తెలుగువారై ఉండి ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటారా..?

అజెండా నుంచి హోదా తొల‌గింపున‌కు బీజేపీ ఎంపీ జీవీఎల్ కార‌ణం

ప్ర‌త్యేక హోదా అంశాన్ని త్రిస‌భ్య క‌మిటీ అజెండాలో చేర్చాలి

వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ మార్గాని భ‌ర‌త్‌రామ్ డిమాండ్‌

తూర్పుగోదావరి: తెలుగువారై ఉండి ఆంధ్ర‌రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, కేంద్ర హోంశాఖ అజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించడానికి బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు కారణమని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ ధ్వజమెత్తారు. కేంద్ర హోంశాఖ త్రిస‌భ్య క‌మిటీ అజెండాలో ప్రత్యేకహోదా అంశాన్ని చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చెప్పారని గుర్తుచేశారు. ఎంపీ మార్గాని భ‌ర‌త్‌రామ్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై వైయ‌స్ఆర్ సీపీ ఎంపీలంద‌రం అనేకసార్లు పార్లమెంటులో మాట్లాడామని, హోదా, రాష్ట్ర విభ‌జ‌న హామీల అమ‌లుకు కృషిచేస్తున్నామ‌న్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.2,100 కోట్లు రీయింబర్స్ చేయాల్సి ఉంద‌న్నారు. ఏపీలో నూత‌న జాతీయ రహదార్లు నిర్మిస్తున్న కేంద్రానికి ఎంపీ మార్గ‌ని భ‌ర‌త్‌రామ్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

Back to Top