ప్రధాని అర నిమిషం పలకరిస్తేనే బ్రహ్మాండం బద్ధలైనట్టు టీడీపీ ప్రచారమా..? 

లోక్ సభలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్  మార్గాని భరత్, ఎంపీలు ఆర్ కృష్ణయ్య, చింతా అనురాధ 

 తప్పుచేసినట్లు రుజువైతే మాధవ్ పై పార్టీ కఠినంగా వ్యవహరిస్తుంది 

 మరి, ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు సంగతేంటి..? 

 పోలవరంపై పార్లమెంటు సాక్షిగా టీడీపీ కుట్రలు

 చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం జాప్యం
 
నిధుల మంజూరులో కేంద్రం ఏపీని ప్రత్యేకంగా చూడాలి

 ఎంపీ మార్గాని భరత్

 పార్లమెంటు సమావేశాల్లో నిర్మాణాత్మక పాత్ర పోషించాం

 రాష్ట్ర  ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం

వైయ‌స్  జగన్ గారి పరిపాలనలో గొప్ప రాష్ట్రంగా ఏపీ

 రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య

 న్యూఢిల్లీ: ప్రధాని న‌రేంద్ర‌మోదీ చంద్ర‌బాబును అర నిమిషం పలకరిస్తేనే బ్రహ్మాండం బద్ధలైనట్టు టీడీపీ ప్రచారం చేసుకుంటుంద‌ని  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్  మార్గాని భరత్, ఎంపీలు ఆర్ కృష్ణయ్య, చింతా అనురాధ విమ‌ర్శించారు.  మంగ‌ళ‌వారం న్యూఢిల్లీలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు.

మార్గాని భరత్ మాట్లాడుతూ.. 
చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై టీడీపీ సోషల్ మీడియాలో, మీడియాలో  రకరకాలుగా ప్రచారం చేసుకుంటోంది. వారి పబ్లిసిటీ పిచ్చి చూస్తే.. ఇదంతా చిన్నపిల్లల వ్యవహారంలా ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే  అపాయింట్‌మెంట్‌ ఇవ్వని మోడీగారు.. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న మీకు ప్రాధాన్యత ఇస్తారా?. ఆజాదీ కా అమృత్ మహోత్సవానికి  వచ్చిన అతిథులను మర్యాదపూర్వకంగా పలకరించే క్రమంలోనే, ప్రధాని మోదీగారు చంద్రబాబుతో కూడా నిమిషమో, అర నిమిషమో మాట్లాడారు. దానికి, టీడీపీ అనుకూల మీడియాలో మాత్రం బ్రహ్మాండం ఏదో బద్దలైపోయిందంటూ కథనాలు ప్రసారం చేస్తున్నారు.  చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి ఎలా ఉంటుందో.. విజ్ఞులైన రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. 

 బాబు ఓటుకు కోట్ల కేసు సంగతేంటి..? 
    గోరంట్ల మాధవ్  వ్యవహారంలో అతిగా స్పందిస్తున్న టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్ గా ఆడియో, వీడియోలతో సహా అడ్డంగా చంద్రబాబు దొరికిపోయి ఎనిమిదేళ్లు అయినా..  ఇప్పటివరకూ ఆ వాయిస్ తనదో, కాదో అంటే చెప్పే దిక్కుమొక్కూ లేదు. ఆ కేసులో చంద్రబాబుపై అసలు ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయిందో లేదో కూడా తెలియని పరిస్థితి. చిన్నవాళ్లకు అయితే ఒకరకమైన చట్టం... పెద్దస్థాయిలో ఉన్నవారికి మరోరకమైన చట్టమా..? అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ వ్యవహారంపై ఇప్పటికే, రాష్ట్ర మహిళ కమిషన్‌ చైర్ పర్సన్  వాసిరెడ్డి పద్మ గారు కూడా నివేదిక ఇవ్వాలని డీజీపీకి లేఖ రాశారు. అది ఫ్యాబ్రికేటెడ్ వీడియో అని ఎంపీ గోరంట్ల మాధవ్‌ చెబుతున్నారు. నిజానిజాలు తేల్చాలని మాధవ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి నివేదిక రావడానికి కొంత సమయం పడుతుంది. వచ్చాక వాస్తవాలు వెలుగు చూస్తాయి. 

