పేదలను కొట్టి.. పెద్దలకు పెట్టడమే చంద్రబాబు సిద్ధాంతం

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే బాబు అమరావతి ఆరాటం

క్యాపిటల్‌ అనేది కామన్‌ మెన్‌ నివసించే విధంగా ఉండాలి

కుప్పంను మున్సిపాలిటీ చేసుకోలేని చంద్రబాబు హైదరాబాద్‌ను నిర్మించాడంటే నమ్మాలా..?

హైదరాబాద్‌లో టీడీపీ ఎందుకు సమాధి అయ్యింది..?

ఉత్తరాంధ్ర ప్రజల ఆకలి, అస్థిత్వాన్ని వెక్కిరించేందుకు వస్తే.. ఆగ్రహావేశాలకు లోనవుతారు

మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికి చంద్రబాబు, ఆయన తాబేదారులు పాదయాత్ర చేపట్టారని, ఉత్తరాంధ్రుల ఆకలిని, అస్థిత్వాన్ని వెక్కిరించడానికి వచ్చేవారంతా ఇక్కడి ప్రజల ఆగ్రహావేశాలకు కచ్చితంగా లోనవుతారని, దానికి చంద్రబాబే బాధ్యుడవుతాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. పేదవాడిని కొట్టి.. పెద్దవాళ్లకు పెట్టాలనేది చంద్రబాబు సిద్ధాంతమని, 26 జిల్లాల ప్రజల త్యాగాలను 29 గ్రామాల ప్రజలు అనుభవించాలా..? మూడు రాజధానులతో రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలా అని ప్రశ్నించారు. విశాఖపట్నంలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆమె ఏం మాట్లాడారంటే..

‘హైదరాబాద్‌ లేని ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ప్రాంతీయ విభేదాలు రాకూడదు. అసమానతలు తలెత్తకూడదని పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. ఇలాంటి గొప్ప ఆశయాన్ని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం.? అమరావతిలోని కొంతమంది చంద్రబాబు తాబేదారులు వెయ్యి రోజులు ఉద్యమం చేసి 29 గ్రామాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటే.. సీఎం వైయస్‌ జగన్‌ 26 జిల్లాల్లోని ప్రజలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రజల పన్నులతో 29 గ్రామాలు అభివృద్ధి చెందాలని చూస్తే.. సీఎం వైయస్‌ జగన్‌ 26 జిల్లాలు అభివృద్ధి చెందాలని కృషిచేస్తున్నారు. రాష్ట్ర ప్రజలంతా త్యాగం చేస్తే దాని ఫలాలు 29 గ్రామాలు అందుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. 

పాదయాత్ర పేరుతో విశాఖకు వచ్చి ఏం చేస్తారు..? ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా ఆకలిని, అస్థిత్వాన్ని చంద్రబాబు ఆయన తాబేదారులు వెక్కిరిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకుల్లా కనిపిస్తున్నారా..? ఉత్తరాంధ్ర ఉద్యమాల పురిటిగడ్డ.. ఎన్నో సాయుధ, రైతాంగ పోరాటాలు జరిగిన గడ్డ. అల్లూరి సీతారామరాజు లాంటి పోరాట యోధుడు పుట్టిన గడ్డ ఇది. అలాంటి గడ్డ నివసిస్తున్న ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికి ఇలాంటి పాదయాత్రలు చేయడం ఎంతవరకు సమంజసం. 

చంద్రబాబు ప్రతిపక్షాలను కలుపుకొని చాలా మాటలు మాట్లాడారు. బాబుకు నిజంగా అమరావతి మీద ప్రేమ ఉందా..? రియల్‌ ఎస్టేట్‌ మీద ప్రేమ ఉందా అని అనుమానం కలుగుతోంది. పేదల కడుపుకొట్టి.. పెద్దలకు పెట్టడమే చంద్రబాబు సిద్ధాంతం. క్యాపిటల్‌ అనేది కామన్‌ మెన్‌ నివసించే విధంగా ఉండాలని కానీ, క్యాపిటలిస్టుల కోసం కాదు. ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిని భ్రమరావతిగా సినిమా చూపించాడు. గ్రాఫిక్స్, డిజైన్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టడమే కాకుండా వేలకోట్లు దోచుకున్నాడు. హైదరాబాద్‌లో 200 కోట్లతో సొంతిల్లు కట్టుకున్నాడు తప్ప.. హైదరాబాద్‌కు చంద్రబాబు చేసిందేమీ లేదు. 

35 సంవత్సరాలు కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉన్నాడు. కుప్పంను మున్సిపాలిటీ చేసుకోలేని చంద్రబాబు హైదరాబాద్‌ను కట్టాడంటే ఏపీ ప్రజలు నమ్ముతారా.. హైదరాబాద్‌ను నిజంగా చంద్రబాబు నిర్మిస్తే.. అదే హైదరాబాద్‌లో టీడీపీ ఎందుకు సమాధి అయ్యిందని ప్రశ్నిస్తున్నా..? ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది. ఉపాధి అవకాశాలు లేక చాలామంది  వలసలు వెళ్లిపోతున్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే కచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పారిశ్రామికంగా, మౌలిక వసతుల పరంగా అభివృద్ధి చెందుతుంది. పేదలకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి’’ అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. 
 

Back to Top