తాడేపల్లి: పేదల జీవన ప్రగతికి అత్యంత కీలకమైన వారి కొనుగోలు శక్తి పెరగడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి చంద్రబాబును కాపుకాసే మీడియా అసలు చర్చించడానికే ఇష్టపడటం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై అసెంబ్లీలో సీఎం వైయస్ జగన్ వివరించినా.. చంద్రబాబు మీడియా మాత్రం కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రక్రియకే ప్రాధాన్యం ఇస్తున్నాయన్నారు. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి ఓ స్టోరీని విడుదల చేశారు.
`తెలుగుదేశం అనుకూల పత్రికలన్నీ ఆంధ్రప్రదేశ్ అప్పుల లెక్కలపై భూతద్దంతో సూక్ష్మ పరిశీలన జరిపాయి. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో వెల్లడించిన ఆర్థిక ప్రగతి వివరాలు ఈ మీడియాకు కనిపించలేదు. రుణభారంపై ముఖ్యమంత్రి చెప్పిన గణాంకాల్లో సత్యం తెలుసుకోవడానికి ‘కోడిగుడ్డుపై ఈకలు లెక్కించే’ ప్రక్రియకే ఈ పత్రికలు ప్రాధాన్యం ఇచ్చాయి. పేదల జీవన ప్రగతికి అత్యంత కీలకమైన వారి కొనుగోలు శక్తి పెరగడానికి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కాపుకాసే మీడియా అసలు చర్చించడానికే ఇష్టపడడం లేదు. జనం కొనుగోలు శక్తి పెంచడం వల్ల జరిగిన మేలు గురించి అసెంబ్లీలో వైయస్ జగన్ చక్కగా వివరించారు. పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి తగు మొత్తాల్లో నగదు బదిలీ చేయడం ద్వారా వైయస్ జగన్ సర్కారు ఎంతటి మేలు చేస్తోందో మాట్లాడడానికి పైన చెప్పిన పత్రికలు ముందుకు రావడం లేదు. వాటి దృష్టి అంతా రుణభారంపైనే. అమ్మ ఒడి, చేయూత, చేదోడు, ఆసరా వంటి నగదు సహాయ పథకాల ద్వారా ప్రజలకు డబ్బు ఇబ్బంది లేకుండా చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. తాను అధికారంలోకి వచ్చిన 9 నెలలకే కొవిడ్ మహమ్మారి ప్రజాజీవితాన్ని అతలాకుతలం చేసినా, ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా జనాన్ని ఆదుకుంది. ఆదాయమే లేని రోజుల్లో పేదల అకౌంట్లలో డబ్బు వేసి వారి కొనుగోలుశక్తిని పెంచింది. పేదల సంక్షేమంలో ఇప్పుడు దేశంలో వైయస్ జగన్ ప్రభుత్వం తర్వాతే ఇంకెవరైనా అనే పేరు సంపాదించింది.
2009లోనే వేయి, రెండు వేలు ఇస్తానన్న టీడీపీ 2014లో పేదలను మర్చిపోయింది
ఎంతసేపూ అమరావతి అనే మాయానగరి నిర్మాణం
2004–2009 మధ్య ఐదేళ్లూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన దివంగత జననేత వైయస్ రాజశేఖరరెడ్డి జనాకర్షణ శక్తిని తట్టుకోవడానికి చంద్రబాబు పార్టీ 2009 ఎన్నికల్లో తాను అధికారం వస్తే ‘అత్యధిక ప్రజానీకానికి నెలకు ఒకటి నుంచి రెండు వేల రూపాయల నగదు బదిలీ చేస్తాం,’ అని హామీ ఇచ్చింది. అయినా టీడీపీ ఓడిపోయింది. పోనీ, 2014లో అధికారంలోకి వచ్చాక అయినా తెలుగుదేశం ప్రభుత్వం– సాయం అవసరమైన పేదలకు తాను అంతకు ముందు వాగ్దానం చేసిన రీతిలో నగదు బదిలీ పథకాలు రూపొందించిందా? అంటే అదీ లేదు. ఎంతసేపూ అమరావతి అనే మాయానగరి నిర్మాణం, దాని నీడన తానూ, తన వర్గీయులు కోటానుకోట్లు వాయువేగంతో సంపాదించడం గురించే ‘స్మార్ట్ టెక్నాలజీ’ తెలిసిన చంద్రబాబు గారు ఆలోచించారు. ప్రజల్లో ఆదాయం తక్కువ ఉన్న వర్గాలకు డబ్బుసాయం చేసి ఆదుకునే పద్ధతులు అమెరికా, ఐరోపా దేశాల్లో పెద్ద సంఖ్యలో అమలవుతున్నాయి. వీటి అమలు కోసం ప్రభుత్వాలు రుణాలు తీసుకోవడాన్ని పాశ్చాత్య ఆర్థికవేత్తలు గట్టిగా సమర్థిస్తారు. అంతిమంగా అత్యధిక ప్రజాబాహుళ్యం కొనుగోలు శక్తి ఎంత ఉన్నదనేదే ఆయా ప్రాంతాల సంక్షేమం, ప్రగతిని నిర్ణయిస్తుంది.