న్యూఢిల్లీ: ఏపీలో న్యాయ వ్యవస్థ నిష్పాక్షపాతంగా వ్యవహరించడం లేదని, ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత, పక్షపాతంతో ఉందని, ఈ ధోరణి వెంటనే మానుకోవాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ‘న్యాయ వ్యవస్థ కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులు న్యాయపరంగా అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. హైకోర్టు అసాధారణంగా వ్యవహరిస్తోంది.
మీడియా, సోషల్ మీడియాపై ఏపీ హైకోర్టు నిషేధం విధించింది. మాజీ అడ్వకేట్ జనరల్‌పై ఎఫ్‌ఐఆర్‌ను రిపోర్టు చేయవద్దని నిషేధం విధించింది. ఈ చర్యలను సమర్థించుకునే ఏ ఆధారమూ లేదు. ఈ రకమైన సెన్సార్షిప్ అసాధారణమైంది. బ్రిటీష్ తరహాలో వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించిన మరో కేసుపైనా స్టే విధించారు. గత ప్రభుత్వ హయాంలో తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఇలా వ్యవహరిస్తున్నారు. మీడియా కవరేజ్, పబ్లిక్ స్క్రూటినీ లేకుండా తప్పించుకోవాలని చూస్తున్నారు. జ్యుడీషియల్ నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరోనా నియంత్రణలో ముందుంది’ అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
అదే విధంగా కోవిడ్ కారణంగా ప్రజా రవాణా ఇంకా పూర్తిగా అందుబాటులోకి రానందున ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని హైదరాబాద్ - విశాఖ, హైదరాబాద్-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడపవలసిందిగా రైల్వే మంత్రిని విజ్ఞప్తి చేశారు.