చంద్రబాబు కాల్‌ లిస్టు బయటపెట్టాలి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్ డిమాండ్‌

హైకోర్టు ఇచ్చే తీర్పు 10 నిమిషాల ముందే బాబుకు తెలుస్తుంది

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహరాన్ని సీబీఐకి అప్పగించడం మంచిదే

ఎవరిది తప్పో.. సుధాకర్‌ బాబు వెనక ఎవరున్నారో విచారణలో తేలిపోతుంది

వ్యవస్థలను మేనేజ్‌ చేసుకుంటూ తిరగడమే చంద్రబాబు పని

రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని టీడీపీ కుట్రచేస్తోంది

తాడేపల్లి: హైకోర్టు ఇచ్చే తీర్పు పది నిమిషాల ముందే చంద్రబాబుకు తెలుస్తుంది. మొదట చంద్రబాబును విచారించాలి. ఆయన కాల్‌ లిస్టు బయటపెట్టాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎంపీ నందిగం సురేష్‌ డిమాండ్‌ చేశారు. డాక్టర్‌ సుధాకర్‌ బాబు వెనుక ఏదో పెద్ద సపోర్టు ఉంది కాబట్టే ముఖ్యమంత్రి పట్ల అసభ్యకరంగా మాట్లాడాడని, దీని వెనుక కుట్ర కోణం దాగి ఉందన్నారు. సుధాకర్‌బాబు వ్యవహారాన్ని హైకోర్టు సీబీఐకి అప్పగించడం మంచిదేనని ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. లేదంటే వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం కాబట్టి వారికి ఇష్టం వచ్చినట్లుగా ఎఫ్‌ఐఆర్‌ రాసుకున్నారని టీడీపీ నాయకులు మాట్లాడే పరిస్థితి లేకపోలేదన్నారు. ఎవరి తప్పు ఏంటో సీబీఐ విచారణలో బయటకు వస్తాయన్నారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ నందిగం సురేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `ఈ రోజున పది మంది టీడీపీ దళిత నేతలు పరిగెత్తుకొచ్చి దళితుల ఆత్మగౌరవం దెబ్బతిన్నది అని మాట్లాడుతున్నారు. వెనక్కు తిరిగి చూస్తే.. చంద్రబాబు దళితులపై ఏం మాట్లాడారో.. వారికే అర్థం అవుతుంది. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు.. దళితులు చదువుకోరని, శుభ్రంగా ఉండరని మరికొంతమంది టీడీపీ వారే మాట్లాడారు. ఇవన్నీ మర్చిపోయి దళితుల ఆత్మగౌరవం దెబ్బతిన్నదని టీడీపీలోని దళితులే మాట్లాడడం విడ్డూరంగా ఉంది. 

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబే.. ఎన్టీఆర్‌ ఫొటోకు దండ వేసినట్లుగా.. దళితులను అవమానించే టీడీపీ పార్టీనే ఆ పార్టీలోని దళితులు వెనకేసుకురావడం నిజంగా విడ్డూరం. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు దళితులకు ఏం చేశాడో కూడా చెప్పుకోవడానికి ఒక్క కార్యక్రమం లేదు. 

చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేసుకుంటూ తిరుగుతున్నాడు. హైకోర్టును మేనేజ్‌ చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఈ రోజున తీర్పు వస్తే ప్రభుత్వానికి చెంపపెట్టు అంటున్నాడు. ఎంతసేపు మేనేజ్‌మెంట్లతోనే ఒడ్డుఎక్కే చంద్రబాబు 26 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు. 

సుధాకర్‌ బాబు ముఖం మీద దళితుడు, డాక్టర్‌ అని రాసి ఉండదు. నన్ను విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద పోలీసులు ఆపితే పార్లమెంట్‌ కార్డు చూపించి వెళ్లాను. డాక్టర్‌ సుధాకర్‌కు ఏదో అన్యాయం జరిగిపోయిందని చంద్రబాబు అంటున్నారు.. వాస్తవానికి అక్కడ పోలీసుల ఓపికకు దండం పెట్టాలి. శాడిస్టులా భూతులు మాట్లాడుతూ, కార్ల కింద చొరబడుతూ ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తికి చంద్రబాబు సపోర్టు చేస్తున్నాడు. సుధాకర్‌బాబును అడ్డంపెట్టుకొని ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నాడు

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంపై హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. పేదవాడు ఇంగ్లిష్‌ చదువుకొని బాగుపడతాడని సీఎం వైయస్‌ జగన్‌ అనుకుంటే.. పేదవాడి చదువులోనూ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చిన వ్యక్తి చంద్రబాబు. ఇలాంటి వ్యక్తులను చూసి నవ్వాలో.. బాధపడాలో అర్థం కాని పరిస్థితి. 

స్కూల్‌ బిల్డింగ్‌లకు కలర్ల విషయంలో కూడా హైకోర్టుకు వెళ్తున్నట్లున్నారు. స్కూల్‌ బిల్డింగ్‌లకు మా పార్టీ రంగులు వేయడం లేదు. మట్టిరంగు, నీళ్ల రంగు మాదే అని అంటగట్టే పరిస్థితిలోకి ప్రతిపక్షం వెళ్లిపోయింది. చంద్రబాబు అధికారంలో ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో స్కూల్‌ బిల్డింగ్‌ల కలర్‌పై ఒక ఫిటిషన్‌ వేస్తే.. సహజంగా గవర్నమెంట్‌ ఉందికదా.. వేసుకుంటే తప్పేముందిలే అని కోర్టు తీర్పు ఇచ్చింది. 

ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని తెలుగుదేశం పార్టీ రకరకాల కుయుక్తులు పన్నుతోంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్న చంద్రబాబు.. పరిపాలన కుంటుపడే విధంగా తీర్పులు తేవాలని తయారయ్యాడు. ప్రజలు ఓడించి ఇంటికి పంపించినా చంద్రబాబుకు ఇంకా బుద్ధిరాలేదు. ఇప్పడైనా 23 సీట్లు వచ్చాయి.. వచ్చే ఎన్నికల్లో సింగిల్‌ డిజిట్‌కే టీడీపీ పరిమితమవ్వడం ఖాయం’ అని ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top