ఆ నలుగురిని సీబీఐ ఎందుకు విచారించదు..?

టీడీపీ, ఎల్లో మీడియా పక్కా ప్లాన్డ్‌గా సీఎం వైయ‌స్ జగన్‌పై కుట్రలు

వైయ‌స్‌ వివేకానందరెడ్డి హత్యను అడ్డుపెట్టుకుని కుట్ర‌ రాజకీయం

రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు

ఆరోజు వైయ‌స్ వివేకా వ్యక్తిత్వ హననం చేసిన ఎల్లోమీడియా.. నేడు క‌ప‌ట ప్రేమ ఒల‌క‌బోస్తోంది

జూ.ఎన్టీఆర్‌ను ఏ విధంగా వాడుకుని వ‌దిలేశారో రాష్ట్ర ప్రజలంతా చూశారు

ఆఖరికి భార్యను కూడా రాజకీయ వివాదాల్లోకి తీసుకొచ్చిన చరిత్ర బాబుదే

వాడకంలో ఎవరైనా చంద్ర‌బాబు తర్వాతే..

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ రామ్ ధ్వ‌జం

రాజ‌మండ్రి: వైయ‌స్ వివేకానందరెడ్డి హత్య కేసులో మొదట ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డి పేరుని తీసుకువ‌చ్చి, ఆ తర్వాత ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌పై నింద మోపే కార్యక్రమాన్ని టీడీపీ, ఎల్లో మీడియా కలిసికట్టుగా, పక్కా ప్లాన్డ్‌గా చేస్తుంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ రామ్ ధ్వ‌జ‌మెత్తారు. టీడీపీ ఆఫీసులో తయారైన స్క్రిప్టును, ఆ పార్టీకి వంత పాడే ఎల్లో మీడియాలో ముందుగా పూటకో కథనంగా వండివార్చి, ఆ తర్వాత అదే స్క్రిప్టును పట్టుకుని టీడీపీ నాయకులంతా ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి చదువుతున్నారని మండిప‌డ్డారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌పై నిందలు మోపే విధంగా ఒక పథకం ప్రకారం టీడీపీ, ఎల్లో మీడియా కుట్రలు పన్నుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాజ‌మండ్రిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో ఎంపీ మార్గాని భ‌ర‌త్‌రామ్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.  

ఎంపీ మార్గాని భ‌ర‌త్ ఇంకా ఏం మాట్లాడారంటే..
టీడీపీ, ఎల్లో మీడియా హడావుడి చూస్తుంటే, అసలు హత్యకు గురైంది లోకేష్ బాబాయా.. లేక సీఎం వైయ‌స్‌ జగన్ బాబాయా..? అన్న అనుమానం కలిగేలా వారి కథనాలు, కుట్రలు నడుస్తున్నాయి. ఆరోజు  వైయ‌స్ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు, వీళ్ళే ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా కథనాలు రాశారు. ఈరోజు మళ్ళీ, వివేకా ఫ్యామిలీపై లేని ప్రేమను ఒలకబోస్తూ, వారికి అనుకూలంగా ఇప్పుడు కథనాలు రాస్తూ.. టీడీపీ ఆఫీసులో తయారైన స్క్రిప్టునే పట్టుకుని రెండు రోజులుగా చంద్రబాబు నుంచి లోకేష్ వరకు టీడీపీ నాయకులంతా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. 

విశాఖ ఎయిర్ పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిపై కత్తితో దాడి జరిగితే..  కోడి కత్తి అంటూ హేళనగా మాట్లాడారు. అదే కోడి కత్తి భుజానికి కాకుండా, మెడకు తెగితే..  ప్రాణాలకే ముప్పు ఉండేదని ఆరోజు ఎన్ఐఏ కూడా చెప్పింది. దానిపై నాడు అధికారంలో ఉన్న టీడీపీ ఏ రకంగా చిల్లర రాజకీయాలు చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా మరచిపోలేదు. 