 తప్పు చేస్తే పార్టీ కఠినంగా వ్యవహరిస్తుంది 
    మహిళా పక్షపాత ప్రభుత్వం మాది. ఏ మహిళకు అన్యాయం జరిగినా మేం ఉపేక్షించం. వారు ఎంతటి వారైనా పార్టీ చర్యలు తీసుకుంటుంది. నియమావళి ప్రకారం పార్టీ కఠినంగా చర్యలు తీసుకుంటుంది. అయితే, వాస్తవాలు తేలేవరకు, ఫోరెన్సిక్  నివేదిక వచ్చేవరకూ దోషి అని అనడానికి వీల్లేదు. ఇప్పటివరకూ, ఆ వీడియోకు సంబంధించి మాట్లాడిన మహిళ ఎవరో కూడా ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ, నైతిక బాధ్యతగా, ఆ వీడియోపై నివేదిక అడిగాం. ఒకవేళ ఆ వీడియో మార్ఫింగ్‌ కాకుంటే.. ఎంపీ మాధవ్ పై వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేస్తున్నాం.

 పోలవరంపై టీడీపీ కుట్రలు- బాబు తప్పిదం వల్లే పోలవరం జాప్యం 
        పోలవరం ప్రాజెక్ట్‌ విషయానికి వస్తే.. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రాన్ని ఇరకాటంలో పెట్టి నిధులు రానివ్వకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిధులు ఎక్కడా దుర్వినియోగం కాలేదని, కనకమేడల అడిగిన ప్రశ్నకు సమాధానంగా, కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్నిబట్టే టీడీపీ ఆలోచనా విధానం ఏంటో అర్థం అవుతోంది. వీళ్ళు ఎంతసేపటికీ ఏపీ ప్రజలకు అన్యాయం చేసేవిధంగా ఉన్నారే తప్ప, ఏపీకి మద్దతుగా ఉన్నట్లు ఏకోశానా కనిపించడం లేదు. పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్రం నిధులు ఇవ్వకూడదనేలా టీడీపీ నాయకులు పార్లమెంటులోనూ అడ్డుపడుతూ కుట్రలు చేస్తున్నారు. 

 కేవలం చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాల వల్లే, శరవేగంగా జరగాల్సిన పోలవరం ప్రాజెక్ట్‌ పనులు ఆలస్యం అయ్యాయి. మెడమీద తలకాయ ఉన్నవాడెవడూ కాఫర్‌ డ్యామ్‌ లు కట్టకుండా డయాఫ్రం వాల్‌ కట్టడు. అయినా, చంద్రబాబు కాఫర్ డ్యామ్ లు పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించాడు. గ్రావెటీతో స్పిల్‌వే ద్వారా నీటిని పంపించేసి, పోలవరం ప్రాజెక్ట్‌ పనులు పూర్తయినట్లు ప్రజలను మభ్యపెట్టాలని ఎన్నికల ముందు తప్పుల మీద తప్పులు చేశాడు. దాంతో, కాఫర్‌ డ్యామ్‌ వద్ద పెద్ద అగాథాలు ఏర్పడి, గ్యాప్‌లు రావటంతో, వరదలు  వచ్చిన సమయంలో,  ఆ ధాటికి డయాఫ్రం వాల్‌ పూర్తిగా దెబ్బతిన్నది. చంద్రబాబు నాయుడు అనాలోచిత నిర్ణయాలు వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చి ఉంటే వరద నీటి వల్ల దిగువన ఉన్న ముంపు గ్రామాల పరిస్థితి ఏమై ఉండేది? అనే ఇంగిత జ్ఞానం కూడా చంద్రబాబుకు లేకుండా పోయింది.  ఇప్పుడు మళ్ళీ డయాఫ్రం వాల్‌ నిర్మాణం చేసిన తర్వాతే ప్రాజెక్ట్‌ పూర్తవుతుంది. దీనివల్ల కాలయాపన కూడా జరుగుతోంది. దీనినిబట్టి చంద్రబాబు నాయుడు మైండ్‌సెట్‌ ఏరకంగా ఉందనేది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి.

