తాడేపల్లి: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతటి నీచానికి అయినా దిగజారతారని మరోసారి రుజువైందని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. కందుకూరు ఘటనపై ఆయన స్పందించారు. మొన్న నెల్లూరు జిల్లా కందుకూరులో తన సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 8 మందిలో ఎక్కువ మంది బడుగువర్గాలేనని టీడీపీ అధినేత మరుసటి రోజు కావలిలో అన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపు గురించి మాట్లాడుతూ వారిలో ఆరుగురు వెనుకబడిన వర్గాలకు చెందినవారని చంద్రబాబు చెప్పడం ఆయన రాజకీయ దిగజారుడుకు, దివాళాకోరుతనానికి అద్దంపడుతోంది. మరణించినవారిలో అత్యధికశాతం బీసీలే కాబట్టి తమది బీసీల పార్టీ అనుకోవాలని నారా వారు చెబుతున్నారంటే రాజకీయ లబ్ధి కోసం ఆయన ఈ స్థాయికి దిగజారిపోతారా? అంటూ ఆంధ్ర ప్రజనీకం ముక్కుమీద వేలేసుకుంటున్నారు. రాజకీయ పార్టీల మద్దతుదారుల సామాజిక నేపథ్యం గురించి చెప్పాల్సిన సందర్భాలు రావచ్చేమో గాని ప్రమాదవశాత్తూ పార్టీ కార్యకర్తలు లేదా అభిమానులు మరణించిన సమయంలో వారి కులాల ప్రస్తావన తేవడం ప్రజాస్వామ్యంలో అత్యంత దారుణం. తన పార్టీకి బడుగు వర్గాల మద్దతు ఉందని చెప్పుకోవడానికి కొందరు బీసీ కులస్తుల మరణాన్ని నిస్సిగ్గుగా వాడుకోవడం తెలుగునాట ఒక్క చంద్రబాబు నాయుడుకే చెల్లింది. ఆయనకు మాత్రమే ఇది సాధ్యమని జనం ఈసడించుకుంటున్నారు.