కుప్పం: ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. కుప్పం మున్సిపాలిటీ 14వ వార్డు అభ్యర్థి నామినేషన్ విత్‌డ్రా చేసుకోవడంతో ఆ వార్డు ఏకగ్రీవమైందని ప్రకటించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్‌వో)పై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేశారని ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు. బయట నుంచి వచ్చిన (కుప్పంతో సంబంధం లేని) తెలుగుదేశం పార్టీ నేతలు ఆర్‌వోగా ఉన్న దళితుడిపైకి మూకుమ్మడిగా వెళ్లి దాడి చేయడమే కాకుండా.. ఆఫీస్ ధ్వంసం చేసి.. దుర్భాషలాడారన్నారు. కుప్పంలో ఎంపీ మిథున్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాడిపై ఆర్‌వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపడుతున్నామని, బయట నుంచి వచ్చిన నేతలు కుప్పంలో ప్రచారం చేయొద్దని పోలీసులు విన్నవించినా టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పట్టించుకోలేదన్నారు. కుప్పంతో సంబంధం లేని టీడీపీ నేతల్లో ముగ్గురు నలుగురిని పోలీసులు గౌరవంగా తీసుకెళ్లి వారి వారి ఇళ్లకు చేర్చారని, అయినా గోడ దూకి వచ్చి మరీ మమ్మల్ని అరెస్టు చేశారని పోలీసులపై, ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు. కుప్పంలో ఎవరినైనా అరెస్టు చేశారా..? కుప్పం ప్రజల స్వేచ్ఛకు ఎక్కడైనా ఆటంకాలు జరుగుతున్నాయా..? ప్రచారంలో భాగంగా వీధికి ఇద్దరు ముగ్గురుగా తిరుగుతున్న తెలుగుదేశం పార్టీ నేతలకు ఏమైనా ఇబ్బందులు జరిగాయా..? అని ప్రశ్నించారు. ఎక్కడి నుంచో వచ్చి రిటర్నింగ్ ఆఫీసర్‌పై దాడి చేసి.. ఆఫీస్ ధ్వంసం చేసిన వారిని కుప్పం వదిలివెళ్లమని చెబితే తప్పేంటీ..? అని నిలదీశారు. కుప్పంలో ఏదో జరిగిపోతుందనే తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం తప్పు అని, తప్పుడు ప్రచారాన్ని వైయస్‌ఆర్ సీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కుప్పం నియోజకవర్గంలో పోటాపోటీగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 85 శాతం పైగా వైయస్‌ఆర్ సీపీ గెలిచింది. దీన్నిబట్టి మున్సిపాలిటీ ఎన్నికల్లో రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రజల్లో సీఎం వైయస్ జగన్‌కు, ప్రభుత్వానికి అభిమానం ఉందని, కుప్పం నియోజకవర్గంలో వైయస్‌ఆర్ సీపీ విజయం ఖామన్నారు. ఎన్నికలు సజావుగా జరగాలని వైయస్‌ఆర్ సీపీ ప్రయత్నిస్తోందని, కానీ, ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు.