తాడేపల్లి: గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏపీ నూతన సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పారదర్శంగా వ్యవహరిస్తున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఏం చేయబోతున్నాం.. భవిష్యత్తు కర్తవ్యం ఏంటని ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు. వైయస్‌ఆర్ ఎల్పీ సమావేశం అనంతరం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. కేవలం ఇవాళ ఇచ్చే పదవులే కాదు.. 2024 సార్వత్రిక ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం విజయం సాధించాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. రెండు విడతలుగా అవకాశాలు ఇస్తామని, ముందుగా 25 మందికి మంత్రివర్గంలో చోటు తరువాత కనీసం 20 మందికి అవకాశాలు ఇస్తానని చెప్పారన్నారు. పదవులు రానివారు ఎవరూ నిరుత్సాహ పడకుండా సహకరించాలని కోరారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదు వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇద్దాం.. మా సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి గుర్తించాడనే సంకేతం ఇద్దామని చెప్పారన్నారు. దాదాపు 35 మంది వరకు సమావేశంలో ముఖ్యమంత్రితో మాట్లాడారని, మాట్లాడిన ప్రతివారు ముఖ్యమంత్రికి పూర్తి మద్దతు తెలియజేశారన్నారు. గత ఐదు రోజుల పరిపాలనతోనే ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యేలంతా చెప్పారన్నారు.