 విభజన హామీలు, ధరల పెంపుపై పార్లమెంటులో నిలదీశాం 
    పార్లమెంట్‌ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించి ఎన్నో అంశాలు చర్చకు రావడం జరిగింది. ఈ సమావేశాల్లో ప్రధానమైనవి నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల - నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు అంశాన్ని ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వల్ల సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి సభలో చర్చించాం. వంట నూనె మొదలు, వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లో కేంద్రం దృష్టికి తీసుకువచ్చాయి. అలానే, దీర్ఘకాలిక అంశాలపై తీసుకోవాల్సిన చర్యలుపై ప్రస్తావించాం.

   రైతు సమస్యలపైనా చర్చించాం. రైతు బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి. రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. మన రైతులు ప్రధానంగా వరి, గోధుమ పండిస్తున్నారు. అయితే వివిధ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహకాలు, సబ్సిడీలు ఇచ్చి వాటిని ఇక్కడే పండించేలా చర్యలు తీసుకుంటే దీర్ఘకాలికంగా దిగుమతులు చేసుకునే పరిస్థితి రాదు. అలాగే దేశ జీడీపీ కూడా పెరుగుతుంది. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కార్‌ వీటిపైన ఎందుకు దృష్టి పెట్టలేదని మేము ప్రశ్నిస్తున్నాం.

- పామాయిల్‌ నూనెను  ఉక్రెయిన్‌ నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. భారతదేశం వ్యవసాయ దేశం. పామాయిల్‌కు ఎంత అయితే డిమాండ్‌ ఉందో దాన్ని ఇక్కడే పండించుకునే సామర్థ్యం మనకు ఉంది. అయినా కూడా ఆ పంట పండించడంలో వెనుకబడి ఉన్నాం. దానిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

- అలానే, పెట్రోల్‌, డీజిల్‌కు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై కూడా దృష్టి సారించాలి. గత ఏడాది 170-180 బిలియన్‌ డాలర్ల ఫ్యూయల్‌ను మన దేశం దిగుమతి చేసుకుంది.  ఇక  విద్యుత్ ఉత్పత్తి విషయానికొస్తే.. సోలార్‌, విండ్‌ ఎనర్జీని స్టోరేజ్‌ చేసుకునే సామర్థ్యం మనకు లేదు. దేశవ్యాప్తంగా దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

- ఆంధ్రప్రదేశ్ లో  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు రెన్యువబుల్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగానే,  కర్నూలు జిల్లాలో 5,230 మెగావాట్లతో భారీ ఇంటిగ్రేడెట్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ఇది విప్లవాత్మకమైన నిర్ణయం. దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ గారిని కలిసి రాష్ట్రంలో పర్యటించాల్సిందిగా కోరాం. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. 

- ఎన్‌ఎఫ్‌ఎస్‌ ఏ (నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ యాక్ట్‌) కింద కేంద్రం పంపిణీ చేస్తున్న బియ్యంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని నీతి ఆయోగ్‌ సమావేశంలో మా ముఖ్యమంత్రిగారు ప్రస్తావనకు తెచ్చారు. అలాగే ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశాం. ఈ పథకాన్ని ఏపీలో 61 శాతం జనాభాకు మాత్రమే అమలు చేస్తున్న కేంద్రం.. ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఇక్కడ కూడా 76 శాతం ఇవ్వాలని కోరుతున్నాం. 

-  గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పరిమితికి మించి ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను ఉల్లంఘించి నిధులు తీసుకున్నారని,  ఇప్పుడు మాకు ఇచ్చే నిధుల్లో కోత పెడుతున్నారు. ఇది సరికాదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్యాయంగా విభజించబడిందని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్నారు. ఏపీని మిగతా రాష్ట్రాలతో పాటు చూడకుండా, ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక దృష్టితో చూడాలని, నిధులు విడుదల  చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం.

- రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రిసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌, రెవెన్యూ లోటు విషయానికి వస్తే..  కాగ్‌, నీతి ఆయోగ్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం రూ. 22వేల కోట్లు ఉంది. దానిలో కేవలం రూ.4వేల కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చింది. ఇంకా 18వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. దఫదఫాలుగా ఇవ్వడం వల్ల క్యాపిటల్‌ ఎక్సెపెండిచర్‌కి ఆ నిధులను ఖర్చు పెట్టడానికి అవకాశం లేకుండా పోతుంది. ఆ మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం.

