నెల్లూరు: చంద్రబాబు ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి అంటూ వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆయన్ను నమ్మి టీడీపీకి ఓట్లేస్తే మీ మత విశ్వాసాల్ని దెబ్బతీసుకున్నట్టే అన్నారు. మతతత్వ బీజేపీతో జతకట్టిన ఆయన యూనిఫాం సివిల్ కోడ్‌కు అనుకూలమా..? వ్యతిరేకమా..?. 24 గంటల్లోగా దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు. జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్‌రెడ్డి నిన్న నెల్లూరు ఎంపీ అభ్యర్థి వి. విజయసాయిరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. ఈ సందర్బంగా ఇవాళ జిల్లా వైయస్‌ఆర్ సీపీ కార్యాలయంలో పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డితో పాటు మనుక్రాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మనుక్రాంత్‌రెడ్డి తొలిసారి ఏమన్నారంటే వైయస్ జగన్ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరానుః అందరికీ నమస్కారం. నేను వైఎస్‌ఆర్‌సీపీ కుటుంబంలోకి చేరానని చెప్పేందుకు సంతోషిస్తున్నాను. వైయస్‌ఆర్‌సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి , నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిన్న నేను రాజమండ్రిలో గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఇవాళ జిల్లా పార్టీ కార్యాలయానికి రాగానే నన్ను గౌరవంగా ఆదరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జనసేన పార్టీ నుంచి నన్ను వైయస్‌ఆర్‌సీపీలోకి ఆహ్వానించినందుకు విజయసాయిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి కి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. నెల్లూరులో కేరాఫ్ అడ్రస్ లేని జనసేనః జనసేన పార్టీ తరఫున గడచిన 6 ఏళ్లుగా నేనెంత కృషి చేశానో నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ నేను పార్టీ మారానని అవగాహన లేని కొందరు ఏవేవో మాట్లాడుతున్నారు. 2018లో నేను జనసేన పార్టీలోకి అడుగు పెట్టినప్పుడు నెల్లూరు జిల్లాలోనే ఎక్కడా ఆ పార్టీకి కేరాఫ్ అడ్రస్ లేదు. అప్పట్లో జనసేన మీటింగులు టీ దుకాణాలు, పార్కుల్లోనే జరిగేవి. అలాంటిది, నేను పార్టీలో చేరాక జిల్లాపార్టీ ఆఫీసు పెట్టి నెలకు రూ.లక్షల్లో ఖర్చుపెట్టి పార్టీ కార్యక్రమాల్ని నిర్వహించాను. అనేక పార్టీ కార్యక్రమాలకూ నేను డొనేషన్లు ఇచ్చిన సందర్భాలున్నాయి. ఇవి తెలియని కొందరు రాజకీయ అవగాహన లేనోళ్లు కనీస ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడటం సిగ్గుచేటు. నాతో వచ్చేవారినీ వైయస్‌ఆర్‌సీపీలోకి ఆహ్వానిస్తున్నా.. ఒక పార్టీ నుంచి ద్వితీయశ్రేణి నాయకుడు బయటకు వెళ్తేనే చాలా పరువుతక్కువ పనిగా భావిస్తాం. అలాంటిది, ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడే పార్టీని వీడిపోయాడంటే.. ఆ పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్ధం చేసుకోవాలి. పరువు, మర్యాద, భవిష్యత్తు లేని చోట ఉండకూడదని నిర్ణయం తీసుకునే వైఎస్‌ఆర్‌సీపీలోకి