సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా మేనిఫెస్టో

హామీలన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేస్తాం

ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు వైయస్‌ జగన్‌ కృతనిశ్చయంతో ఉన్నారు

దివంగత మహానేత వైయస్‌ఆర్‌ విధి విధానాలతో మేనిఫెస్టో రూపకల్పన

వాగ్దానాలన్నీ నూటికి నూరు శాతం అమలు చేస్తాం

26న విజయవాడలో మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం

వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత, కమిటీ అధ్యక్షులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

హైదరాబాద్‌: ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో రూపొందించనున్నామని మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. వైయస్‌ఆర్‌ సీపీ మేనిఫెస్టో రూపకల్పన కమిటీని పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీ తొలి సమావేశం విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఈ నెల 26వ తేదీన ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. సమావేశంలో మేనిఫెస్టో రూపకల్పనతో అనుసరించాల్సిన విధానాలు, చేపట్టాల్సిన అంశాలపై ముందుగా చర్చిస్తామని చెప్పారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్‌ నేత విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే.. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దాదాపు సంవత్సరం నాలుగు నెలల పాటు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో 13 జిల్లాలను సందర్శించడమే కాకుండా అనేక వర్గాల వారిని కలిశారు. వ్యవసాయం, చేతి వృత్తులు, విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మికులను అన్ని వర్గాలను పాదయాత్రలో కలిశారు. ఆ ప్రాంతాల్లో ఉన్న అనేక సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలకు అందించాల్సిన మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి. మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఏ విధమైన భరోసా కల్పించాలని ఆలోచించినప్పుడు వైయస్‌ జగన్‌ నిర్ధిష్టమైన సూచనలు ఇచ్చారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రూపొందించాలి. సమస్యల పరిష్కారమే కాకుండా, వివిధ వర్గాలకు సమస్యల పరిష్కారం చూపే విధంగా ఉండాలని చెప్పారు. 

ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విధి విధానాలు కూడా తీసుకురావాలని సూచన చేశారు. వైయస్‌ఆర్‌ సంక్షేమ పథకాల అమలులో సమతూల్యత పాటించారు. జలవనరుల అభివృద్ధి, వ్యవసాయం పండుగ, అన్ని వర్గాల సంక్షేమం, ఆరోగ్యశ్రీ, ఫీజురియంబర్స్‌మెంట్‌ లాంటి నూతన పథకాలు, భవిష్యత్తు తరలాలకు కూడా ఉపయోగపడే విధంగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు కూడా మేనిఫెస్టోలో పొందుపర్చేలా చూడాలన్నారు. 

పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ చాలా జాగ్రత్తగా బాధత్యాయుతంగా చెప్పారు. మనం పొందుపర్చిన అంశాలు నూటికి నూరుపాళ్లు అమలు చేస్తామనే భరోసా ప్రజలకు ఇవ్వాలి. మేనిఫెస్టో అంటే కేవలం ఓట్లు వేయించుకోవడం కాదు. తప్పుడు వాగ్దానాలు కాదు. చేసిన ప్రతి వాగ్దానం ఐదు సంవత్సరాల కాలంలో అమలు చేసే విధంగా ఉండాలని చెప్పారు. ప్రజా సంకల్పయాత్రలో తెలుసుకున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని నవరత్నాలను ప్రకటించి వాటిని పదే పదే నొక్కి చెబుతూ వాటిల్లో ఉన్న తొమ్మిది అంశాల వల్ల అన్ని వర్గాల ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తామనేది చెప్పారు. దాని ఆధారంగా పార్టీ కరపత్రం తయారు చేసి రాష్ట్రంలోని అన్ని జిల్లాలోని ప్రతి గడపకు ఇవ్వడం జరిగింది. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వస్తే నవరత్నాలు అందిస్తాం. నవరత్నాలతో అన్నివర్గాల సమస్యలు పరిష్కారం అవుతాయి. 

వైయస్‌ఆర్‌ రైతు భరోసా, ఫీజురియంబర్స్‌మెంట్‌ పథకం, ఆరోగ్యశ్రీ వంటి ప్రధాన అంశాలను మేనిఫెస్టోలో కచ్చితంగా పొందుపరుస్తాం. ఎంతో నిరుపేద విద్యార్థుల బతుకులు మార్చిన ఫీజురియంబర్స్‌మెంట్, వైయస్‌ఆర్‌ హయాంలో పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించిన ఆరోగ్యశ్రీ, రైతుకు అండగా నిలబడే వైయస్‌ఆర్‌ రైతు భరోసా అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. 

జలయజ్ఞం: రైతు సంక్షేమం కోసం వనరులన్ని ఒడిసిపట్టి జలయజ్ఞం ద్వారా సాగునీరు, తాగునీరుకు ఇబ్బందులు లేకుండా చేస్తాం. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. 

మద్యపాన నిషేదం: ప్రభుత్వాలు వాగ్దానాలు చేసినా గతంలో అమలు చేయలేని మద్యం నిషేదం కూడా ప్రధాన అంశంగా తీసుకొస్తున్నాం. 

అమ్మ ఒడి: అమ్మ ఒడి కార్యక్రమం ప్రధాన అంశంగా మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం. 

వైయస్‌ఆర్‌ ఆసరా: ఎంతోమంది నిరుపేద వృద్ధులు రెండు పూటలు తినలేని పరిస్థితుల్లో ఉన్నారు. పేదలకు భరోసా కల్పించేలా వైయస్‌ఆర్‌ ఆసరా కూడా తీసుకువస్తాం. 

పేదలందరికీ ఇళ్లు: పూడి గుడిసె కనిపించకూడదు అనే నినాదంతో నూతన రీతిలో పేదలకు ఇంటి పథకం మరో ప్రధాన అంశంగా తీసుకున్నాం. 

పెన్షన్ల పెంపు: సమాజంలో ప్రతి దానికి విలువలు పెరిగిపోయాయి. ధరలు పెరిగిపోయాయి. ఎప్పుడో ఇచ్చిన పెన్షన్లు కాకుండా, పెన్షన్లు పెంచడం, వయస్సును తగ్గించడం, చేతి వృత్తుల వారికి పెన్షన్లు అందిస్తాం. ఎన్నికలు మేనిఫెస్టో ప్రకటించిన తరువాత దానికి కట్టుబడి తూచా తప్పకుండా నూటికి నూరుపాళ్లు అమలు చేస్తామని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. 

 

Back to Top