జగనన్న నవరత్నాలు చూసి.. టీడీపీకి నవ రోగాలు, నవ రోదనలు

  వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు మార్గాని భరత్,  గోరంట్ల మాధవ్, బెల్లాన చంద్రశేఖర్  

 టీడీపీ ఏడుపు పార్టీగా తయారైంది 

 పేదవాడికి మంచి జరుగుతుంటే టీడీపీ ఏడుపేంటి..? 

వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి  ట్రెండ్ సెట్టర్ 

న్యూఢిల్లీ:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమ‌లు చేస్తున్న న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌ను చూసి టీడీపీకి న‌వ రోగాలు, న‌వ రోద‌న‌లు వ‌స్తున్నాయ‌ని లోక్ సభలో వైయ‌స్ఆర్ సీపీ చీఫ్ విప్  మార్గాని భరత్ అన్నారు.  పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై పోరాటం చేస్తూ, వాటిని సాధించుకుంటూ ముందుకు వెళుతుంటే.. టీడీపీ మాత్రం ఢిల్లీ వచ్చి ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రిగారిపైన నిందలు మోపుతుంద‌న్నారు. రాష్ట్రంలో పేదవాడికి మంచి జరుగుతుంటే.. చూసి ఓర్వలేక, టీడీపీ ఒక ఏడుపు పార్టీగా తయారైంది.  తెలుగుదేశం పార్టీ ఎంపీలు మాటలు, వారి పద్ధతి చూస్తుంటే.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా.. రాష్ట్రాన్ని దెబ్బతీసే విధంగా వారి మాటలు - చేష్టలు ఉన్నాయి.  జగనన్న నవరత్నాలు అమలు చేస్తుంటే.. టీడీపీకి నవ రోగాలు, నవ రోదనలు వారి విధానంలో ఉంది. రోజూ వారిది ఏడుపు పార్టీనే. మంచి జరుగుతుంటే.. ప్రతి దానికీ ఏడుపే.  అందుకే, కేంద్రం జోక్యం చేసుకోవాలని, రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని.. ఇలా రోజూ టీడీపీ నేతల రోధనలు, ఆక్రందనలు. టీడీపీ నాయకులు పొద్దున లేస్తే.. ఏదొక ఏడుపుతో, ఆర్తనాదాలతో వారి రాజకీయాన్ని ప్రారంభిస్తున్నారు. 

- ఇటీవల రాష్ట్రానికి సంబంధించి, దక్షిణ కోస్తా రైల్వే జోన్ పై కేంద్ర కేబినెట్ లోనూ చర్చించారు. మా పార్టమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి, లోక్ సభలో ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గార్ల నేతృత్వంలో మా పార్టీ ఎంపీలంతా చేసిన పోరాటం ఫలితంగా, ముఖ్యమంత్రి గారి జోక్యంతో, ఇవ్వటం కుదరని, సాధ్యం కాదని చెప్పిన పరిస్థితుల నుంచి ఈరోజు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇచ్చే విషయంలో ఒక అడుగు ముందుకు పడింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కాదా..?

- టీడీపీ ఎంపీలు కనకమేడల  రవీంద్రకుమార్, రామ్మోహన్ నాయుడులు స్థాయికి మించి మాట్లాడుతున్నారు. ఇకనైనా, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రజలు చెవిల్లో పువ్వులు పెట్టుకున్నట్టు ప్రభుత్వంలో రూ. 48 వేల కోట్లు అవినీతి జరిగిందని టీడీపీ ఎంపీలు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. ఇన్ని నీతులు చెబుతున్న తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా వేస్ అండ్ మీన్స్ కింద 2018-19లో రూ. 59 వేల కోట్లు ఆ హెడ్స్ లో వాడింది వాస్తవం కాదా..? 

- కాగ్ అడిగిన లెక్కలకు మేం ఇప్పటికే సమాధానం ఇచ్చాం. ఇవన్నీ ప్రభుత్వంలో సహజంగా జరిగేవే. ఇదేమీ కొత్త కాదు.  కొవిడ్ సమయంలో ఏడాదికి 30 వేల కోట్ల రూపాయలు ఆదాయం తగ్గిపోయినా కూడా.. ఎక్కడా సంక్షేమ పథకాలు ఆపలేదు. 