చేరాను. ఇప్పటికే చాలామంది ఫోన్‌కాల్స్ చేసి నన్ను మంచి నిర్ణయం తీసుకున్నానంటూ అభినందిస్తున్నారు. నాతో ప్రయాణం చేస్తామంటున్నారు. గతంలో నాతో పాటు పనిచేసిన వారందరికీ నేను అండగా ఉంటానని.. వారందర్నీ కూడా నేను వైయస్‌ఆర్‌సీపీలోకి ఆహ్వానిస్తున్నాను. క్రెడిబుల్టీ నాయకులే పార్టీమారితే.. ప్రజలు ఆలోచించాలిః ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడే మరోపార్టీలోకి చేరాడంటే అది ఎన్నికల్లో చాలా ప్రభావం చూపుతోంది. జనసేనలో ఉన్నప్పుడు కూడా నేను ఏరోజూ ఇతర పార్టీలోని వ్యక్తులపై వ్యక్తిగతంగా మాట్లాడలేదు. రాజకీయ విధానాలపైనే నేను పోరాడి విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ప్రజల్లో ఒక క్రెడిబులిటీ ఉన్న నాలాంటి నేతలే జనసేన పార్టీని వీడి వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారంటే ప్రజలంతా ఆలోచించాలి. జనసేన పార్టీ గతికి కారణం చంద్రబాబేః జనసేన పార్టీకి ఇంత గతి పట్టడానికి కారణం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడే. జనసేనకు మనుగడ లేకుండా చేసిన వ్యక్తి ఆయనే. కేవలం 21 సీట్లను జనసేనకు విదిల్చి.. ఆ పార్టీ తరఫున ఎవరు పోటీచేయాలనేది కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయమే నిర్దేశిస్తే.. ఇక, ఆ పార్టీ ఎందుకు...? ఆ పార్టీ అధినేత ఎందుకు..? నాలాంటి యువకులు జనసేన మీద ఎంతో ఆశలు పెట్టుకున్నాం. యువతరానికి రాజకీయ అవకాశం లభించిందంటూ పార్టీలో సంవత్సరాల తరబడి పనిచేశాం. అయితే, చంద్రబాబు దుష్టాలోచనకు మా ఆశలన్నీ ఆవిరయ్యాయి. జిల్లాలో ఒక్కసీటూ లేనప్పుడు పార్టీ మనుగడేంటి..? ఆయన ట్రాప్‌లోనే జనసేన పార్టీ అధినాయకత్వం పడిపోయింది. జిల్లాలో ఒక్క సీటు కూడా లేకపోతే.. ఆ పార్టీ మనుగడ ఎంతకష్టమో అందరూ అర్ధం చేసుకోవాలి. దాదాపు 6 ఏళ్లు కష్టపడి జిల్లాలో పార్టీని నడిపింది ఎందుకు..? నా కోసం ఇన్నాళ్లూ నాతోపాటు ప్రయాణించిన వారందరికీ జనసేన సీట్లు లేకపోవడంపై నేనేం సమాధానం చెప్పాలి..? అందుకే, విలువల్లేని చోట నేనుండకూడదని మనస్తాపంతో జనసేనను విడిచి బయటకు రావాల్సి వచ్చింది. పార్టీ వీడి వారం తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని వైఎస్‌ఆర్‌సీపీ లోకి చేరాను. 2019లో టీడీపీ అవినీతి అరాచకాలపై పోరాడాంః 2019 ఎన్నికల్లో టీడీపీని ఉద్దేశించి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఏమన్నాడు..? మనం టీడీపీ కుంభస్థలాన్నే కొట్టాలన్నాడు. అదే పంథాలో నేను అప్పట్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చున్నప్పుడు చంద్రబాబు వర్గీయుల అవినీతిని ఎండగట్టాను. నీరు చెట్టు పనుల్లో దోపిడీని, జన్మభూమి కమిటీల దందాపై నెల్లూరు జిల్లాలో ఊరూరా ప్రచారం చేశాను. ఎక్కడా టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కకూడదని పోరాడాం. 