ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జీరో అవర్ జరుగుతున్న సమయంలో లోక్‌సభలోకి దూసుకెళ్లి రంగు పొగను విసిరిన వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. లోక్‌సభలో విజిటర్ గ్యాలరీ నుంచి దూకి మరీ దుండగులు వెల్ వైపు వెళ్లే ప్రయత్నం చేయడం కలకలం రేపుతోంది. రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేస్తూ ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకారు. సాగర్ శర్మ అనే ఆ యువకుడు విజటర్స్ గ్యాలరీ నుంచి దూకిన తర్వాత ఎంపీల సీట్ల ముందు జంప్ చేస్తూ.. హంగామా చేశాడు. సభలోకి దూకిన ఆ వ్యక్తి కలర్ స్మోక్ వదిలాడు. షాక్‌కు గురైన ఎంపీలు కొంత మంది వెంటనే బయటకు వెళ్లేందుకు పరుగులు పెట్టారు. కానీ సభలోనే ఉన్న వైయస్ఆర్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వెంటనే ఆ దుండగుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. లోక్‌సభలో దూకిన ఆగంతకుడిని ఎదురుగా వెళ్లి ఎంపీ గోరంట్ల మాధవ్ పట్టుకున్నారు. చేతులు వెనక్కు విరిచి పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. గోరంట్ల మాధవ్‌ను సహచర ఎంపీలు అభినందించారు. గతంలో ఆయన పోలీస్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. సీఐగా సర్వీసులో ఉండగానే వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ పిలుపు మేరకు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చారు. గోరంట్ల మాధవ్ మీడియా మాట్లాడుతూ.. బెంచీలు దాటుకొని, స్పీకర్ చైర్ వైపు దూసుకొచ్చి ఆగంతకుడు దాడి చేసే ప్రయత్నం చేశాడని, ఎదురుగా వెళ్లి అతనిని నేరుగా పట్టుకున్నానని అన్నారు. సందర్శకుల గ్యాలరీ ఎత్తు తగ్గించడం వల్ల సులభంగా లోపలికి ప్రవేశించాడని, సందర్శకుల గ్యాలరీకి గ్లాస్ బిగించాలన్నారు. ఇది కచ్చితంగా తీవ్రమైన భద్రత వైఫల్యమే’’ అని గోరంట్ల మాధవ్ అన్నారు.గోరంట్ల మాధవ్ పార్లమెంట్‌లో ధైర్య సాహసాలు చూపి అందర్నీ ఆకట్టుకున్నారు.