వైయ‌స్ జగన్ గారు ట్రెండ్ సెట్టర్ 
    నవరత్నాల ద్వారా పేదలకు 34 నెలల్లోనే ఒక  లక్షా 75 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే.. అందులో నేరుగా డీబీటీ ద్వారా ఒక లక్షా 32 వేల కోట్లు వారి ఖాతాల్లోనే జమ చేస్తే.. అది లూటీనా.. దోపిడీనా..? దోచేయడమా..? దోచేయడం అంటే టీడీపీ హయాంలో గ్రామగ్రామాన టీడీపీ కార్యకర్తలతో జన్మభూమి కమిటీలు పెట్టుకుని.. రేషన్ కార్డు ఇస్తే ఇంత, పెన్షన్ ఇస్తే ఇంత, ఇల్లు ఇస్తే ఇంత.. అని ప్రతి దానికీ ఓ రేటు పెట్టి మామూళ్ళు వసూలు చేయడం.  ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టులను మీ మనుషులకు, మీ బినామీలకు ఇచ్చి, ప్రాజెక్టులను ఏటీఎంలుగా వాడుకుని దోచుకోవడం.  పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాలా..? ఆర్టికల్ 360 ఉపయోగించాలా..? రాష్ట్రంలో పేదరికం నిర్మూలించేందుకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదలను జగనన్న చేయి పట్టుకుని నడిపిస్తుంటే.. ఎందుకు కడుపు మంట? 

- నవరత్నాల పేరుతో మంచి చేసే కార్యక్రమాలు చేస్తుంటే.. టీడీపీ నవ రోగాలతో ఏడుస్తుంది. జగన్ గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నవరత్నాలను ఏదో విధంగా నిలిపివేయాలని టీడీపీ అడ్డంకులు సృష్టిస్తుంది. మరోవైపు నెలనెలా సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేసి మరీ జగన్ గారు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. 

- ఈరోజు పంజాబ్ రాష్ట్రంలో కూడా డోర్ డెలివరీ ద్వారా బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను ఇస్తున్నారు. ఇదొక్కటే కాదు, జగన్ మోహన్ రెడ్డిగారు అమలు చేస్తున్న సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లు, ఆర్బీకే కేంద్రాలు.. ఏవి చూసుకున్నా దేశంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డిగారు ఒక ట్రెండ్ సెట్టర్. 

 ఒక్క బెల్టు షాపు అయినా చూపించగలరా..? 
    చంద్రబాబు హయాంలో ప్రతి వీధిలో మద్యం బెల్టు షాపులు ఉండేవి. ఆఖరికి కిల్లీ బంకుల్లో, కూల్ డ్రింక్ షాపుల్లోనూ మద్యాన్ని మంచినీళ్ళలా అమ్మించాడు. జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక, మద్యం పాలసీ తెచ్చి, దశల వారీగా నిషేధించే కార్యక్రమంలో భాగంగా, మద్యాన్ని పూర్తిగా నియంత్రిస్తుంటే..  అక్రమ మద్యం అని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు.  రాష్ట్రంలో ఈరోజు ఒక్క బెల్టు షాపు అయినా చూపించగలుగుతారా.. ? ప్రభుత్వమే ఎస్ఈబీ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి, ఎక్కడికక్కడ అక్రమ మద్యాన్ని నియంత్రిస్తుంది. 

-  జే-ట్యాక్స్ అని, మరొకటి అని ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ముఖ్యమంత్రి గారు సుపరిపాలన అందిస్తున్నారు.  టీడీపీ అంటే ఓ అబద్దపు పార్టీ అని ప్రజలకు అర్థమైంది. అందుకే మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా.. ప్రజలు మిమ్మల్ని విశ్వసించలేదు. 

 అమరావతిలో పక్కా బిల్డింగ్ ఒక్కటైనా కట్టారా..? 
     చంద్రబాబు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి.. అమరావతిలో ఒక పక్కా బిల్డింగ్ అయినా కట్టారా..? 54 వేల ఎకరాల భూమి రైతుల దగ్గర నుంచి తీసుకుని, ఏడాదికి మూడు పంటలు పండే రేగడి భూముల్లో బిల్డింగ్ లు కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది.? చంద్రబాబు లెక్కల ప్రకారమే అమరావతికి రూ. 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పాడు. మరోవైపు ఎక్కడైనా ఇన్ని లక్షల కోట్లతో రాజధాని నిర్మించడం జరిగిందా, అది సాధ్యమవుతుందా.. ? అవేమీ చూడలేదు. అమరావతిని భ్రమల్లో చూపించి, ప్రజలను వంచించాడు కాబట్టే, బాబుకు ప్రజలు బుద్ధి చెప్పారు. 

