రైతు సమస్యలపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వం

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి

ఉల్లికి గిట్టుబాటు ధ‌ర కల్పించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల విన‌తి

వైయ‌స్ఆర్ జిల్లా:  అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు ప‌రిష్క‌రించాల‌న్న చిత్త‌శుద్ధి కూటమి ప్రభుత్వానికి  లేదని వైయ‌స్ఆర్‌సీపీ క‌డ‌ప ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి  విమర్శించారు.  వైయస్ఆర్ కడప జిల్లాలో ఉల్లి పంటకు సరైన గిట్టుబాటు ధరలేక రైతులు తమ పంటను నీటి పాలు చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు జిల్లా క‌లెక్ట‌ర్ దృష్టికి తెచ్చారు. ఉల్లి రైతుల‌ను ఆదుకోవాల‌ని ఈ మేర‌కు  ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, వైయ‌స్ఆర్‌ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, కడప మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డి త‌దిత‌రులు జిల్లా క‌లెక్ట‌ర్‌ను క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. అనంత‌రం వారు మీడియాతో మాట్లాడారు. ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. `ఉల్లి, టమాట రైతులు భారీగా నష్టపోతున్నా ప్రభుత్వంలో కనిస స్పందన లేకపోవడం దారుణం. రైతులు దిగుబడిని పొలంలోనే పశువులకు మేతగా వదిలేస్తున్నారని, ఇలాంటి పరిస్థితిని కూడా పార్టీలకు ఆపాదించడం వారి కూటమి నేతల అవివేకం. ఉల్లి పంట ను వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన రైతులు మాత్రమే సాగు చేయలేదనే విషయాన్ని గుర్తించాలి. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తలా.. తోక లేకుండా మాట్లాడుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించడం చేతగాక పంట నాణ్యతపై మాట్లాడటం మంత్రి స్థాయిలో తగదు.  ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించి ఉల్లి పంట‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాలి` అని డిమాండ్ చేశారు.

Back to Top