ఎన్టీఆర్‌నే కాదు, ములాయంను పరోక్షంగా దెబ్బదీసిన చంద్రబాబు

తాడేప‌ల్లి: పిల్ల‌నిచ్చిన మామ ఎన్టీఆర్‌నే కాదు, స‌మాజ్ వాదీ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ఉత్త‌రప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి ములాయం సింగ్ యాద‌వ్‌ను కూడా ప‌రోక్షంగా దెబ్బ‌తీసిన వ్య‌క్తి చంద్ర‌బాబు అని ఓ ఇంగ్లిష్ న్యూస్ వెబ్‌సైట్ వెల్ల‌డించింద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు ఒక స్టోరీని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విడుద‌ల చేశారు.

`సమాజ్‌వాదీ పార్టీ స్థాపకుడు, ఉత్తర్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ కన్నుమూసిన రోజున ప్రసిద్ధ ఆంగ్ల పాత్రికేయుడు ఒకరు 1996–97 నాటి యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాల ఏర్పాటు గురించి తన వ్యాసంలో ప్రస్తావించారు. కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో ఏర్పడిన యూఎఫ్‌ సర్కారు ప్రధానిగా ములాయం అయ్యే అవకాశం వచ్చింది. న్యూఢిల్లీలో ఫ్రంట్‌ సర్కార్ల ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన అప్పటి సీపీఎం ప్రధాన కార్యదర్శి హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ మాత్రం ములాయంకే ప్రధాని పదవి అప్పగించాలని చూశారు. కాని, పరిస్థితులు ‘నేతాజీ’ ములాయంకు వ్యతిరేకంగా మారాయి. నాటి యూఎఫ్‌ రాజకీయ మంతనాల్లో సుర్జీత్‌ సహాయకుడిగా వ్యవహరించిన ఎన్‌.చంద్రబాబు నాయుడు– ప్రధాని ఎంపికలో ములాయం అవకాశాలను దెబ్బదీసిన నాటి జనతాదళ్‌ నేతలు శరద్‌ యాదవ్, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రయత్నాలను ‘సమన్వయం’ చేశారట. ఈ విషయం సుర్జీత్‌ స్వయంగా పైన చెప్పిన ఓ ఇంగ్లిష్‌ న్యూస్‌ వెబ్సైట్‌ ఎడిటర్‌ చేసిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 1990ల్లో యూఎఫ్, ఎన్డీఏ ప్రభుత్వాల ఏర్పాటులో హస్తినలో ‘చక్రం’ తిప్పానని తరచు చెప్పుకునే చంద్రబాబు గారు ఏ ఒక్క నాయకుడు ప్రధాని కావడానికి తోడ్పడింది లేదు. 1996, 97లో ములాయం ప్రధాని కాకుండా అడ్డుపడిన నేతలకు మాత్రమే ఆయన సహాయకుడిగా వ్యవహరించారని ఈ సీనియర్‌ జర్నలిస్టు కథనం బట్టి తెలుస్తోంది. అలాంటి చంద్రబాబు గారు మంగళవారం ములాయం అంత్యక్రియలకు సైఫయీ వెళ్లడం ఆయనకు జాతీయ రాజకీయాలపై కొత్తగా ఏర్పడుతున్న ‘ఆసక్తి’కి అద్దంపడుతోంది.

‘ఎన్టీఆర్‌ కాళ్లుపట్టుకుని బతిమాలిన’ తర్వాత మామ ‘కుర్చీ’ గుంజేశారు చంద్రబాబు!

‘ఎన్టీఆర్‌ గారిని కాళ్లు పట్టుకుని అడుక్కున్నా నా మాట వినండని..! కాని ఆయన వినలేదు,’ అని చంద్రబాబు ‘అన్‌స్టాపబుల్‌’ అనే టీవీ టాక్‌ షోలో పాల్గొంటూ వెల్లడించారని ఈ ప్రోగ్రాం ప్రోమో ద్వారా వీక్షకులకు తెలిసింది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మామ గారు ఆయన మంత్రివర్గంలోని ఆర్థిక, రెవెన్యూ మంత్రి , మూడో అల్లుడు చంద్రబాబు అంతగా బతిమాలుకున్నా వినకపోతే, వెన్నుపోటుతో సీఎం కుర్చీ లాగేయడం ఎలా సబబు అవుతుంది. కాళ్లుపట్టుకుని బతిమాలిన తర్వాత కూడా ఈ మహానేత వినకపోతే–వేచిచూడాలే గాని పదవిని గుంజేసుకోవడం అప్రజాస్వామికం కాదా? 1995 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పరిణామాలపై 27 సంవత్సరాల తర్వాతైనా చంద్రబాబు గారు విచారం వ్యక్తం చేయడం లేదు. తన అధినాయకుడు ఎన్టీఆర్‌ వ్యవహార శైలి నచ్చకపోతే వ్యతిరేకించడంలో తప్పులేదు గాని ఆయనను పదవీచ్యుతుడిని చేయడం ఎప్పటికీ సమర్ధించుకోలేని రాజకీయ తప్పిదమే. తన వియ్యంకుడుతో కలసి పాల్గొన్న ఈ టాక్‌ షో కార్యక్రమంలో చంద్రబాబు పూర్తిగా మనసు విప్పుతారో, లేదో చూడాలి మరి.

తాజా వీడియోలు

Back to Top