చంద్రబాబు ఉన్నారు జాగ్రత్త..ఓట్లు పోతాయి 

వైయస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు

అడ్దదారుల్లో ఎన్నికల్లో గెలవాలని టీడీపీ తపన

టీడీపీకి ప్రజాబలం లేదని స్పష్టమైంది

ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచే అవకాశం టీడీపీకి లేదు

డేటా చోరీపై రెండు రాష్ట్రాల సమస్యగా బాబు చిత్రీకరిస్తున్నారు

సేవా మిత్ర యాప్‌లో ఆధార్‌డేటా ఎందుకుంది?

అభివృద్ధికి అడ్డుపడుతున్నారని వైయస్‌ జగన్‌పై ఆరోపణలు

బాబూ..జగన్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు

ఫామ్‌7 ఎందుకు పెట్టకూడదు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఓటర్లకు భద్రత లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో కుక్కలు ఉంటే ..కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డు పెడతారని, సినిమా హాళ్లలో అయితే జేబు దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డు పెడతారన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఉన్నారు జాగ్రత్త..ఓట్లు పోతాయి అని బోర్డు పెట్టుకోవాల్సిన దౌర్భాగ్యం నెలకొందన్నారు. ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు చోరీ చేసి టీడీపీకి చెందిన సేవా మిత్ర యాప్‌లో పెట్టుకున్నారని, దీనికి సమాధానం చెప్పమని వైయస్‌ జగన్‌ ప్రశ్నిస్తే..అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఏవేవో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

 త్వరలో దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్‌ రాబోతున్న తరుణం..సుమారుగా ఎన్నికల వాతావరణం ప్రారంభమైన నేపథ్యంలో ఏపీలో ఏదోవిధంగా తిరిగి అధికారంలోకి రావాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో అడ్డదారుల్లో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని ప్రతి సారి చంద్రబాబు ఇలాంటి పనులు చేస్తుంటారు. ఆయనకు ప్రజాస్వామ్యం కంటే మాల్యుప్యూలేషన్‌పైనే ఆధారపడుతుంటారన్నారు. ఒకసారి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు. తరువాత మిత్రులను చేసుకొని అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఏ రోజు కూడా ప్రజాస్యామ్యబద్ధంగా అధికారంలోకి రాలేదు.

చంద్రబాబుకు ప్రజాబలం లేదు. ఆయన పార్టీకి చెందిన యోధాను యోదులు వైయస్‌ఆర్‌సీపీ దారి పడుతున్నారు. ఉన్నవాళ్లు యుద్ధం ప్రారంభం కాగానే ఆయుధాలు వదిలేసి పారిపోయే రకం. యుద్ధఃలో గెలిచే అవకాశం వారికి లేదు. ప్రజాస్వామ్యబద్దంగా గెలిచే అవకాశం అంతకన్నా లేదు. ప్రజాస్వామ్యాన్ని దగా చేసి గెలవాలని చూస్తున్నారు. వ్యవస్థలను మ్యానేజ్‌ చేసి గెలవాలని కుట్రలు. డేటా చౌర్యం..అయ్యా చంద్రబాబు..నీకు ఓటు వేయాలనుకున్నవారికి రెండు ఓట్లు ఇస్తావా? నీకు ఓటు వేయని వారి ఓటే లేకుండా చేస్తావా? ఇది మ్యానిక్యులేషన్‌ కాదా?. అడ్డమైన గడ్డి కరిచి దొరికిపోతున్నావు కదా? అదంటంటే వైయస్‌ జగన్‌పై ఎదురుదాడికి దిగుతున్నావు

మేం ఎప్పుడైనా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశామా? నీవు..23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది వాస్తవం కాదా? తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను కొనాలనుకున్నది నీవా..మేమా? పచ్చి అబద్ధాల కోరు..దగాకోరు మాటలు నమ్మే పరిస్థితి లేదు. నీకు భజన చేసే పరిస్థితిలో మీడియా ఉందని ఏది పడితే అది మాట్లాడుతావా?వైయస్‌ జగన్‌ గవర్నర్‌ను కలిసిన తరువాత కొన్ని ప్రశ్నలు సంధిస్తే..సమాధానం చెబుతావని అనుకున్నాం. ఆ ప్రశ్నలకు సమాధానం లేదు. lరెండు రాష్ట్రాలకు మధ్య యుద్ధమని మాట్లాడుతున్నారు. నీవు అన్యాయం చేస్తుంటే..అక్రమం చేస్తుంటే దాన్నిపై కేసులు పెడుతుంటే పక్క రాష్ట్రానికి తనకు పోటీ అని అంటున్నారు. నీకు..వారికి ఏ యుద్ధం జరుగుతుంది? మాతో నీకు యుద్ధం. గెలవాలో..ఓడిపోయాలో తేల్చుకోవాలి. వారు డేటా దొంగిలించి మాకు ఇస్తున్నారట. మాకేం సంబంధం.

