రాష్ట్ర హక్కుల సాధనకు రాజీపడే ప్రసక్తే లేదు

వైయస్‌ఆర్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి

పోలవరం పెండింగ్‌ నిధుల అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తాం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం పోరాడుతాం

800 అడుగుల్లోనే లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు అనుమతించాల్సిందిగా కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తాం

తెలంగాణ నుంచి రావాల్సిన రూ.6,112 కోట్ల విద్యుత్‌బకాయిలపై ప్రస్తావిస్తాం

దిశ చట్టాన్ని ఆమోదించాల్సిందిగా కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తాం

విభజన చట్టంలోని అంశాల అమలుకు కేంద్రాన్ని నిలదీస్తాం

సీఎం వైయస్‌ జగన్‌ అధ్యక్షతన వైయస్‌ఆర్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ

తాడేపల్లి: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విధివిధానాలు, వివిధ అంశాలపై అనుసరించాల్సిన విధానంపై పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారని వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై ఎంపీలతో సీఎం వైయస్‌ జగన్‌ చర్చించారన్నారు. పోలవరం, విశాఖ స్టీల్‌ ప్లాంట్, రాయలసీమ ఎత్తిపోతల పథకం, తెలంగాణతో జల వివాదం, ఆహార భద్రత చట్టంలోని అసమానతలు, రేషన్‌ బియ్యం బకాయిలు, దిశ చట్టం, ట్రైబల్‌ యూనివర్సిటీ తదితర అంశాలపై పార్లమెంట్‌లో అనుసరించాల్సిన విధానంపై సీఎం వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఎంపీ విజయసాయిరెడ్డి ఏం మాట్లాడారంటే.. 
పోలవరం విషయంలో ప్రాజెక్టుకు సంబంధించి రూ.55,656 కోట్ల సవరించిన అంచనా వ్యయం గురించి పార్లమెంట్‌లో ప్రస్తావించడం జరుగుతుంది. 29 నెలలుగా ఈ అంశం పెండింగ్‌లో ఉంది. గతంలో ఏ ప్రాజెక్టునైనా జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్‌ చేసినట్లయితే ఖర్చు అంతా కేంద్రం నేరుగా భరించే పరిస్థితులు ఉండేవి. కానీ, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన తరువాత కేంద్రం రీయింబర్స్‌ చేసే విధానాన్ని చూస్తున్నాం. మిగతా ప్రాజెక్టుల విషయాల్లో ఇటువంటి విధానం ఎక్కడా లేదు. ఆర్‌ అండ్‌ ఆర్‌కు సంబంధించి రూ.33 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా విడుదల కాలేదు. 

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని, మంత్రులను రిక్వస్ట్‌ చేయడం జరిగింది. ఎత్తిపోతల పథకం కింద ఒక్క ఎకరం కూడా అదనంగా ఆయకట్టు లేదు. ఒక్క నీటి చుక్కను కూడా అదనంగా తరలించడం లేదు. శ్రీశైలంలో 881 అడుగులు ఉంటేనే.. పోతిరెడ్డిపాడు నుంచి 40 వేల క్యూసెక్కుల నీటిని తరలించడానికి వీలుంటుంది కాబట్టి.. గత రెండేళ్లు తప్ప మిగతా 20 ఏళ్లలో సరాసరి ఏడాదికి 25 రోజులకు మించి ఎప్పుడూ 881 అడుగు రాలేదని గుర్తుపెట్టుకొని, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని 800 అడుగుల్లోనే ఎత్తిపోతల పథకానికి అనుమతించాల్సిందిగా కేంద్రాన్ని కోరడం జరిగింది. 

తెలంగాణలో అన్ని లిఫ్ట్‌లు కూడా 800 అడుగులలోపే నీటిని తీసుకెళ్లే పరిస్థితి. చంద్రబాబు హయాంలో తెలంగాణలో 5 ప్రాజెక్టులు కట్టారు. 50 టీఎంసీ నీటిని నిల్వ చేసేలా రిజర్వాయర్లను చట్టాన్ని భిన్నంగా ఏర్పాటు చేశారు. పాలమూరు రంగారెడ్డి, దిండి, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ విస్తరిస్తున్నారు. ఇవన్నీ 800 అడుగులలోపే ఉన్నాయి. 796 అడుగుల దగ్గరే విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో 881 అడుగుల నీటిమట్టం లేదు కాబట్టి.. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 800 అడుగుల్లోనే ఎత్తిపోతల పథకానికి అనుమతించాల్సిందిగా కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది. 

