చంద్రబాబుకు కావాల్సిన స్టేట్‌.. రియలెస్టేట్‌

బాబు తాపత్రయమంతా బీనామీల భూముల కోసమే

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అమరావతిలో భూములిస్తే.. మురికికూపాలు మారిపోతుందని మాట్లాడలేదా..?

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను బాబు ఓట్లు అడగొద్దు

టూరిస్టులుగా ఏపీకి వస్తున్న చంద్రబాబు, లోకేశ్, పవన్‌

టీడీపీ పాదయాత్రలో శాంతిభద్రతలకు విఘాతం కలిగితే బాబుదే బాధ్యత

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్‌

తాడేపల్లి: చంద్రబాబు, లోకేశ్, దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి టూరిస్టులు అని ప్రజలంతా భావిస్తున్నారని, రాష్ట్రానికి వీరి అవసరం లేదని జరిగే ప్రతి ఎన్నికలోనూ ప్రజలు తగిన గుణపాఠం చెబుతున్నారని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. చంద్రబాబుకు కావాల్సిన స్టేట్‌.. రియలెస్టేట్‌ మాత్రమేనని, ఆ దందా కోసమే అమరావతి కొంపముంచాడన్నారు. అమరావతిలో చుట్టు ఉన్న బినామీల భూముల కోసం తపనపడుతున్నాడని ధ్వజమెత్తారు. బాబు సొంత నియోజకవర్గం కుప్పంలో డబ్బులిచ్చి జనాన్ని పోగుచేసుకుంటున్నాడంటే.. ఇంతకు మించి చంద్రబాబు పతనం గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు.   

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ నందిగం సురేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బద్వేల్‌లో బీజేపీకి సపోర్టుగా ఓట్లు వేయించి.. ఓటింగ్‌ పెరిగిందని చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చారని ఓటు వేశారా..? అని చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు ఏరకంగా ఆటంకం కలిగిస్తున్నాడో ప్రజలందరికీ తెలుసన్నారు. ఎన్నికలకు దూరం అంటూనే బీజేపీకి సపోర్టు పలికాడని, బానిసత్వం చేయడానికి అప్పుడప్పుడు దత్తపుత్రుడుని దింపుతాడని.. చంద్రబాబు బుద్ధి ఏంటో రాష్ట్ర ప్రజలకు తేటతెల్లమైందన్నారు. 
 
విహారయాత్రకు వచ్చినట్టుగా చంద్రబాబు, లోకేష్, దత్తపుత్రుడు పవన్‌ ఈ రాష్ట్రానికి వస్తున్నారని ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. చంద్రబాబు, పుత్రుడు లోకేష్, దత్తపుత్రుడు పవన్‌ ఇళ్లు హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు, పెంపుడు ఎంపీ, రామోజీరావు ఇళ్లు కూడా హైదరాబాద్‌లోనే ఉన్నాయని, వీరంతా కచ్చితంగా ఆంధ్రరాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులని ప్రజలంతా గమనించారన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. 2019 ఎన్నికల ముందే తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని అక్కడే ఉంటున్నారన్నారు. సీఎం ఓటు మాత్రమే పులివెందులలో ఉందని గుర్తుచేశారు. 

చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ఓట్లు హైదరాబాద్‌లో ఉన్నాయని, దత్తపుత్రుడు ఓటు కూడా హైదరాబాద్‌లోనే ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. బాబు కుటుంబ సభ్యుల ఓట్లు కూడా కుప్పంలో లేవన్నారు. కుప్పంలో కూడా ప్రజలు ఎదురుతిరిగే పరిస్థితి ఏర్పడింది కాబట్టి చంద్రబాబు వెన్నులో వణుకుపుట్టిందన్నారు. 

చంద్రబాబు ప్రజారాజధాని కోరుకున్న వ్యక్తి అయితే.. సెంటున్నర ఇళ్ల స్థలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైయస్‌ జగన్‌ ఇవ్వడానికి సిద్ధపడితే.. కోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చారు అని ఎంపీ నందిగం సురేష్‌ ప్రశ్నించారు. అమరావతి ప్రాంతంలో దళితులు, బలహీనవర్గాల ప్రజలు నివాసముంటే.. మురికికూపాలుగా మారి అభివృద్ధి ఆగిపోతుందని చంద్రబాబు మాట్లాడాడని మండిపడ్డారు. చంద్రబాబు భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఎవరినీ ఓటు అడగడని, తన చుట్టు ఉన్నవారిని మాత్రమే ఓటు అడుగుతాడని ఎద్దేవా చేశారు. తన బినామీ రాజధాని కోసం అందరినీ చిన్నచూపు చూసిన చంద్రబాబు రాష్ట్రానికి అవసరం లేదని ప్రజలు గట్టి తీర్పునిచ్చారన్నారు. బద్వేల్‌ ఫలితంతో చంద్రబాబు మైండ్‌ బ్లాంక్‌ అయ్యిందన్నారు. 

కర్నూలుకు న్యాయ రాజధాని వద్దు.. వైజాగ్‌కు పరిపాలన రాజధాని వద్దు అన్నీ అమరావతిలోనే ఉండాలని మాట్లాడే చంద్రబాబు పాదయాత్రను ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఏరకంగా స్వీకరిస్తారు. ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తులంతా పాదయాత్ర చేసి.. చంద్రబాబు చెప్పిన భాష వాడితే ఎక్కడైనా గొడవలు జరిగితే దానికి బాబు బాధ్యత వహించాలన్నారు. చంద్రబాబు ఒక్కడే అమరావతి రాజధాని కోరుకుంటున్నాడన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top