విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కానివ్వమని, స్టీల్ ప్లాంట్ కోసం పోరాటానికీ సిద్ధం.. ప్రాధేయపడటానికీ సిద్ధమేనని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ టీడీఐ జంక్షన్ వద్ద ప్లాంట్ ఉద్యోగులు, ప్రజా సంఘాల ధర్నాకు వైయస్‌ఆర్ సీపీ మద్దతు తెలిపింది. ధర్నాలో ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజ్ తదితరులు పాల్గొని.. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదలు, మైనార్టీలు, కార్మికుల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ అని ఉద్ఘాటించారు. రాజకీయాలకు అతీతంగా ప్లాంట్ కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అని మొదటి నుంచి చెప్తున్నామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం కాకూడదని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎం వైయస్ జగన్ పూర్తిగా వ్యతిరేకించారన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమించి స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలని ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ప్లాంట్ ప్రైవేట్‌పరం చేయాల్సిన అవసరం లేదని, ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతోనే కేంద్రం సొంత గనులు ఇవ్వలేదని మండిపడ్డారు. రూ.4,500 కోట్ల పెట్టుబడి పెడితే ఈ రోజు రూ.5,096 కోట్ల లాభాలతో స్టీల్ ప్లాంట్ నడుస్తుందన్నారు. 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నడుస్తుందన్నారు. సొంతంగా గనులు కేటాయిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడుస్తోందని, 14 శాతం వడ్డీ రుణాన్ని ఈక్విటీగా మార్చాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ వ్యతిరేకిస్తున్నారని, ప్లాంట్‌పై కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం వైయస్ జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారని గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్ కోసం కార్మిక సంఘాలతో కలిసి పోరాడుతామని, అన్ని కార్మిక సంఘాలను ఢిల్లీ తీసుకెళ్తామన్నారు. ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్ కోరతామన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.