మన వాటా నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకెళ్లాలని ఆలోచన. ఉమ్మడి ఆంధ్రరాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాలకు నీటిని కేటాయించారు. అప్పట్లో రాయలసీమకు 144.7 టీఎంసీ, కోస్తాంధ్రకు 367.34 టీఎంసీ, తెలంగాణ 298.96 టీఎంసీలు కేటాయించారు. దీనికి సంబంధించి 2015లో తెలంగాణ – ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఒప్పందం మీద సంతకాలు చేశారు. దీనికి పూర్తిగా భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీని గురించి సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. 

నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింత ప్రాజెక్టులను కేంద్ర పరిధిలోకి తీసుకోవాలి. కేఆర్‌ఎంబీని నోటిఫై చేసి.. సీఐఎస్‌ఎఫ్‌ భద్రత దళాలను పెట్టాలని కేంద్రానికి నివేదించాం. ఇవన్నీ రాబోయే వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావిస్తాం. వంశధార ప్రాజెక్టుకు సంబంధించి ట్రిబ్యునల్‌లో ఏపీకి అనుకూలంగా జడ్జిమెంట్‌ వచ్చింది దాన్ని నోటిఫై చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రస్తావిస్తాం. 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీనికి సంబంధించి మూడు ఆప్షన్లను ఇవ్వడం జరిగింది. నష్టాల్లో ఉన్న ప్లాంట్‌ను లాభాల్లోకి తీసుకురావాలంటే.. క్యాపిటీవ్‌ మైన్స్‌ కేటాయించాలి. రూ.14 వేల కోట్ల రుణాన్ని ఈక్విటీ కింద పరిగణిస్తే వడ్డీభారం తగ్గుతుంది. నష్టాల్లోంచి లాభాల్లోకి వస్తుంది. దీన్ని ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రైవేటీకరణకు చేసేబదులుగా స్టీల్‌ప్లాంట్‌ను ఇండిపెండెంట్‌ సంస్థగా నడిపించలేకపోతే.. స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్, ఎన్‌ఎండీసీలో కలిపితే బాగుంటుందని నొక్కివక్కానించి కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. పార్లమెంట్‌ సమావేశాల్లో గళం వినిపిస్తాం. 

2014–17 వరకు చంద్రబాబు టైమ్‌లో మన రాష్ట్రం నుంచి విద్యుత్‌ను తెలంగాణకు సరఫరా చేయడం జరిగింది. దాని విలువ రూ.6,112 కోట్లు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదు. ఈ విషయాలను కూడా ప్రస్తావించడం జరుగుతుంది. గతంలో ఏదైనా రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తితే కేంద్రం జోక్యం చేసుకొని పరిష్కరించిన సందర్భాలు ఉన్నాయి. హిమాచల్‌ ప్రదేశ్, హర్యానా, వెస్ట్‌బెంగాల్, జార్ఖండ్‌ మధ్య వివాదాలు తలెత్తినప్పుడు కేంద్రం జోక్యం చేసుకుంది. 

రూ.6,112 కోట్లు తెలంగాణ ఇవ్వకపోతే.. కేంద్రం నుంచి డెవల్యూషన్‌లో తెలంగాణకు వెళ్లాలో.. ఆ డెవల్యూషన్‌ నుంచి మినహాయించి ఏపీకి ఇచ్చే అధికారం కేంద్రానికి ఉంటుంది. దాన్ని పరిశీలించాలని కోరడం జరుగుతుంది. 

రాష్ట్రం విడిపోయినపపుడు ఆహార భద్రత చట్టంలో కొన్ని అసమానతల వల్ల ఏపీకి రేషన్‌ కార్డులను తక్కువగా ఇవ్వడం జరిగింది. కేంద్రం ఆమోదించిన రేషన్‌ కార్డుల మేరకే సబ్సిడీ ఇస్తుంది. మిగతాదంతా కూడా రాష్ట్రమే భరిస్తుంది. ఈ విషయంలో సీఎం వైయస్‌ జగన్‌ ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్రమంత్రి గోయల్‌ను కలిసి వివరించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి అన్యాయం జరుగుతుంది. కర్ణాటక రూరల్‌ ఏరియాలో 76 శాతం, గుజరాత్‌లో 76 శాతం, మహారాష్ట్రలో 76 శాతం, ఏపీలో మాత్రం 60 శాతం మంది మాత్రమే కవర్‌ అవుతున్నారు. మిగత 40 శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. తీవ్ర అసమానతలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రస్తావిస్తాం. 

