వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని పునఃస‌మీక్షించాలి

 కేంద్ర హోం మంత్రిని కలిసిన వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు

న్యూఢిల్లీ:   వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణ‌యాన్ని పునఃస‌మీక్షించాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్ర హోం మంత్రి అమీత్‌షా‌ను కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వేసే ఏ అడుగైనా రాష్ట్రానికి నష్టమేన‌ని తెలిపారు. శుక్ర‌వారం న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమీత్‌షాను వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు క‌లిసి విన‌తిప‌త్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ప్రణాళికను పరిగణనలోకి తీసుకుని ప్లాంటును పరిరక్షించాలని, పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికను పునఃసమీక్షించాలని కేంద్రాన్ని కోరిన‌ట్లు ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అతి పెద్ద ప్రభుత్వ రంగ యూనిట్‌ ఇది. ప్రత్యక్షంగా 20 వేల మందికి ఉపాధి అందిస్తోంద‌ని కేంద్ర మంత్రికి వివ‌రించిన‌ట్లు చెప్పారు. పరోక్షంగా మరో 20 వేలకు మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో దశాబ్దకాలం పోరాటం తర్వాత ఈ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. దీనిపై ఏపీ ప్రజలకు అపారమైన సెంటిమెంట్‌ ఉంది. అందువల్ల ప్రధాన మంత్రికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఇప్పటికే దీనిపై లేఖ రాశారు. స్టీల్‌ ప్లాంటు తెలుగు ప్రజల సంకల్పానికి సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొన్నారు. స్టీల్‌ ప్లాంటును కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఉక్కు శాఖతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. ప్రస్తుతం కంపెనీ నెలకు రూ. 200 కోట్ల లాభాలు ఆర్జిస్తోంది. 6.3 మిలియన్‌ టన్నుల మేర వార్షిక ఉత్పత్తి చేస్తోంది. ఇదే తరహా పనితీరు స్థిరంగా కొనసాగాల‌ని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర మంత్రి అమీత్‌షాను కోరిన‌ట్లు మిథున్‌రెడ్డి తెలిపారు. 

Back to Top