుడు, లోకేష్‌ బాబు అంత తెలివి గల వారు ఎవరు లేరనిపిస్తుంది పవన్‌ కళ్యాణ్‌కు. అంతేకాదు శ్యాంప్రసాద్‌ముఖర్జి లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదువుతుంటే  మన భారత ప్రధాని మోడీ అంత గొప్పవారు ఎవరు లేరని, అమిత్‌షా అంత అనుభవజ్ఞుడు ఎవరు లేరనిపిస్తుంది పవన్‌కు పాపం. ఒక్కొక్క లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదువుతుంటే ఒక్కొరకంగా ఆయనకు అనిపిస్తుంటుంది. మరి రేపు ఏ లైబ్రరీలో కూర్చుంటారో? ఏ పుస్తకం చదువుతారో? రేపు ఎలా అనిపిస్తుందో? ..ఇలా రాజకీయ స్థిరత్వం లేని వ్యక్తిని బీజేపీ నమ్ముకొని, కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదుతామంటే మాకేమి అభ్యంతరం లేదు.మరో గొప్ప అంశం ఏమిటంటే..అన్‌ కండిషనల్‌గా కలుస్తున్నామని అంటున్నారు. ఇలా కలవాల్సిన అవసరం ఏమొచ్చిందో ప్రజలకు చెప్పాలి. అన్‌ కండిషనల్‌ అని పవన్‌ అంటే నాకు ఓ విషయం గుర్తుకు వస్తుంది. పాచిపోయిన లడ్డూ  ఇస్తే మనం సంబరం చేసుకోవాలా? అంటూ గతంలో మోదీపై ధ్వజమెత్తారే? ఇప్పుడు ఆ పాచిపోయిన లడ్డులు ఏమయ్యాయి?. ఇవాళ ఏ లడ్డులు వచ్చాయి. ఫ్రెష్‌ లడ్డులు కిస్‌మిస్‌లు వేసిన లడ్డులు ఇస్తే ఆకర్శితులయ్యారా? ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశానని చెప్పుకునే పెద్ద మనిషి..ప్రత్యేక హోదా కోసం పోరాడే సమయంలో ప్రజలు ఇచ్చిన మద్దతు ఏమైంది.  ప్రత్యేక హోదా విషయంలో మమ్మల్ని అడగమంటున్నారు..మీరు..రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పోరాటం చేస్తామని చెబుతున్నారు. అలాంటప్పుడు 23 సీట్లు ఉన్న మమ్మల్ని అడగమంటున్నారే..ఇచ్చేది కేంద్రం..అంటే బీజేపీ కాదా?. బీజేపీతో మీరు కలిసి ప్రయణం చేస్తున్నారు కదా? పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారా?. పవన్‌ విచిత్రంగా చాలా సందర్భాల్లో చాలా పార్టీలతో కలిశారు. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ప్రయాణం చేశాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలను మీరు విభేదించారు. బీఎస్పీ అధినేత మాయవతి కాళ్ల మీద కూడా పడ్డారు. ఉభయ కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిశారు. బీజేపీ, టీడీపీతో దూరంగా ఉన్నట్లు నటిస్తూ..టీడీపీని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చేందుకు ఏ రకంగా సహకరించారో?, బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో మీ అభ్యర్థులను పోటీ పెట్టి, టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో మీరు పోటి పెట్టకుండా లాలూచీ ఒప్పందం చేసుకున్నారు. ఇవాళ తిరిగి బీజేపీతో బేషరత్తుగా పొత్తు పెట్టుకున్నారు. 2024లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. అప్పటి దాకా కలిసి పోరాటం చేస్తామంటున్నారు. రాజకీయ స్థిరత్వం లేని పవన్‌ ఎప్పుడైనా నాలుగున్నర సంవత్సరాలు ఏదైనా పార్టీతో కలిసి ఉన్నారా? ఉండే గ్యారంటీ ఉందా? మీరు ఆలోచించుకోవాలి. సిద్ధాంతపరమైన అంశాలతో కలిశామంటున్నారు. మీ సిద్ధాంతాలు ఏంటో చెప్పాలి. ఈ కుటమీని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వ విఫలం, సఫలం ఏడు మాసాల్లో నిర్ణయిస్తారా? అది సాధ్యమేనా?. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. బీసీ, ఎస్సీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నాం. అమ్మ ఒడికి రూ.6400 కోట్లు జమా చేశాం. రైతు భరోసా కింద రైతులకు సాయం చేశాం. ఏ ప్రభుత్వం ఇంత వరకు చేయని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. టీడీపీ ఐదేళ్ల పరిపాలనలో వైఫల్యం చెందిందని ప్రజలే తీర్పు ఇచ్చారు. మేం 151 సీట్లతో ఇవాళ అధికారంలో ఉంటే మమ్మల్ని వైఫల్యం చెందారని అనడం సరైంది కాదు. ఐదేళ్ల పాటు మమ్మల్ని పరిపాలన చేయమని ప్రజలు తీర్పు ఇచ్చారు.  రెండు పార్టీలు కలిసినా, మూడు పార్టీలు కలిసినా మాకేమి అభ్యంతరం లేదు. తాటాకు చప్పళ్లుకు బయపడే రాజకీయ పార్టీ వైయస్ఆర్‌సీపీ కాదు. మా పోకడే వేరు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీతో మేం కలవలేదు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి రాష్ట్రంలో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీ వైయస్‌ఆర్‌సీపీ. ఎన్నికల్లో ఏమైతే చెప్పామో..