2014లో చంద్రబాబు ప్రకటించిన మ్యానిఫెస్టో హామీల్లో కనీసం 10 శాతం కూడా వాళ్లు పూర్తిచేయలేదు. పచ్చి అవకాశవాది చంద్రబాబుః మాయమాటలతో ప్రజలను బురిడికొట్టించే చంద్రబాబు ఒక పచ్చి అవకాశవాది. ఆయన్ను నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఆయనది అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే నైజం. నెల్లూరు జిల్లా ప్రజలు కూడా చంద్రబాబు రాజకీయ శైలిని బాగా అర్ధం చేసుకున్నారు. బాబు వస్తే యువతకు జాబు అన్నాడు. అయితే, యువతకు జాబ్‌లు రాలేదు గానీ ఆయన కొడుకు లోకేశ్‌బాబుకు మాత్రం జాబ్ ఇచ్చుకున్నాడు. అవమానించిన టీడీపీకి మేమెలా సపోర్టు చేస్తాం..? 2014 నుంచి 2019 వరకు ప్రతీ టీడీపీ నాయకుడు జనసేన పార్టీ నేతల్ని, కార్యకర్తలను ఇష్టమొచ్చినట్లు ఎగతాళి మాటలు మాట్లాడి తీవ్రంగా అవమానించిన సందర్భాలున్నాయి. అలాంటిది, మళ్లీ ఇప్పుడు జనసేన కేడర్ వెళ్లి అదే టీడీపీ నేతల కోసం పనిచేయాల్నా..? ఎంతో మంది నా దగ్గరకొచ్చి ఆవేదన వ్యక్తంచేసి చంద్రబాబు కోసం మళ్లీ పనిచేయడానికి మేము సిద్ధంగా లేమని చెప్పారు. పవన్‌కళ్యాణ్ అభిమానులంతా చంద్రబాబుకు బుద్ధిచెప్పాలిః నెల్లూరు జిల్లా గతంలో కాంగ్రెస్ ఇప్పుడు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోట వంటిదే. అలాంటి జిల్లాలో మేము గతంలో జనసేన పార్టీ తరఫున పనిచేశామంటే కేవలం పవన్‌కళ్యాణ్ అభిమానులుగానే చేశాం. అయితే, ఇప్పటి పరిస్థితి నెల్లూరులో పూర్తిగా మారింది. పవన్‌కళ్యాణ్‌తో సహా జనసేన అధినాయకత్వమంతా చంద్రబాబు ట్రాప్‌లో పడినందున.. మనలాంటి యువతకు రాజకీయ అవకాశాలు ఉండవు. చంద్రబాబు మనల్ని ఎదగనీయడు. కనుక, పవన్‌కళ్యాణ్‌ను అభిమానించే వారంతా చంద్రబాబుకు ఖచ్చితంగా బుద్ధిచెప్పాలి. మళ్ళీ వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంః ఇవాళ నెల్లూరు జిల్లాలో ఎక్కడ చూసినా వైయస్‌ఆర్‌సీపీ వైఫల్యాల కంటే ఫలాలనే ఎక్కువ చెబుతున్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారిని ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. ప్రభుత్వ పథకాల విధానాలపై ప్రతీచోటా పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. గడచిన రెండు నెలలుగా చూస్తే రాష్ట్రం మొత్తం పొలిటికల్ వేవ్ చాలా మారింది. అమ్మ ఒడి, ఆసరా, చేయూత, జగనన్న విద్యాదీవెన, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ వంటి ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో చాలా సంతృప్తి కనిపిస్తోంది. కాబట్టే.. వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైయస్‌ఆర్‌సీపీ జెండా పట్టుకుంటున్నారు. ఎక్కడ విన్నా మళ్ళీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఏర్పడుతోందని చెబుతున్నారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారినే మళ్ళీ ముఖ్యమంత్రిగా చూస్తామంటూ ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో తగిన గుర్తింపునకు తోడ్పాటునందిస్తాం: ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో జనసేన జిల్లా అధ్యక్షుడుగా పనిచేసిన మనుక్రాంత్‌రెడ్డి గారు వైఎస్‌ఆర్‌సీపీలోకి రావడం చాలా సంతోషం. ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడే మా పార్టీలోకి రావడమంటే అది మాకు మరింత బలం చేకూర్చే అంశం. కాబట్టి, ఆయన్ను మనస్ఫూర్తిగా మేం పార్టీలోకి ఆహ్వానించాం. యువకుడుగా మనుక్రాంత్‌రెడ్డి జనసేనలో చేసిన సేవలకు తగిన రాజకీయ గుర్తింపు రాలేదనే బాధ అందరితో పాటు నిన్నటిదాకా మాకూ ఉండేది. రాబోయే రోజుల్లో మావంతు సహాయ సహకారాలు అందించి మా పార్టీలో ఆయనకు రాజకీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు తోడ్పడతాం. మనుక్రాంత్‌రెడ్డి మాపార్టీలో చేరడం శుభపరిణామంః ఎంపీ విజయసాయి రెడ్డి నిగర్వి, పట్టుదల గల నాయకుడు మనుక్రాంత్‌రెడ్డి గారు జనసేన పార్టీలో నిస్వార్ధంగా పనిచేశారు. అక్కడ అనుభవాన్ని సంపాదించి ఆ రంగరించిన అనుభవంతో ఇవాళ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషం. ఆయనకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సముచితమైన స్థానం కల్పిస్తామని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు హామీనిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ చాలా శుభపరిణామాలుగా మేం భావిస్తున్నాం. మా లక్ష్యం 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాలుః ఒక రాజకీయ పార్టీకి 13 మంది జిల్లా అధ్యక్షులుంటే, వారిలో ఒక అధ్యక్షుడు ఆ పార్టీని వీడి వైఎస్‌ఆర్ సీపీలోకి చేరారంటే అర్ధమేంటి..? ఆ పార్టీ ఎంత బలహీనపడింది. మన పార్టీ ఎంత బలమైన పార్టీగా నిలబడిందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి.. మనుక్రాంత్‌రెడ్డి గారిని మేము పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. మేమంతా కలిసి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు పనిచేస్తాం. మా పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ముందుకెళ్తాం. మా లక్ష్యం రాష్ట్రంలోని 175 నియోకవర్గాలకు 175 స్థానాలను గెలుచుకోవడం.. 25కి 25 ఎంపీ స్థానాలను సాధించుకునే దిశగా ముందుకెళ్తాం. టీడీపీ అనైతిక, అవినీతి రాజకీయాన్ని గమనించాలిః నెల్లూరు జిల్లాలో అనైతిక, అవినీతి రాజకీయాల గురించి ప్రస్తావించాల్సిన సందర్భం ఇది. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు రూ. వెయ్యి కోట్లు ఖర్చుపెడతారంట. పొంగూరు నారాయణ గారు రూ.500 కోట్లు ఖర్చుపెడతారంట. ఇక, విదేశాల నుంచి ఇక్కడకొచ్చి పోటీచేసే టీడీపీ ఎన్‌ఆర్‌ఐలు, మిగతా ధనవంతులు, పెత్తందారులూ ఇక్కడ పోటీచేస్తున్న నేపథ్యం. రాజకీయ పరిపక్వత గల్గిన ఈ నెల్లూరు జిల్లాలో డబ్బుతో రాజకీయం నడిపిస్తాం.. చేస్తాం అనే అనైతిక విధానం చంద్రబాబుకు, ఇక్కడి పెత్తందార్లకూ దక్కుతుంది. ఈ పరిస్థితిని ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ఇంపోర్టెడ్ లీడర్ల వేదికగా టీడీపీః ఇక్కడ టీడీపీ పక్షాన పోటీచేసే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గారు, ప్రశాంతి రెడ్డి గారు గానీ మిగతావారంతా కూడా ఇంపోర్టెడ్ లీడర్సే. వీరెవ్వరూ కూడా మొట్టమొదట్నుంచీ టీడీపీలో ఉన్న నాయకులు కాదు అనేది అందరూ గమనించాలి. మా పార్టీలో ఉన్నోళ్లను డబ్బుతో కొనలేరుః