రేషన్‌ బియ్యానికి సంబంధించి రూ.5,056 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. రాష్ట్రానికి రావాల్సిన బకాయిల సొమ్మును చెల్లించాల్సిందిగా పార్లమెంట్‌లో కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తాం.

దిశ చట్టం చాలాకాలంగా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. దాన్ని కూడా క్లియర్‌ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. 

రాష్ట్రంలో 17 వేల లేఅవుట్లలో భారీగా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఈ లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ.. తగిన సాయం అందించాల్సిందిగా కోరతాం. 

ఉపాధి హామీ కింద రూ.6,750 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంది. వీటిపై దృష్టిపెట్టి.. రాష్ట్రానికి తక్షణం విడుదల చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరతాం. 

ఏపీ రీ ఆర్గనైజేషన్‌ యాక్ట్‌ కింద రాష్ట్రానికి ట్రైబల్‌ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. దానికి భూమిని గతంలో నాన్‌ట్రైబల్‌ ఏరియాలో కేటాయించారు. యూనివర్సిటీ గిరిజన ప్రాంతాల్లో ఉండాలనే ఉద్దేశంతో ఎస్‌.కోట నియోజకవర్గం నుంచి సాలూరు నియోజకవర్గానికి తరలించి.. అక్కడ భూమిని ఈ ప్రభుత్వం కేటాయించింది. దాన్ని ఆమోదించి వెంటనే యూనివర్సిటీ స్థాపించాల్సిందిగా కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. 

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టానికి సంబంధించి ఇచ్చిన హామీలను ప్రస్తావించి.. అమలు చేయని హామీలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి.. అమలు జరిగేలా చేయాలని నిర్ణయించడం జరిగింది. 

కోవిడ్‌ సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ఏయే చర్యలు తీసుకుంది. దేశంలోనే అత్యుత్తమ సేవలు ఎలా అందించింది. అతి స్వల్ప మరణాలు నమోదైన 2 రాష్ట్రంగా ఏపీ ఉందని ప్రస్తావిస్తాం. 12 సార్లు డోర్‌ టు డోర్‌ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. కుటుంబంలో అనారోగ్య సూచనలు ఉంటే అందరికీ ఉచితంగా టెస్టులు చేసింది. ఇదేకాకుండా మొత్తం మీద కరోనాను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువచ్చి.. ఉచిత వైద్యం అందించి దేశంలోనే మొదటిరాష్ట్రంగా నిర్ధారించుకుంది. 

28 పీఏసీ ప్లాంట్‌లు ఇస్తే.. మనం 134 చోట్ల రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరుగుతుంది. ఇవేకాకుండా క్రయోజనిక్‌ ట్యాంకర్లను కొనుగోలు చేశాం. మొదటి వేవ్‌లో ఆంధ్రరాష్ట్రం సుమారు రూ.20 వేల కోట్ల ఆదాయాన్ని నష్టపోవడమే కాకుండా.. కోవిడ్‌ కట్టడికి రూ.7 వేల కోట్లు ఖర్చు చేసింది. మూడో వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నెలకు రూ.400 కోట్లు రేషన్‌ ఉచిత పంపిణీకి ఖర్చు చేస్తోంది. 

కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రం వాటా 42 శాతం, ఆ డెవల్యూషన్‌ ఫండ్స్‌ ఏటేటా తగ్గుతూ వస్తున్నాయి. ఎందుకు తగ్గుతున్నాయి..? కేంద్రం ఎందుకు సక్రమంగా అమలు చేయడం లేదని కులంకశంగా విశ్లేషణ చేసి.. దాన్ని కేంద్రానికి డిమాండ్‌ చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ వాస్తవాలన్నింటినీ పార్లమెంట్‌ ముందుపెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని చర్చించుకోవడం జరిగింది. మిగతా ఏదైనా విషయాలు ఉంటే.. ప్రతిరోజూ పార్లమెంట్‌లో 10:30 గంటలకు పార్టీ ఎంపీలమంతా సమావేశమై.. ఆ రోజు పార్లమెంట్‌లో ఎలా, ఏయే అంశాలు ప్రస్తావించాలో చర్చిస్తాం’ అని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు.
 

Back to Top