ఆరోజు మీరు చేసిందేమిటి..? 
వైయ‌స్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీనే. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ హత్యలో అనుమానితులుగా ఉన్న ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, చంద్రబాబులను ఎందుకు సీబీఐ విచారించదు అని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు టీడీపీ నేతలు పనిగట్టుకుని డీజీపీని మార్చేశారు, సీఎస్‌ను మార్చేశారు అని ప్రచారం చేస్తున్నారు. అసలు వివేకా హత్య జరిగినప్పుడు ఉన్న ప్రభుత్వం టీడీపీది. అప్పుడు ఉన్న డీజీపీ ఆర్పీ ఠాకూర్ కాదా..? ఆరోజు మీరు చేసిందేమిటి..?  అప్పుడు మీ ప్రభుత్వం ఉంటే.. ఆరోజు కూడా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వైయ‌స్ జగన్‌పై నిందలు వేశారు. ఈరోజూ మళ్ళీ అదే పని చేస్తున్నారు, అంటే మీ కుట్రలేమిటో అర్థం కావడం లేదా..?

నీతివంతమైన రాజకీయాల గురించి బాబు మాట్లాడటమా..?
నీతివంతమైన రాజకీయాల గురించి చంద్రబాబు మాట్లాడితే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. మా పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను మీరు ఆనాడు తీసుకొని, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చింది వాస్తవం కాదా..? మీరా, నీతివంతమైన రాజకీయాలు గురించి మాట్లాడేది..?. మీరా సమర్థుడైన ముఖ్యమంత్రి పరిపాలన సాగిస్తున్న వైయ‌స్ జగన్‌పై బురదజల్లేది..?. వైయ‌స్ఆర్ మరణాననంతరం కూడా, కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై, కాంగ్రెస్ పార్టీకి డైరెక్టుగా, ఇన్ డైరెక్టుగా మద్దతు ఇచ్చి, రాష్ట్రాన్ని విడగొట్టే కార్యక్రమంలో మీరు భాగస్వాములు కాలేదా..? ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తో వేదిక పంచుకుని, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకి తూట్లు పొడిచింది మీరా.. మేమా.. ? రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు నాయుడు. 

వాడకంలో ఎవరైనా బాబు తర్వాతే..
వాడకంలో ఎవరైనా చంద్రబాబు తర్వాతే. మీ స్వార్థ రాజకీయాలకు మీరు ఏ ఒక్కరినీ వదలరు.  అక్క, బావ, మేనల్లుడు, తోడల్లుడు, వియ్యంకుడు, బామ్మర్థులు.. ఇలా చెప్పుకుంటూ బాబు వాడకం లిస్టు పెద్ద చాంతాడంత వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ను ఏ విధంగా వాడుకుని, ఎన్నికలు అయ్యాక కూరలో కరివేపాకులా ఎలా తీసేశారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. అందర్నీ రాజకీయాలకు వాడుకోవడం, ఆ తర్వాత వదిలేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఆరోజు బాలకృష్ణ కాల్పుల ఉదంతంలో.. ఒకవేళ మీరే ముఖ్యమంత్రిగా ఉంటే, ఆఖరికి, బంధుశేషం, రుణశేషం అనేది లేకూడదన్నట్టుగా మీరు బాలకృష్ణను ఏం చేసేవారో ప్రజలు ఊహించగలరు. 

వెన్నుపోటుకు కేరాఫ్ అడ్ర‌స్‌..చంద్ర‌బాబు
వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబే అని, అతనొక జామాతా దశమ గ్రహం అని, నీచుడని ఎన్టీఆర్  చెప్పిన మాటలను ప్రజలెవరూ మరిచిపోలేదు. ఇక చంద్రబాబు హత్యా రాజకీయాల గురించి కూడా పెద్ద పుస్తకమే ఉంది.  వంగవీటి రంగా నుంచి పింగళి దశథరామ్, మల్లెల బాబ్జీ.. ఉదంతాలను రాష్ట్ర  ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. ఒక కుట్రను అల్లి, పథకం ప్రకారం దాన్ని ప్రజల మెదళ్ళలోకి చొప్పించేందుకు ఎల్లో మీడియాలో పుంఖాను పుంఖాలుగా  కథనాలు రాయించడం, ఆ తర్వాత అదే స్క్రిప్టుతో టీడీపీ నేతల చేత ప్రెస్ మీట్లు పెట్టించి సీఎం వైయ‌స్ జగన్‌పై బురద జల్లే కార్యక్రమానికి టీడీపీ కంకణం కట్టుకుంది. 

సంక్షేమ ప‌థ‌కాలు చూసి క‌డుపుమంట‌..
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరీ, ఆ వర్గాలకే సంక్షేమ పథకాల్లో అగ్ర తాంబూలం వేస్తుంటే చంద్రబాబుకు కడుపు మండుతుంది. అలానే వైయ‌స్‌ జగన్  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి..  కులం, మతం, రాజకీయాలు, ప్రాంతాలు చూడకుండా పథకాలు అర్హులైన అందరికీ ఇస్తుంటే.. మీకు కడుపు మండుతుందా..? మహిళా ఓట్లు టీడీపీ నుంచి చెల్లాచెదురు అయిపోతున్నాయని, భార్యను అడ్డుపెట్టుకుని సింపథీ రాజకీయం చేసింది చంద్రబాబు కాదా..? 

భార్య‌పేరు చెప్పుకొని రాజ‌కీయాలు..
అక్కచెల్లెమ్మలకు దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా, ప్రతి సంక్షేమ పథకంలో వారిని భాగస్వామ్యం చేస్తూ ఇస్తుంటే.. మీ రాజకీయ పునాదులు కదిలిపోతున్నాయి., అందుకే మీ ఏడుపు రాజకీయం. ఆఖరికి భార్యను కూడా రాజకీయ వివాదాల్లోకి తీసుకొచ్చిన చరిత్ర చంద్రబాబుదే. భార్య పేరు చెప్పుకుని అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఏడవటం చంద్రబాబు ఛీప్ పాలిటిక్స్ కాక మరేమిటి..?  ఈరోజు వైయ‌స్‌ వివేకానందరెడ్డి హత్యను అడ్డు పెట్టుకుని మళ్ళీ రాజకీయం చేస్తున్నారు.

హైదరాబాద్‌లో చేసిన కుట్రే.. అమరావతిలోనూ 
అమరావతి రాజధాని పేరుతో, మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులతో  ఆ చుట్టుపక్కల వేల ఎకరాలు కొనిపించి.. ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడింది వాస్తవం కాదా.. అని చంద్ర‌బాబును ప్రశ్నిస్తున్నాం.  గతంలో హైదరాబాద్‌లో సైబరాబాద్ చుట్టూతా ఏ విధంగా అయితే చేశారో.. అమరావతిలోనూ అదే కుట్ర చేసింది నిజం  కాదా..? 

ఎందుకింత కుల దురఅహంకారం..
దేశంలోనే కనీవినీ ఎరగని విధంగా 31 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చి, ఇళ్ళు నిర్మిస్తుంటే.. అమరావతి సీఆర్డీఏ పరిధిలో కూడా పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే.. పేదలు అక్కడ ఉంటే,  డెమోగ్రాఫిక్ ఇం బ్యాలెన్స్ వస్తుందని మీ అనుకూల వ్యక్తుల చేత కోర్టుల్లో పిటిషన్లు వేసింది నిజం కాదా..? ఎందుకు మీకు ఇంత కుల దురఅహంకారం అని అడుగుతున్నాం. రాజమండ్రి పార్లమెంటులో బీసీలను ఎప్పుడైనా ఎంపీగా చేశారా.. ? మీ సామాజిక వర్గం వారినే ఇంతకాలం, రాజమండ్రికి ఇంపోర్ట్ చేసి మీరు రాజకీయాలు చేసింది వాస్తవం కాదా.. ? 2014-19 మధ్య మీరు అధికారంలో ఉండి, కేవలం టెంపరరీ షెడ్లు కట్టి పబ్బం గడిపారు. పోలవరం ప్రాజెక్టుకు సోమవారం అంటూ వేడుకకు వెళ్ళినట్టు వెళ్ళి వచ్చారే తప్పితే, పనులు పూర్తి చేయలేదు. పైగా, మీరేదో చేసినట్టు,  మీ డ్రామా ఆర్టిస్టుల చేత జయము జయము చంద్రన్నా.. అని తాళాలు వేయించుకున్నారు.

Back to Top