- ఆంధ్రా-తెలంగాణ విభజన జరిగిన తర్వాత.. కేంద్రం మధ్యవర్తిగా ఉండి,  తెలంగాణ జెన్ కో నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు రూ.  6,627 కోట్లు ఇప్పించాలని కోరాం. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి, తెలంగాణ రాష్ట్రంతో సంప్రదించి ఏపీకి రావాల్సిన జెన్ కో బకాయిలు వెంటనే వచ్చేలా చూడాలి.

- ఏపీకి కేంద్ర ప్రభుత్వం కేవలం మూడు మెడికల్‌ కాలేజీలు మాత్రమే మంజూరు చేసింది. జనాభా లెక్కల ప్రకారం మరిన్ని మెడికల్‌ కాలేజీలు మంజూరు చేయాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మరో 13 మెడికల్‌ కాలేజీలకు శంకుస్థాపనలు చేసింది. వాటిని కేంద్రమే టేకప్‌ చేసి నిధులు మంజూరు చేయాలి.

 రాజ్యసభ సభ్యులు ఆర్‌. కృష్ణయ్య మాట్లాడుతూ..  
    పార్లమెంటు సమావేశాల్లో అటు లోక్‌సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషించింది. విభజన  సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై కేంద్రాన్ని నిలదీశాం. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు కేంద్రానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చాం. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తున్నాం.  లోటు బడ్జెట్ తో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ లో.. ఈరోజు దేశంలోనే ఎక్కడాలేని విధంగా వినూత్నమైన, మానవ, సమాజ వికాసానికి, రాష్ట్ర పురోభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలతోపాటు, రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యం అనే లక్ష్యంతో అమ్మ ఒడి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం బోధన, నాడు-నేడు కార్యక్రమం ద్వారా సర్కారు  స్కూళ్ళు అభివృద్ధి చేయడం, కాలేజీ చదువులు చదివే విద్యార్థులకు విద్యా దీవెన,  వసతి దీవెన పథకాలను అందిస్తున్నారు. శాశ్వతమైన అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ గారు ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నారు. జగన్ గారి పరిపాలనలో, మరో పదేళ్ల తర్వాత దేశంలోనే కాకుండా, ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్‌  గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దబడుతుంది. పార్లమెంట్‌లో మేము మాట్లాడుతున్నప్పుడు ఇతర రాష్ట్రాల ఎంపీలు సైతం, మీ ముఖ్యమంత్రిగారు ఈ పథకాలు అన్నింటినీ ఎలా అమలు చేస్తున్నారంటూ ఆశ్చర్యపోతున్నారు. 

- కేంద్ర ప్రభుత్వం ఓవైపు రుణ పరిమితిని విధించి అప్పులు రాకుండా చేయడం, మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రిగారు ప్రధాని మోదీగారిని కలిసి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని నిధులు, పథకాలకు సంబంధించి ప్రతి పైసా ఇవ్వాల్సిందిగా కోరారు. అలాగే రుణ పరిమితులపై ఉన్న నిబంధనలు, ఆంక్షలు తొలగించాలని కోరడం జరిగింది.  ఓవైపు రాష్ట్ర అభివృద్ధి.. మరోవైపు సంక్షేమ పథకాల అమలు ద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న తొలి రాష్ట్రం కాబట్టి ఈ పరిమితులను తొలిగించాలని సీఎంగారు కోరారు. 
- విభజన హామీలు, నిధులు మంజూరు, రావాల్సిన బకాయిలు ఏపీకి ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగారు జనరంజకమైన పరిపాలన అందిస్తున్నారు. కేంద్రం నుంచి సరైన చేయూత లేదని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. కేంద్రం కూడా అదనపు బడ్జెట్‌ ఇచ్చి, విభజన హామీలను అమలు చేయాలని కోరుతున్నాం. ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్లే.. మిగతా 13 మెడికల్‌ కాలేజీలకు కూడా నిధులు మంజూరు చేయాల‌ని కోరారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top