తాడేపల్లి: బాపట్ల జిల్లా మేధరమెట్లలో మార్చి 3న నిర్వహించ తలపెట్టిన సిద్ధం సభ 10వ తేదీన జరిపాలని పార్టీ నిర్ణయించిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. మేధరమెట్ల వద్ద సిద్ధం సభ ఏర్పాట్లను మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణలతో కలిసి విజయసాయిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్ధం సభలకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. మేధరమెట్ల సిద్ధం సభకు వచ్చేందుకు ఇప్పటివరకు 7 లక్షల పైగా సంసిద్ధత తెలిపారని, మొత్తం 15 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. 98 ఎకరాల ప్రాంగణంలో సభ నిర్వాహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, వాహనాల పార్కింగ్ కోసం కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆరు జిల్లాలు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి పార్లమెంటు జిల్లాల నుండి పెద్ద ఎత్తన ప్రజలు సభకు హాజరవుతారని వివరించారు. ప్రభుత్వ పథకాలు, పాలనపై పార్టీ కేడర్, ప్రజలకు వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ దిశానిర్ధేశం చేస్తారన్నారు. మార్చి 13, 14 తేదీలలో ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఏప్రిల్ రెండో వారం లో ఎన్నికలు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. సిద్ధం సభలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం పథకాలు గురించి సిద్ధం సభల్లో వివరిస్తున్నామన్నారు. గతంలో ఏ రాజకీయ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ చేయని విధంగా వైయస్ జగన్ ప్రభుత్వం పరిపాలన చేసిందన్నారు. ప్రజల స్పందన చూస్తే 175 కి 175 సీట్లు వస్తాయనే నమ్మకం తమకు ఉందన్నారు. మేధరమెట్ల సిద్ధం సభలో 3 గంటలకు వైయస్ జగన్ ప్రసంగం మొదలవుతుందన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై కసరత్తు జరుగుతోందని, అతి త్వరలో విడుదల చేస్తామన్నారు. సిద్ధం సభలోపే అన్ని సీట్లు ప్రకటించడం జరుగుతుందన్నారు. ఎంతమంది ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. ప్రజలంతా ముఖ్యమంత్రి వైయస్ జగన్ వెంటే ఉన్నారన్నారు.