- భవిష్యత్తులో కూడా ప్రాంతాల మధ్య అసమానతలు రాకుండా, మూడు రాజధానులు ఏర్పాటు చేసి, మూడు ప్రాంతాలు అభివృద్ధి చేస్తుంటే.. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన శ్రీకాకుళం జిల్లా నుంచి గెలిచిన రామ్మోహన్ నాయుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తే.. అభివృద్ది చెందుతుంది. ఎందుకు అడ్డుకుంటున్నారు. మీ అక్కసు ఏంటి..? వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామ్మోహన్ నాయుడికి ఉత్తరాంధ్ర అభివృద్ధి కావడం ఇష్టం లేదా..? అక్కడ కార్యనిర్వాహక రాజధాని వస్తే, ఆ ప్రాంత ప్రజలకు లాభమా.. నష్టమా అన్నది చెప్పాలి. మిమ్మల్ని గెలిపించిన మీ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించాలేగానీ.. చంద్రబాబుకు ఊడిగం చేయడం ఇకనైనా మానాలి.  ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారికి ఉండాల్సిన ప్రథమ లక్షణంః గెలిపించిన ప్రజలపై మమకారం, ప్రేమ, భక్తి. టీడీపీ ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు మీద భక్తే తప్పితే.. ప్రజలపై భక్తిగానీ, బాధ్యత గానీ లేదు. 

- పైగా, కోర్టులను తప్పుబడుతున్నాం అని టీడీపీ ఎంపీలు విమర్శలు చేస్తున్నారు.  న్యాయం జరగకపోతే పై కోర్టుకు అప్పీల్ కు వెళుతుంటాం. పై కోర్టుకు వెళ్ళేది కూడా మరి, తప్పేనా..? పార్లమెంటేరియన్ గా మనం అంతా చట్టాలు చేస్తాం. న్యాయం జరగలేదని అనిపిస్తే.. ఎవరైనా అప్పీలుకు వెళతారు. 

- టీడీపీకి ప్రతి దానిలో రాజకీయం కావాలి. ఎక్కడ ఏం జరిగినా అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మెడకు చుట్టాలి అన్నదే వీరి తాపత్రయంగా కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తుంటే.. టీడీపీ నేతలు విశాఖలో వైఎస్ఆర్సీపీకి, ముఖ్యమంత్రిగారికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, ప్రజల్ని రెచ్చగొట్టారు.  చేతనైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో, పార్లమెంటులో పోరాడాలి.  ప్రత్యేక హోదా కోసం పోరాడాలి. పోలవరం నిధుల కోసం పోరాడాలి.  ప్రధాన  ప్రతిపక్షంగా, రాష్ట్రం కోసం ఏ ఒక్కటీ కేంద్రాన్ని అడక్కపోగా.. రాష్ట్ర ప్రభుత్వంపైనే విమర్శలు చేయడం టీడీపీ దిగజారుడు రాజకీయానికి పరాకాష్ట. 

ఎవరి చరిత్ర ఏంటో చర్చిద్దామా..? 
    చంద్రబాబు చరిత్ర, జగన్ గారి చరిత్ర ఎవరి చరిత్ర ఏంటో చర్చిద్దామా.. ? 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు చరిత్ర అంతా వెన్నుపోట్లు, వంచన రాజకీయాలే.  రేపు టీడీపీ 40 ఏళ్ళ పండగ చేస్తున్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, ఆయన కుర్చీ, పార్టీ లాక్కుని, అధికారంలోకి వచ్చి మళ్ళీ ఆయనకు దండేయడానికి చంద్రబాబుకు సిగ్గు లేదా..?

- పార్టీ లేదు బొక్కా లేదు అని అచ్చెన్నాయుడే చెప్పారు. 40 ఏళ్ళ ఆవిర్భావ సందర్భంగా వారు ఇదే చెబుతారా..?

- 40 ఏళ్లలో మీరు చేయలేనిది, కేవలం 34 నెలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో మేము చేసిన మేలును నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే చర్చకు రండి. మీరు 40 ఏళ్లలో ఏమీ చేయలేకపోయారు. కానీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 34 నెలల్లోనే అందరికీ ఎంతో మేలు చేసింది. దీనిపై చర్చకు వస్తారా? ఆ ధైర్యం మీకుందా? చంద్రబాబుగారికి సవాల్‌ చేస్తున్నా. కమాన్‌ చర్చకు రండి.

- వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారు ప్రజలకు ఇచ్చిన మాట కోసం, అప్పుడు కేంద్రంలో ఉన్న సోనియా గాంధీని వ్యతిరేకించి, దమ్మున్న మగాడిలా, సొంతంగా పార్టీ పెట్టి, ఈరోజు  గొప్ప విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చారు. సంక్షేమ రాజ్యాన్ని అమలు చేస్తున్నారు. చంద్రబాబుకు, జగన్ గారికి పోలిక ఎక్కడ. నక్కకు, నాక లోకానికి ఉన్నంత తేడా ఉంది. 

- ఉగాది నుంచి రాష్ట్రంలో కొత్తగా 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ, జగన్ గారు ముందుకు వెళుతుంటే.. అది చూసి కూడా టీడీపీ వాళ్ళు ఏడుస్తున్నారు.  40 ఏళ్ల మీ పొలిటికల్‌ ఇండస్ట్రీలో.. పరిపాలన వికేంద్రీకరణ ఎన్నడూ చేయలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో జగన్‌మోహన్‌రెడ్డిగారు హామీ ఇచ్చారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తున్నారు. ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబు, తన రాజకీయ జీవితంలో ఏ ఒక్క మంచి, ప్రజలకు మేలు చేయకపోగా, జిల్లాలు విభజన చేస్తుంటే, ఈరోజు కుప్పం పరిస్థితి ఏంటి, నా బామ్మర్ది హిందూపురం పరిస్థితి ఏమిటి అని అడగటానికి సిగ్గు అనిపించడం లేదా..?

- రఘురామకృష్ణరాజు ప్రధానికి రాసిన లేఖపై.. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..  కమెడియన్స్ గురించి, ఎన్ సీల గురించి కూడా మాట్లాడాలా..?. అతని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. 

 ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ... 
- 2019 ఎన్నికల్లో చావును తప్పించుకుని కన్ను లొట్టబోయినట్టు అతికష్టం మీద ముగ్గురు టీడీపీ ఎంపీలు గెలిచారు. వారు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి, చనిపోయిన పార్టీని బతికించుకోవడానికి పార్లమెంటును వినియోగించుకుంటున్నారు.

- 2014లో అధికారంలోకి వచ్చాక,  ప్రత్యేక హోదాని తన స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్రానికి తాకట్టు పెట్టింది చంద్రబాబు.  దాన్ని తిరిగి సాధించుకోవడం కోసం కలిసి రమ్మని టీడీపీ ఎంపీలను కోరినా, వారు కలిసి వచ్చే పరిస్థితి లేదు. 

- ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు తేలు కుట్టిన దొంగలా దొరికిపోయి, హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి అమరావతి రాజధాని పేరుతో ప్రజలను వంచించాడు. 

- బషీర్ బాగ్ లో రైతులను కాల్చి చంపిన చంద్రబాబు, రైతుల గురించి, వ్యవసాయం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. 

- బీసీలు జడ్జిలుగా పనికిరారని, బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా లేఖలు రాసిన చంద్రబాబు టీడీపీ ఆవిర్భావ సభలో బీసీల గురించి ఏం చర్చిస్తారు..?. అలానే ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా.. అని మాట్లాడిన చంద్రబాబు ఎస్సీల గురించి ఏం చర్చిస్తారు..?

- ఒక సభ్యత, సంస్కారం లేకుండా టీడీపీ ఎంపీలు ముఖ్యమంత్రిగారిపై విమర్శలు చేస్తున్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాం. రామ్మోహన్ నాయుడు ఉన్నత చదువులు చదువుని కూడా, ఒక వీధి రౌడీలా, నిరక్షరాస్యుడిలా మాట్లాడుతున్నాడు. 

ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ..
 రాష్ట్రం విడిపోయినప్పుడు 95 వేల కోట్ల అప్పు ఉంటే.. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక మరో రూ. 2 లక్షల కోట్లు అప్పులు భారం మోపాడు. ఈరోజు అప్పుల గురించి టీడీపీ ఎంపీలు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి, ఎగ్గొట్టాడు. టీడీపీ ఎంపీలు పార్లమెంటును రాష్ట్ర రాజకీయాలకు వేదికగా వాడుకుంటున్నారు తప్పితే, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడటం లేదు. వారు అసలు ఎంపీలా..? అన్న అనుమానం కలుగుతుంది. 

- ప్రత్యేక హోదా సాధించుకోవాలి..  పోలవరం నిధులు రాబట్టాలి. రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించుకోవాలి తప్పితే.. పార్లమెంటు వేదికగా రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేయడానికి సిగ్గు లేదా..?

Back to Top