ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం నిధులను తక్షణమే విడుదల చేయాలి

లోక్‌స‌భ‌లో ఎంపీ మిథున్‌రెడ్డి

న్యూఢిల్లీ: లోక్‌సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, పోలవరం నిధులను తక్షణమే విడుదల చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు సకాలంలో కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. జాతీయ ప్రాజెక్టులా దాన్ని ముందుకు తీసుకువెళ్లడం లేదు. భూ సేకరణ చట్టం వల్ల అంచనా వ్యయం పెరిగింది. 55,548 కోట్ల రూపాయల సవరించిన అంచనా వేయానికి కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం తెలిపింది.

కానీ ఇప్పటివరకు కేంద్ర ఆర్థిక శాఖ దీనిపై ఆమోదం తెలపకుండా పెండింగ్‌లో ఉంచింది. ఇరిగేషన్ కాంపోనెంట్, డ్రింకింగ్ కాంపోనెంట్ అనే పేరుతో ప్రాజెక్టు నిధులకు కత్తెర పెడుతున్నారు. దేశంలో ఏ జాతీయ ప్రాజెక్టుకు లేని కొత్త కొత్త షరతులు పెట్టి నిధులను తగ్గిస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని వెంటనే తొలగించాలి. భూసేకరణ చట్టం కింద నష్టపరిహారాన్ని నేరుగా రైతులు ఖాతాల్లో వేయాలి. జాతీయ ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మిస్ హ్యాండిల్ చేస్తుంది. 

విభజన వల్ల ఏపీకి తీవ్ర నష్టం​
తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను వెంటనే ఇప్పించాలి. జాతీయ ఆహార భద్రత చట్టం కింద లబ్ధిదారుల సంఖ్యను పెంచాలి. గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం, పట్టణ ప్రాంతాల్లో 40 శాతం మంది ప్రజలకి ఇవ్వడం పక్షపాతం చూపడమే. దీని కారణంగా 56 లక్షల మంది లబ్ధిదారులు నష్టపోతున్నారు. విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది. విభజన వల్ల ఏపీ తలసరి ఆదాయం 8,979కి తగ్గిపోయింది. ఏపీకి 56% జనాభా వస్తే 45% ఆదాయం మాత్రమే దక్కింది. 60% అప్పులు మాపై మోపారు. ఈ నష్టం కారణంగానే మాకు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధానమంత్రి చెప్పారు. మంత్రివర్గంలో దీన్ని పాస్ చేసిన ఇప్పటివరకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. వందలసార్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో అడిగిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు.

 
ఆర్థిక మంత్రికి ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్‌లో అదనంగా 12 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలి. 4800 మెగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును ఏపీలో ప్రారంభిస్తున్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి. ఒక ఏడాదిలో బొగ్గు దిగుమతి చేసుకునే నిధులతో వీటన్నిటిని పూర్తి చేయవచ్చు. నాడు నేడు కింద 55 వేల పాఠశాలలలో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నారు. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాం. వీటిని సందర్శించేందుకు ఆర్థిక మంత్రిని ఆహ్వానిస్తున్నాం.

గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడం సరైనది కాదు. కరోనా సమయంలో ఈ పథకం ప్రజలకు ఎంతో ఉపయోగపడింది. మూలధన పెట్టుబడి నిధులను విడుదల చేయకుండా లక్ష్యాలను ఎలా చేరుకుంటారు. ఏపీ రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ నిధులను విడుదల చేయాలి. సెస్, సర్ చార్జీల రూపంలో వసూలు చేస్తూ రాష్ట్రాల ఆదాయాలకు కేంద్రం గండి కొడుతుంది. రూ.17,920 కోట్ల రూపాయల అప్పులు అధికంగా టిడిపి, బిజెపి ప్రభుత్వం చేసింది. దీని కారణంగా నెట్ బారోయం సీలింగ్ విధించడం సరైనది కాదు అని ఎంపీ మిథున్‌రెడ్డి లోక్‌సభలో వ్యాఖ్యానించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top