నిన్న 40 మంది వాలంటీర్ల చేత రాజీనామాలు చేయించి వారికి నారాయణ విద్యాసంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ఆశచూపి వారందర్నీ టీడీపీలోకి చేర్చుకున్నారు. అయితే, ఆ 40 మంది వాలంటీర్లు తిరిగి ఈరోజు వైఎస్‌ఆర్‌సీపీలోకి పునఃప్రవేశం చేశారు. అంటే, వాలంటీర్ల మనసంతా వైఎస్‌ఆర్‌సీపీ మీదనే ఉంది. నిజమైన నాయకుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేది వారందరికీ తెలుసు. కాబట్టి.. మా పార్టీలో ఉన్నటువంటి వారిని వేరెవ్వరూ కదిలించలేరు. డబ్బుతో కొనలేరని గర్వంగా చెబుతున్నాం. ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుః చంద్రబాబును, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని, నారాయణను నేనొక ప్రశ్న అడుగుతున్నాను. మీరు మతతత్వ పార్టీ బీజేపీతో జతకట్టారు. మేము ఏరోజూ ఏ పార్టీతోనూ మేం పొత్తు పెట్టుకోలేదు. మాకు పొత్తుతో అవసరం కూడా లేదని గతంలో చెప్పాం. ఇప్పుడూ చెబుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం కేంద్రప్రభుత్వాన్ని బలపరిచామే గానీ.. మేము మైనార్టీల మనోభావాల్ని దెబ్బతీసే ఎవరితోనూ మేం జతకట్ట లేదు. వారికి మేం సపోర్టు చేయలేదు. భవిష్యత్తులోనూ మేం చేయం. మరి, రేపటి ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకొస్తే.. చంద్రబాబు ఎన్డీయే భాగస్వామిగా ఉంటారు. మైనార్టీలకు, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకమైన యూనిఫాం సివిల్ కోడ్‌ను బీజేపీ అమలు చేయాలని భావిస్తుంది. మరి, చంద్రబాబు దీనికి అనుకూలమా..? వ్యతిరేకమా..? అనేది మైనార్టీలకు ఇప్పుడే చెప్పి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. టీడీపీకి ఓటేస్తే..మీ మతవిశ్వాసాల్ని మీరే దెబ్బతీసుకున్నట్టేః బీజేపీ అమలు చేసే యూనిఫాం సివిల్‌కోడ్‌కు అనుకూలమా..? వ్యతిరేకమా..? అనే ప్రశ్నకు జవాబు ఉండి కూడా చెప్పని చంద్రబాబును మైనార్టీలు, క్రిస్టియన్లు సపోర్టు చేయరాదు. ఆయన మాయ మాటల్ని నమ్మి మీరు గనుక టీడీపీకి ఓట్లు వేస్తే.. మైనార్టీలు, క్రిస్టియన్లు మీ మత విశ్వాసాలను మీరే దెబ్బతీసుకున్నట్లు అవుతుందని గుర్తెరగాలి. మీకు మీరే ద్రోహం చేసుకోరాదని గుర్తుచేస్తున్నాను. కామన్ సివిల్‌కోడ్‌పై 24 గంటల్లోగా చంద్రబాబు సమాధానం చెప్పాలిః మా పార్టీ అధినాయకుడు శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు మతవిశ్వాసాలపై ఒకటే చెప్పారు. ఏ చట్టం తీసుకురావాలన్నా.. అందరి ఏకాభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులు ఉన్న ఈ దేశంలో మనకి ఏకాభిప్రాయం అనేది ముఖ్యమని చెప్పారు. కాబట్టి, ఏ చట్టంలోనైనా ఏకాభిప్రాయాన్ని తీసుకు రండని జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా కోరారు. కాబట్టి, బీజేపీ అమలు చేసే యూనిఫాం కామన్ సివిల్ కోడ్‌పై 24 గంటల్లోగా సమాధానం చెప్పకపోతే.. ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకి వ్యతిరేకిగా చంద్రబాబు పనిచేస్తున్నారని అందరూ అర్ధం చేసుకోవాలని స్పష్టం చేస్తున్నాను.