అనంతపురం: నారా చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలతోనే నిండిపోయిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పార్టీని, కుర్చీని లాక్కున్న దుర్మార్గుడని మండిపడ్డారు. అనంతపురంలో ఎమ్మెల్సీ పోతుల సునీత విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా చంద్రబాబు అనేక ఆరోపణలు చేసి ఆయన్ను ఇబ్బందిపెట్టాలని చూశాడన్నారు. చంద్రబాబు గోబెల్స్ ప్రచారాన్ని మాత్రమే నమ్ముకున్నాడని, అబద్ధాలు ప్రచారం చేసి వైయస్ జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టాలని కుట్రలు చేస్తున్నాడన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా రాష్ట్ర ప్రజల నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను వేరుచేయలేరన్నారు. నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర కామెడీ గళంగా మారిందని ఎమ్మెల్సీ పోతుల సునీత ఎద్దేవా చేశారు. టైమ్ పాస్ కోసం సాయంత్రం పూట లోకేష్ వాకింగ్ చేస్తున్నాడని, కేవలం ముఖ్యమంత్రిని తిట్టడానికే కామెడీ గళం చేస్తున్నాడని రాష్ట్ర ప్రజలు గుర్తించాలన్నారు. చంద్రబాబు జేబు సంస్థగా జనసేన తయారైందని, పవన్ కల్యాణ్‌ను ప్యాకేజీ మాస్టర్‌గా టీడీపీ రంగంలోకి దించిందన్నారు. పవన్ చేస్తున్నది వారాహి యాత్ర కాదు.. నారాహి యాత్ర అని ఎద్దేవా చేశారు. కరోనా టైమ్‌లో చంద్రబాబు, లోకేష్, పవన్ టూరిస్టు నాయకులుగానే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి వెళ్లారని గుర్తుచేశారు. ఏపీలో సొంత ఇల్లు కూడా లేని టూరిస్టు నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.