ఢిల్లీ: రాజకీయ కక్షతోనే కూటమి ప్రభుత్వం తమపైన కేసులు పెడుతున్నారని, చంద్రబాబు పెట్టే కేసులకు భయపడే ప్రసక్తే లేదని వైయస్ఆర్‌సీపీ లోక్‌సభాపక్షనేత ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు. కేసులు పెడితే మేము మరింత బలంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష నేతల సమావేశంలో మిథున్ రెడ్డి పాల్గొన్నారు. అఖిలపక్ష భేటీలో పోలవరం ఎత్తు తగ్గింపు, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, డ్రగ్స్ సమస్య, మార్గదర్శి కుంభకోణంపై చర్చకు అవకాశం ఇవ్వాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. రుజువు లేదా క్షమాపణ: భూమి విలువ కూడా తెలియకుండా కథనాలు రాశారు. ఆ భూమి మొత్తం విలువే రూ.3 కోట్ల లోపు ఉంటుంది. మాపై తప్పుడు కథనాలకు పత్రికలో కేటాయించిన స్థానంలో యాడ్ ఇచ్చుకుంటే.. మా భూమి విలువ కన్నా ఎక్కువ రాబడి వచ్చేది. మాపై తప్పుడు కథనాలు రాసిన పత్రిక, ఆ ఆరోపణలు ఆధారాలతో సహా రుజువు చేయాలి. లేదా తప్పుడు కథనం రాసి నిందించినందుకు క్షమాపణలు చెప్పాలి. పార్లమెంటులో లేవనెత్తుతా: ఈనాడు పత్రిక మాపై తప్పుడు వార్తలు రాసి వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తోంది. నేను కచ్చితంగా ఈనాడు గ్రూపు అవినీతిపై పార్లమెంటులో మాట్లాడతాను. నేను ఫైనాన్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాను. ఆర్థిక మంత్రితో చర్చిస్తా. ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్తా. మార్గదర్శి కేసుల్లో పోరాడుతున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో కూడా మాట్లాడి ఆయనకు అన్నివిధాలా తోడ్పాటు అందిస్తా. కచ్చితంగా బదులిస్తాం: ఏం చేసినా పడుంటారని అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, నిరాధార ఆరోపణలు ఎన్ని చేసినా భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు. అన్నింటినీ థీటుగా ఎదుర్కొంటాం. ఎన్ని ఇబ్బందులు పెడితే, అంతకు రెట్టింపు ధైర్యంతో పోరాడతాం. అనవసర కేసులు పెట్టి వేధించాలని చూస్తే ఊర్కునేది లేదు. ఎల్లప్పూడూ మీరే అధికారంలో ఉంటారని అనుకోవడం అవివేకం. రేపు మా టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతిదానికీ బదులిస్తాం. మా కుటుంబంపై చంద్రబాబు టార్గెట్: మా నాన్న పేరు తలవందే చంద్రబాబుకి నిద్ర పట్టడం లేదు. రోజూ ఏదోక క్యారెక్టర్ సృష్టించడం, మాపై బురద జల్లడం పనిగా పెట్టుకున్నారు. ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం. మీరు అధికారంలో ఉన్నారు. మీ దగ్గర ఆధారాలుంటే రుజువు చేయాలి. కూటమి ప్రభుత్వం ఒక్క పెన్షన్ పెంపు మినహా, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అయినా అక్కడా అన్యాయమే చేస్తోంది. ఒకవైపు పెన్షన్ పెంచి, మరోవైపు లబ్ధిదార్లను దారుణంగా తగ్గించేస్తున్నారు. ఇప్పటికే 3 లక్షల పెన్షన్లు కట్ చేయగా, అదే స్థాయిలో ఇంకా తగ్గించాలని భావిస్తున్నారు. ఆ దిశలోనే దివ్యాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ అంటే ప్రహసనం చేస్తున్నారు. విద్య, వైద్యాన్ని బాధ్యతగా తీసుకోవాల్సిన ప్రభుత్వం.. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను, ప్రజలను వేధిస్తోంది. పరిస్ధితులు ఇలాగే కొనసాగితే కూటమి నాయకులు ప్రజల్లో తిరిగే అవకాశమే ఉండదు. రాజ్యసభలో పార్టీ ఫ్లోర్‌లీడర్‌గా..: మూడు తరాలుగా వైఎస్సార్ కుటుంబంతో విజయసాయిరెడ్డికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దివంగత వైఎస్ రాజారెడ్డి, రాజశేఖర్‌రెడ్డితో పాటు, జగన్‌తో కూడా పని చేసిన అనుభవం ఆయనది. అందుకే విజయసాయిరెడ్డిగారు తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తిరిగి పార్టీలోకి వస్తారని, పార్టీ గెలుపు కోసం పని చేస్తారని ఆశిస్తున్నాం. విజయసాయిరెడ్డిగారు పార్టీని వీడడంలో కుట్ర ఉందని నేను అనుకోవడం లేదు. రాజకీయాల నుంచి వైదొలగడం తన వ్యక్తిగత నిర్ణయం అని ఆయనే స్వయంగా చెప్పారు. ఇప్పుడు ఆయన స్థానంలో రాజ్యసభలో పార్టీ ఫ్లోర్‌లీడర్‌గా సీనియర్ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను నియమించడం జరిగింది.