న్యూఢిల్లీ: రాష్ట్ర పరువు, ప్రతిష్టలను దిగజార్చడమే టీడీపీ, చంద్రబాబు పని అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, లోక్ సభలో పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ మండిపడ్డారు. పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలు, విభజన హామీలతో పాటు ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఉభయ సభల్లోనూ పార్టీ ఎంపీలంతా చర్చించడం, కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు తీసుకోవడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారితో ముఖ్యంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు సమావేశమైన సందర్భంగా.. పోలవరం ప్రాజెక్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ కు అనుమతులు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, కడప స్టీల్‌ప్లాంట్, తెలంగాణ ప్రభుత్వం నుంచి డిస్కమ్‌లకు రావాల్సిన బకాయిల విడుదల, భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి సంబంధించి రావల్సిన అనుమతులపై చర్చించడం జరిగింది. అయితే, దీనిని కూడా టీడీపీ దుష్ప్రచారం చేయడం శోచనీయం. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై ముఖ్యమంత్రిగారు ప్రధానితోపాటు, కేంద్రమంత్రులను కలిసి క్షణం తీరిక లేకుండా ఢిల్లీ పర్యటన జరిగితే.. టీడీపీ ఎంపీలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మన దురదృష్టం ఏంటంటే.. మన రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఉండటమే. ప్రతి క్షణం దుష్ట ఆలోచనలతో, దుర్మార్గంగా వ్యవహరించే టీడీపీని రాజకీయ పార్టీ అనాలా.. లేక దుర్మార్గుల పార్టీ అనాలో కూడా అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి. - ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు, నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు రాష్ట్రాభివృద్ధిని కోరుకునే ఏ వ్యక్తి అయినా, ఏ ప్రతిపక్ష నాయకుడు అయినా, అభివృద్ధిని ప్రధాన అజెండాగా తీసుకుని కొన్ని మంచి సలహాలు ఇచ్చి ఆదిశగా ప్రయాణించాలని చెప్పడంలో తప్పులేదు. కానీ తెలుగుదేశం పార్టీ.. ఎప్పుడూ బట్టకాల్చి ప్రభుత్వం మీద నిందలు వేయడమే సరిపోతుంది. ఇది చంద్రబాబు నైజం. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు వైఖరి చూస్తునే ఉన్నాం. చంద్రబాబు అధికారంలో ఉన్న అయిదేళ్లలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేసేసినట్లు.. ఇప్పుడు ఎవరికీ మేలు జరగనట్టు గోబెల్స్ ప్రచారానికి చంద్రబాబుతో పాటు ఆయనకు వత్తాసు పలికే ఎల్లో మీడియా రోజూ దుష్ప్రచారం చేస్తుంది. రాష్ట్ర ఖజానాను దివాళా తీయించింది చంద్రబాబే టీడీపీ పార్లమెంట్ సభ్యులు నిన్న ప్రెస్‌మీట్ పెట్టి రాష్ట్రం అప్పులపాలైపోయింది, దివాళా తీసిందంటూ మాట్లాడారు. చంద్రబాబు నుంచి జగన్ గారు బాధ్యతలు చేపట్టి రాష్ట్ర పగ్గాలు తీసుకునేనాటికి ఆనాడు రాష్ట్ర ఖజానా స్థితిగతులు ఒక్కసారి ప్రజలు గమనించాలి. జగన్‌గారు అధికారం చేపట్టిన తర్వాత కనీసం ఉద్యోగులకు నెలవారీ జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితి ఉంది. చంద్రబాబు తన సొంత హెరిటేజ్ సంస్థలా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను కూడా పూర్తిగా దివాళా తీయించిన పరిస్థితి. చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాను, పరిపాలనా వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన దౌర్బాగ్య పరిస్థితి నుంచి.. జగన్‌గారు అధికారం చేపట్టిన తర్వాత గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను సక్రమంగా గాడిలో పెట్టుకుంటూ, ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో కూడా ఇచ్చిన మాట తప్పకుండా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ పరిపాలన చేస్తున్నారు. శ్వేతపత్రం ఇస్తే.. టీడీపీ బండారమే బయటపడుతుంది ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడంలో తప్పులేదు. అప్పు చేయడమే నేరమైనట్టు టీడీపీ, పార్టీ నాయకులు, పార్లమెంట్ సభ్యులు మాట్లాడటం సరైన పద్థతి కాదు. టీడీపీ ఎంపీ కనకమేడల మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సి వస్తే.. గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అరాచకాలు, తప్పుడు కార్యక్రమాలు, ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలపై చర్చ పెట్టి శ్వేతపత్రం విడుదల చేస్తే.. టీడీపీ బండారమే బయటపడుతుంది. దాంతో చిక్కుల్లో పడేది తెలుగుదేశం పార్టీయే. టీడీపీ ప్రభుత్వంలో అయిదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి అంతా అభూత కల్పనే, తమ సొంత జాగీరులా ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేశారు. - వైయస్ జగన్‌గారు సీఎం అయిన తర్వాత ఆయన చేపట్టిన ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా పూర్తి పాదర్శకంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోనే జమ అయ్యే విధంగా రూపకల్పన చేశారు. టీడీపీ పాలనలో రైతులకు పెట్టిన బకాయిలు, పేద విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలను అణా పైసలతో సహా ముఖ్యమంత్రిగారు చెల్లించారు. అప్పులు చేసి, ఖజానా ఖాళీ చేసి మీరు వెళితే... ఆ అప్పులను, వాటికి వడ్డీలను మేము తీరుస్తున్నాం. కేంద్రానికి తప్పుడు సమాచారం ఇస్తున్న టీడీపీ టీడీపీకి చెందిన పార్లమెంట్ సభ్యులు తరచుగా ఆంధ్రప్రదేశ్‌లో ఏవో ఘోరాలు, నేరాలు జరిగిపోతున్నాయంటూ.. కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి లేనిపోని అపోహలు, అనుమానాలు లేవనెత్తే విధంగా గోబెల్స్ ప్రచారానికి తెర తీస్తున్నారు. రాష్ట్ర ఎంపీలుగా రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర సహకారాన్ని కోరాల్సింది పోయి... రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి తప్పుడు సమాచారం ఇచ్చి అపోహలు, అనుమానాలు కలిగేలా చేయడాన్ని రాష్ట్ర ప్రజలు సహరించరు. - మిమ్మల్ని ఇప్పటికే చాప చుట్టినట్లు చుట్టేసి, ఓ మూలన కూర్చోపెట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. అయినా కూడా మీరు పద్ధతి మార్చుకోకుండా ఇంకా కుటిల రాజకీయాలు చేస్తున్నారు. చేతనైతే ప్రభుత్వానికి సాయం చేసేలా కేంద్రాన్ని కోరి, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలే కానీ తప్పుడు సలహాలు ఇచ్చి రాంగ్ డైరెక్షన్‌లో వెళితే టీడీపీ నాయకులకు రాబోయే రోజుల్లో ప్రజలు తగినవిధంగా బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నాం. లోక్ సభలో ప్రభుత్వ చీఫ్ విప్ మార్గాని భరత్ మాట్లాడుతూ ..టీడీపీ దిగిపోయేనాటికి రూ.100 కోట్లే ఖజానాలో ఉంచి నిధులన్నీ ఊడ్చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో మా పార్టీ సభ్యులంతా పలు అంశాలపై చర్చించాం. రాష్ట్ర సమస్యల గురించి ముఖ్యమంత్రిగారు, ప్రధాని మోదీతో సమారు గంట సేపు కూలంకషంగా చర్చించడం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూ లోటు, రేషన్ కేటాయింపుల్లో మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు.. తదితర అంశాలపై చర్చించారు. రేషన్ విషయానికొస్తే.. మన రాష్ట్రంలో కోటీ 45 లక్షలమందికి రేషన్ ఇస్తుంటే.. కేంద్రం నుంచి కేవలం 80లక్షలమందికే రేషన్ వస్తోంది. ఈ తేడాలు సరిచేయాలని కోరడం జరిగింది. ముఖ్యమంత్రిగారు రాష్ట్ర సమస్యలపై, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, నిధులపై కేంద్రాన్ని కోరితే దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోంది. - పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో టీడీపీఎంపీలకు రోజూ ఒకటే పని. పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిందించడం, పొద్దున్నే అవే విషయాలను ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడటం. ముఖ్యమంత్రిగారిని, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేలా నోటికి ఏది వస్తే అది మాట్లాడి, రాష్ట్ర పరువు, ప్రతిష్టలను దిగజారుస్తున్నారు. టీడీపీ అధికారం నుంచి దిగిపోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నిల్వలు కేవలం వందకోట్లు మాత్రమే. మరి వందకోట్లతో ఆ నెలకు పెన్షన్లు, జీతాలు ఎలా ఇవ్వాలనేది 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు తెలియదా? ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఎంతదూరమైనా.. వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు మనస్తత్వం ప్రకారం.. దేనికీ లొంగే వ్యక్తి కాదు. తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి, అప్పట్లో దేశంలోనే తిరుగలేని శక్తిగా ఉన్న సోనియాగాంధీని ఎదిరించి ప్రజల పక్షాన జగన్ గారు నిలబడ్డారు. దేశ రాజకీయాల్లోనే ఒక రోల్ మోడల్ గా పట్టుదలతో శ్రమించి, ఇప్పుడు అధికారంలోకి వచ్చి ప్రజల కోసమే నిరంతరం ఆలోచిస్తూ, పనిచేస్తున్న నాయకుడు జగన్ గారు. అటువంటి సీఎంగారు దేనికైనా లొంగుతారంటే కేవలం ప్రజల ఆకాంక్షల గురించి, ప్రజల తాలుకా సమస్యల గురించి మాత్రమే. దానికోసం ఆయన ఎంతదూరం అయినా వెళతారు. - టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి. ఉత్తరాంధ్రకు ద్రోహం చేశారని మాట్లాడుతున్న టీడీపీ ఎంపీలను సూటిగా ప్రశ్నిస్తున్నాం. మూడు రాజధానులు నిర్ణయం తీసుకుని విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తున్నందుకా, ఆంధ్రప్రదేశ్‌కు సౌత్ కోస్టల్ రైల్వే జోన్ తెచ్చినందుకా, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశంలో ఉన్న 120 మంది ఎంపీలతో సంతకాలు తీసుకుని ప్రధానికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఇది సామాన్యమైన విషయం కాదు. మేము నిస్వార్థంగా పనిచేస్తున్నాం. స్వలాభాల కోసం పనిచేసేది టీడీపీనే. అలానే, భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు పనులను ముందుకు తీసుకువెళుతున్నందుకు మా ముఖ్యమంత్రిగారు ఉత్తరాంధ్ర ద్రోహినా అని సూటిగా అడుగుతున్నాం. ఈ రకమైన మాటలు మాట్లాడటం ఇప్పటికైనా టీడీపీ ఎంపీలు మానుకుంటే సరికాదు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని దూషిస్తే.. తద్వారా తమ స్థాయిని పెంచుకోవచ్చు అని టీడీపీ ఎంపీలు మాట్లాడటం సిగ్గుచేటు. రాష్ట్ర ప్రజలందరికి విజ్ఞప్తి చేసేది ఒక్కటే. రాష్ట్రవ్యాప్తంగా డీబీటీ ద్వారా అర్హులైనవారికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు అమలు చేసే సంక్షేమ పథకాల వల్లే లబ్దిదారుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. - సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు క్యాలెండర్ ఇచ్చి మరీ అందిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్ గారు. చంద్రబాబులా పూటకో నిర్ణయం తీసుకుంటూ, కేంద్రంతో గొడవలు పెట్టుకుని రాష్ట్ర ప్రయోజనాలను మేం తాకట్టు పెట్టడం లేదు. కొవిడ్ వల్ల రాష్ట్రానికి ఆదాయం పడిపోతున్నా, సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదు. శ్రీలంకకు ఏపీకి ఏమిటి సంబంధం..? శ్రీలంక తరహాలో ఆంధ్రప్రదేశ్ అంటూ టీడీపీ, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ బోగస్ ప్రచారాలు చేస్తున్నారు. శ్రీలంకకు- ఆంధ్రప్రదేశ్ కు అసలు ఏం సంబంధం..?. శ్రీలంక ప్రభుత్వం కేవలం టూరిజం మీద ఆధారపడిపోయి నడుస్తుంది. కొవిడ్ వల్ల శ్రీలంక ఎకానమి పూర్తిగా దెబ్బతిన్నది. - అదే ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఆక్వా రంగం ఎగుమతుల్లో ఏపీ దేశంలోనే ముందుంది. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే.. మరోవైపు చంద్రబాబు పాలనలో చేసిన అప్పులకు.. నెల నెలా వడ్డీలు కట్టే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారు మాటలు తక్కువ చెబుతారు. చేతల్లో అభివృద్ధి, సంక్షేమం చేసి చూపిస్తారు. - ఇంతకాలం రాష్ట్రం అన్నిరకాలుగా వెనక్కి పోవడానికి కారణం చంద్రబాబే అని రాష్ట్రంలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. ప్యాకేజీల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు క్షమాపణలు చెప్పిన తర్వాతే మాట్లాడితే మంచిది. సంక్షేమ రాజ్యాన్ని తీసుకువచ్చినందుకు రాష్ట్ర ప్రజలంతా జగన్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు.