బ్యాంక్ రుణాల‌నే మాట‌ ఎందుకువ‌చ్చింది

చంద్ర‌బాబు పాల‌న‌లో మోసానికి గుర‌వ్వ‌ని వ‌ర్గం లేదు

2014లో పొత్తుల‌తో గెలిచి రాష్ట్రానికి చంద్ర‌బాబు ఏం చేశారు..?

వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ మార్గాని భ‌ర‌త్‌రామ్ ప్ర‌శ్న‌

తాడేపల్లి: యువత చదువుకోవడానికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని చంద్రబాబు అంటున్నారని, అస‌లు బ్యాంక్ లోన్ అనేప‌దం బాబు నోట ఎందుకు వ‌చ్చింద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భ‌ర‌త్‌రామ్ ప్ర‌శ్నించారు. అమ్మ ఒడి, విద్యాదీవెన వంటి పథకాలన్నీ రద్దు చేస్తారా? అని నిల‌దీశారు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలు ఎలా చదువుకోవాలి?. పిల్లల చదువులతో ప్రభుత్వానికి పనిలేదా? అని మండిపడ్డారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌య ఆవ‌ర‌ణ‌లో ఎంపీ మార్గాని భ‌ర‌త్‌రామ్ మీడియాతో మాట్లాడారు. బాబు వస్తేనే జాబు వస్తుందన అప్పట్లో ప్రచారం చేసి, చివరికి ఆయన కొడుకు నారా లోకేష్‌కు మాత్రమే పదవులు ఇచ్చుకున్నారని గుర్తుచేశారు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిరుద్యోగుల‌ను నిలువునా మోసం చేశాడ‌ని మండిప‌డ్డారు. ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే ప్రమాణస్వీకారం చేయనన్న చంద్ర‌బాబు, ప్రత్యేక హోదా ఇస్తేనే ప్రమాణస్వీకారం చేస్తానని ఎందుకు అనలేదని ఎంపీ భ‌ర‌త్ ప్ర‌శ్నించారు. 

చంద్రబాబు చేసిన ధర్మపోరాటాల దీక్షలు ఏం అయ్యాయి..? ఢిల్లీలో సభలు పెట్టి ఏం సాధించారు?. పాచిపోయిన లడ్డూలు అన్న పవన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని చంద్ర‌బాబు, బీజేపీతో కలిశారో చెప్పాల‌ని ఎంపీ భ‌ర‌త్ డిమాండ్ చేశారు. అసలు బ్యాంకు లోన్ అనే పదం చంద్రబాబు నోట ఎందుకు వచ్చింది? అని ప్ర‌శ్నించారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ అని చంద్ర‌బాబు మోసం చేశాడ‌ని, బాబు అధికారంలో ఉన్నంతకాలం మోసానికి గురవ్వని వర్గం లేదన్నారు. 2014లో పొత్తులతో గెలిచిన చంద్రబాబు.. రాష్ట్రానికి ఏం చేశారు?. నిలువునా రాష్ట్రాన్ని మోసం చేశారా లేదా? అని నిల‌దీశారు. సీఎం వైయ‌స్‌ జగన్ కేంద్రంతో పొత్తు లేకపోయినా ఏపీకి ఎన్ని అభివృద్ధి పనులు చేశారో కనపడటం లేదా?. సీఎం వైయ‌స్‌ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలు కనపడటం లేదా? అని ఎంపీ మార్గాని భరత్ ప్ర‌తిప‌క్షాల‌ను ప్ర‌శ్నించారు. 

Back to Top