వైయస్‌ జగన్‌ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని అంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కూడా పరిపాలన చేశాడు. ఎప్పుడైనా ఇలాంటి వాజమ్మ కబుర్లు చెప్పాడా? నీవు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నావు..నీవు అడ్డంపడితే ఆయన అభివృద్ధి ఆగిందా? అసలు మేం అడ్డంపడితే నీవు అభివృద్ధి ఆపడం ఏంటి? మాపై పడి ఎందుకు ఏడ్చుతున్నావు చంద్రబాబూ?. నీవు అభివృద్ధి చేయలేదు కాబట్టే..మాపై ఆ నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నావు. డేటా చోరీ గురించి చెప్పమంటే వైయస్‌ జగన్‌ అడ్డుపడుతున్నారని చెబుతున్నారు. నాలుగేళ్లు పాటు బ్రహ్మండమైన అభివృద్ధి చేశామని చెప్పి..ఇప్పుడు మోడీ అడ్డుపడ్డారని అంటున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి..క్యాబినెట్‌ ఏర్పాటు చేసుకున్నావు..నీకు అడ్డుపడటం ఏంటి? ఎవరో అడ్డుపడ్డారని కాకమ్మ కథలు చెప్పడం ఏంటి? నిన్న పత్రికా సమావేశంలో వైయస్‌ జగన్‌ కొన్ని ప్రశ్నలు అడిగారు.

సేవా మిత్ర యాప్‌ను టీడీపీ తరఫున ప్రారంభించావు.  దాంట్లో ఆధార్‌ డేటాను దొంగిలించి పెట్టావు. ఇది నేరం కాదా? కలర్‌ ఫొటోలతో ఉన్న మాస్టర్‌ డేటాను సేవా మిత్ర యాప్‌లో పెట్టుకున్నావు. బ్యాంకు అకౌంట్లు ఎవరైనా పబ్లిక్‌ డొమైన్‌లో పెడితే ఊరుకుంటారా? పల్స్‌ సర్వే ద్వారా వ్యక్తిగత వివరాలు చోరీ చేసి నీ సేవా మిత్ర యాప్‌లో పెట్టుకోవడం నేరం కాదా? సంక్షేమ పథకాలు ఎవరికి అందాయన్న వివరాలు నీవు దొంగిలించావా?లేదా? దీనికి సమాధానం చెప్పమంటే వైయస్‌ జగన్‌ అడ్డుపడుతున్నారు. కేసీఆర్‌ అడ్డుపడుతున్నారంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నీవు సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోతున్నావు. ఫామ్‌7 పెట్టి అన్యాయంగా అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారని గగ్గొలు పెడుతున్నారు. ఎక్కడైనా రెండు ఓట్లు ఉంటే వాటిలో ఒకటి తొలగించాలని అభ్యర్థించేది ఫామ్‌7 దర ఖాస్తు. ఈ హక్కు ఎవరికైనా ఉంటుంది.

ప్రజాస్వామ్యం బతకాలంటే ఫామ్‌7 ఉపయోగించాలి. టీడీపీలో దొంగ ఓటర్లు ఉన్నారు కాబట్టి వారు ఉపయోగించడం లేదు.  కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డు పెడుతారు. సినిమా హాల్లో జేబు దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డు పెడతారు. ఇవాళ ఏపీలో చంద్రబాబు ఉన్నారు.. జాగ్రత్త..ఓట్లు పోతాయి అని బోర్డు పెట్టాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చాం. ఎందుకంటే చంద్రబాబు చెప్పేదొకటి..చేసేది మరొకటి. ఫామ్‌7 పెడితే చంద్రబాబుకు ఏంటి బాధ?. సత్తెనపల్లిలో గత ఎన్నికల్లో పోటీ చేశాను. ఇప్పుడు చూస్తే నా ఓటు లేదు. నా భార్య ఓటు లేదు. మా అమ్మాయిల ఓట్లు లేవు. ఇదేంటి అన్యాయమని ఎన్నికల కమిషనర్‌ సిసోడియా వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే నాకు ఓటు హక్కు కల్పించారు. దీనికి చంద్రబాబు కాదా బాధ్యుడు. నా ఓటే తొలగించారు. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా?.

చంద్రబాబు..కోడెల శివప్రసాదరావు కుట్ర చేసి నా ఓటు తొలగించారు. దీనికి నీవు కాదా బాధ్యుడవు చంద్రబాబు?
ఐటీ కంపెనీలపై పోలీసులు దాడి చేశారు. అశోక్‌ అనే వ్యక్తిని విచారణకు రమ్మన్నారు. అశోక్‌ను ఎక్కడ దాచారు. దమ్ముంటే పంపించు విచారణ చేస్తారు. ఓటుకు కోట్లు కేసులో కూడా గతంలో నిందితులను ఏపీలో దాచిన సందర్భాలు లేవా? అన్ని దొంగ పనులే..చెప్పేవి మాత్రం అద్భుతమైన కథలు. చంద్రబాబుకు నిజంగా ధైర్యం ఉంటే ..డేటా దొంగిలించకపోతే ఏ విచారణకైనా సిద్ధమే అని ముందుకు రండి. 

 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top