అది నెరవేర్చుకుంటూ ప్రజల్లోకి వెళ్లి మళ్లీ విజయం సాధించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. ఈ ఏడు నెలల్లో మేం ఎక్కడ కులతత్వం చూపించామో చెప్పాలి. మంత్రి వర్గ విస్తరణ ఏవిధంగా చేశారో మీకు తెలియదా?. రాజకీయ అవినీతి లేకుండా చేసిన ఏకైక ప్రభుత్వం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం. చంద్రబాబు ఐదేళ్ల పాటు అవినీతి చేశారు. కుటుంబ పాలన చేశారు. దాన్ని కాదని ప్రజలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. చంద్రబాబు ప్రతిక్షణం అస్థిరం తీసుకురావాలని, సీఎం వైయస్‌ జగన్‌పై బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నారు. మొదట అశాంతి అంటూ పల్నాడులో యాత్ర చేశాడు..ఇసుక అన్నాడు. ఆ తరువాత ఇంగ్లీష్‌ మీడియం అన్నారు. ఏది పడితే దాన్ని ఒక ఉద్యమంలా తీసుకురావాలని, ఒక అస్థిరతను సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఏది పడితే అది మాట్లాడుతున్న చంద్రబాబును సపోర్టు చేసేందుకు మీ కూటమి పెట్టారా? ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించాలని ముందుకు వెళ్తున్న ప్రభుత్వంపై ఏది పడితే అది మాట్లాడటం సమంజసం కాదు. దుర్మార్గమైన ప్రభుత్వం పోయి, ఒక మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మీరు సపోర్టు చేయలేకపోవచ్చు. రాజకీయ ప్రయోజనాలు మీకు వేరుగా ఉంటాయి. అది వేరే అంశం. మీ ప్రయోజనాల కోసం వెళ్లండి. కానీ ఒక మంచి ప్రభుత్వాన్ని, ఒక మంచి వ్యక్తిని మీరు విమర్శించడం సమంజసం కాదు. రాజకీయ కూడికలు, తీసివేతలు వేసుకోండి..వైయస్‌ఆర్‌సీపీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేసి చూపించి మళ్లీ ప్రజల మధ్యకు వెళ్లి ఓటు వేయమని అడుగుతామే తప్ప..మరోరకంగా వెళ్లం. మంచి ప్రభుత్వాన్ని మేం స్థాపించి ముందుకు వెళ్తున్న సమయంలో ఈరకమైన కూటమిలు కట్టుకుంటే మాకేమి అభ్యంతరం లేదు. ఒక మంచి ప్రభుత్వంపై బురద జల్లడం సమంజసం కాదు. లేనిపోని అంభాడాలు వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై వేస్తే..చూస్తూ ఊరుకోం. 
రాజధాని గురించి మాట్లాడుతున్నారు. కర్నూలులో హైకోర్టు ఉండాలంటున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పవన్‌కు ప్రతిపక్ష నేతగా ఉన్న వైయస్‌ జగన్‌ టార్గెట్‌.. వైయస్‌ జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు మళ్లీ ఆయనే టార్గెట్‌.  అసలు మీ ఉద్దేశం ఏంటి..ఆలోచన ఏంటి? ఎప్పుడు చంద్రబాబును కాపాడాలనే ఉద్దేశంతోనే మీరు రాజకీయ ప్రయాణం చేస్తున్నారు. చంద్రబాబు కోసం పుట్టిన రాజకీయ పార్టీ, చంద్రబాబు కోసం పని చేస్తున్న రాజకీయ పార్టీ జనసేన. ఇప్పటికే చంద్రబాబు తన మనుషులను బీజేపీలోకి పంపించారు. నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్పించారు. మీరు కూడా ఇవాళ బీజేపీలోకి వెళ్లారు. కలిసి పనిచేస్తారో? ఏం చేస్తారో మీకే తెలుసు. మీకు రాజకీయ స్థిరత్వం లేకుండా ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు నంబర్‌ వన్‌ అనుకుంటే, మీరు నంబర్‌ 2గా తయారు అయ్యారు. మీకు సిద్ధాంతాలు, స్థిరత్వం లేదు. మీకు రాజకీయంగా అర్హత లేని వ్యక్తులు. అనవసరంగా వైయస్‌ఆర్‌సీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 
పవన్‌ కళ్యాణ్‌ ప్రెస్‌మీట్లో మాట్లాడుతూ..వామపక్షాలకు బాకీనా అన్నారు..అయ్యా..చంద్రబాబుకు ఏమైనా బాకీ ఉన్నారా?, మోదీకి బాకీనా? ఈ బాకీలేంటి?. సిద్ధాంతం లేని, స్థిరత్వం లేని ఓ వ్యక్తిని కమ్యూనిస్టులు కూడా గమనించాలి. ఒక పార్టీని నడపలేని పవన్‌..ఏదో పార్టీని పట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ ఏ విధంగా కాలగర్భంలో కలిసి పోయిందో..ఈ జనసేన కూడా అదే విధంగా కాలగర్భంలో కలిసిపోయే చరిత్రను మనం చూస్తాం. 

 

తాజా వీడియోలు

Back to Top