ఎన్‌ఐఏ అంటే ఎందుకంత భయం బాబూ? 

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ

వైయస్‌ జగన్‌పై దాడి ఘటనలో కీలక వ్యక్తులు ఉన్నారనే అనుమానాలు బలపడుతున్నాయి

సిట్‌ ఏర్పాటు చేసి కేసును నీరుగార్చే ప్రయత్నం 

ఎన్‌ఐఏ విచారణకు ఎందుకు సహకరించడం లేదు

విచారణలో నిజాలు వెలుగు చూస్తాయని భయమా? 

చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు

హైదరాబాద్‌: వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనలో కీలక వ్యక్తులు ఉన్నారన్న అనుమానాలు బలపడుతున్నాయని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. చంద్రబాబు పదే పదే ఎన్‌ఐఏ విచారణను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయనకు ఎన్‌ఐఏ అంటే ఎందుకంత భయమని ఆమె ప్రశ్నించారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన కలిసి వచ్చినా..దుష్టచతుష్టయ కూటమిని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. బుధవారం వాసిరెడ్డి పద్మ వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

 వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని హత్యాచేయాలనే ప్రయత్నం పెద్ద స్థాయిలో జరిగిందని, ఈ ఘటన వెనుక చాలా కీలకమైన వ్యక్తులు ఉన్నారన్న అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన వెంటనే ప్రాథమిక సమాచారం లేకుండానే డీజీపీ చులకన చేస్తూ మీడియాతో మాట్లాడారన్నారు. ఆ వెంటనే చంద్రబాబు కూడా దాడిని హేళన చేస్తూ మాట్లాడటం..ఆ తరువాత జరిగిన పరిణామాలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారని చెప్పారు. దాడి జరిగిన తరువాత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌పై ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అని ప్రశ్నించారన్నారు. డీజీపీ, సీఎం మాట్లాడిన మాటలను బట్టి ఈ దాడి ఒక కుట్ర ప్రకారమే జరిగిందన్న అభిప్రాయంతో వైయస్‌ జగన్‌ కోర్టుకు వెళ్లారని, ఈ ఘటనపై స్వతంత్య్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని కోరినట్లు చెప్పారు.

ఈ ఘటనను నీరుగార్చేందుకు చంద్రబాబు సిట్‌ అధికారులతో విచారణ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కూర్చోమంటే కూర్చోవడం, నిలబడమంటే నిలబడటం ఈ సిట్‌ అధికారుల పని అన్నారు. సిట్‌ వేశారంటే ఆ కేసు నీరుగారడమే అని అభిప్రాయపడ్డారు.  చంద్రబాబు వేసిన సిట్‌ ఏం తేల్చిందని ప్రశ్నించారు. అభిమాని సంచలనం కోసం చేశాడని తేల్చిందన్నారు. ఈ కేసును హైకోర్టు ఎన్‌ఐఏకు అప్పగిస్తే..విచారణను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పిల్లిమొగ్గలు వేసిందో అని ధ్వజమెత్తారు. విచారణ సజావుగా జరగకుండా చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే దానిపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపడితే పదే పదే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కోర్టుకు వెళ్తుందని నిలదీశారు. ఎన్‌ఐఏ విచారణకు సహకరించకుండా, డాక్యుమెంట్లు అందజేయకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని విమర్శించారు.

పాత్రదారులు, సూత్రదారులు బయటకు వస్తారని కంగారుపడి చంద్రబాబు అడ్డదారుల్లో వెళ్తున్నారని మండిపడ్డారు. గత పదిహేను రోజులుగా జరుగుతున్న పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. ఎన్‌ఐఏ అంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ఆమె ప్రశ్నించారు. ఎవరు విచారణ చేసినా నిజమే తేలుతుందని, అలాంటప్పుడు చంద్రబాబు ఎందుకు ఎన్‌ఐఏను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రధానికి లేఖ రాస్తున్నారని, పదే పదే హైకోర్టులో పిటిషన్లు వేస్తూ ఎన్‌ఐఏను నిలుపుదల చేయాలని చంద్రబాబు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక చివరకు భౌతికంగా తప్పించేయత్నం చంద్రబాబు స్థాయిలో జరిగిందని కొట్టొచ్చినట్లు కనబడుతుందన్నారు. ఎన్‌ఐఏ విచారణను అడ్డుకునేందుకు ఇన్ని అడ్డదారులు తొక్కుతున్నారంటే దానర్థం ఏంటని ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పారు.

ప్రజల్లో పలుచనవుతున్నానని చంద్రబాబుకు తెలిసీ కూడా, వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనలో చంద్రబాబు హస్తం ఉందని ప్రజలకు తెలుసు కాబట్టే ఎన్‌ఐఏ విచారణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఎన్‌ఐఏ విచారణ చేపడితే తమ పాత్ర ఆధారాలతో సహా బయటపడుతుందని చంద్రబాబుకు భయమన్నారు. దర్యాప్తును అడ్డుకోవడం సిగ్గు చేటని ఆమె ఖండించారు. 

ఇటీవల చంద్రబాబు పదే పదే ఢిల్లీకి పరుగులు తీస్తున్నారని, భయంతోనే ఇలాంటి పర్యటనలు చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. గతంలో కూడా ప్రజలు తనకు రక్షణగా ఉండాలని చంద్రబాబు కోరినట్లు గుర్తు చేశారు. చంద్రబాబుతో సమావేశమంటే రాజకీయ పార్టీలు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని పరిస్థితి ఢిల్లీలో నెలకొందన్నారు. వ్యక్తిగత, స్వార్థ రాజకీయాల కోసమే పదే పదే చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారని పేర్కొన్నారు. ఈయన పర్యటనలతో రాష్ట్రానికి ఏ ఒక్క ప్రయోజనం లేదన్నారు.

ఓటమి భయాన్ని చంద్రబాబు ముందే ప్రదర్శిస్తున్నారని, అందుకే ఈవీఎంలను తెరపైకి తెచ్చారన్నారు. 2014, నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల్లో ఈవీఎంలను టాపరింగ్‌ చేసి గెలిచారా అని ప్రశ్నించారు. రాబోయే ఓటమిని ఒప్పుకొని చంద్రబాబు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి వచ్చినా వైయస్‌ జగన్‌ సింగిల్‌గానే ఎదుర్కొంటారని, ఈ కూటమిని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. టీజీ వెంకటేష్‌ వ్యాఖ్యలు చంద్రబాబు ఆలోచనలే అన్నారు. ఒక మంత్రితో బీజేపీని తిట్టిస్తారని, మరో మంత్రితో పొగిడిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు లాంటి డ్రామా రాయుడు మరొకరు ఉండరని వ్యాఖ్యానించారు. 
 

Back to Top