సీబీఐ దర్యాప్తు అధికారి పనితీరు పక్షపాతంగా ఉంది

సాక్ష్యాధారాలు లేకపోయినా కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం జరుగుతోంది

విచారణలో నేను చెప్పిన విషయాలను కూడా ఆ అధికారి మార్చేస్తున్నారు 

న్యాయవాది సమక్షంలో ఆడియో, వీడియో రికార్డింగ్‌తో విచారణ జరగాలి

తెలంగాణ హైకోర్టులో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి రిట్‌ పిటిషన్‌

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. వైయస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయాలని, న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలని రిట్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. 160 సీఆర్‌పీసీ నోటీస్‌ ఇచ్చారు కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి పిటిషన్‌లో కోరారు. 

వైయస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని ఇప్పటి వరకు సీబీఐ అరెస్టు చేయలేదని, దస్తగిరి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కూడా సీబీఐ ఎక్కడా వ్యతిరేకించలేదన్నారు. దస్తగిరి అక్కడా ఇక్కడ విని చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ విచారణ కొనసాగుతోందన్నారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ హత్య కేసులో తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందన్నారు. దర్యాప్తు అధికారి పనితీరు పక్షపాతంగా ఉందని, వైయస్‌ వివేకా హత్య ఎలా జరిగిందో ముందుగానే నిర్ణయించుకొని, అదే కోణంలో విచారణ చేస్తున్నారన్నారు. తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా విచారణాధికారి కొందరిపై ఒత్తిడి కూడా తెస్తున్నారన్నారు. తాను విచారణలో చెప్పిన విషయాలను కూడా మార్చేస్తున్నారన్నారు. 

‘నన్ను మొదటిసారి విచారించినప్పటి నుంచి సీబీఐ అధికారులు అడిగినవి, అడగనివి కూడా చిలువలు పలువులు చేస్తూ దుష్ప్రచారం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్ముకాసే పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్‌ మీడియా వేదికలు ప్రజల్లో అపోహలు కలిగించేలా అవాస్తవాలను వ్యాప్తిలోకి తీసుకొచ్చాయి. ప్రజల్లో అపోహలు తొలగించేందుకే సీబీఐ విచారణను రికార్డు చేయాలని విచారణ అధికారిని లిఖితపూర్వకంగా కోరాను. రెండోసారి విచారణకు పిలిచినప్పుడు కూడా రికార్డు చేయాలని సీబీఐ డైరెక్టర్‌ను, విచారణ అధికారి రామ్‌సింగ్‌ను లిఖితపూర్వకంగా కోరాను. అయినా పట్టించుకోలేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించాను’ అని పిటిషన్‌లో ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top