న్యాయ విచారణలో వ్యక్తిగత వ్యాఖ్యలు అవాంఛనీయం

మాకు కోర్టులు, జడ్జీలు, న్యాయవ్యవస్థపై చాలా గౌరవం

తమ పరిధిలో లేని అంశాలపై న్యాయమూర్తుల వ్యాఖ్యలు

వాటిని తమ స్వప్రయోజనాలకు వాడుకుంటున్న పార్టీలు

ముందస్తుగా ఎన్నికలు వస్తాయని ఒక జడ్జి ఎలా వ్యాఖ్యానిస్తారు? 

జడ్జీలకు చేతులు జోడించి వేడుకుంటున్నాం.. కోర్టులో లేని అంశాలపై వ్యాఖ్యలు చాలా బాధాకరం 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ 

తాడేపల్లి: న్యాయస్థానాలు, న్యాయమూర్తు­లు, న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిపై ప్రభు­త్వానికి, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌కు, తమకు అపార గౌరవం ఉందని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఏదైనా ఉంటే తీర్పులో రాస్తే దాన్ని గౌర­వంగా అమలు చేస్తా­మని తెలిపారు. తీర్పుపై విభేదిస్తే అప్పీల్‌ చేస్తామన్నారు. కానీ, ఇలా చేయకుండా జడ్జి రాజకీయ పార్టీల మాదిరిగా మాట్లా­డుతూ.. ఎల్లో మీడియా, దుష్ట చతుష్ట­యా­నికి ఉపయోగపడేలా వ్యా­ఖ్య­లు చే­యడం సరికాదన్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఏం మాట్లాడారంటే..

ఇటీవల కోర్టుల్లో చేస్తున్న వ్యాఖ్యానాలపై పత్రికలు రాజకీయ బాష్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు కోర్టులు కూడా తమ పరిధిలో లేని అం«శాలను ప్రస్తావించడం వల్ల, వాటిని కొన్ని పత్రికలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పతాక శీర్షికల్లో ప్రచురిస్తున్నాయి. ఆ విధంగా న్యాయవ్యవస్థను పక్కదారి పట్టించి, తమకు కావాల్సిన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి. దుష్ట చతుష్టయంలో భాగమైన ఈనాడు, ఆంధ్రజ్యోతి అలా వ్యవహరిస్తున్నాయి. కోర్టుల్లో అలాంటి సంభాషణలు రావడం కూడా అవాంఛనీయం.

మాకు న్యాయవ్యవస్థపై చాలా గౌరవం..
మాకు, మా పార్టీకి, సీఎంకి కోర్టులన్నా, న్యాయవ్యవస్థ అన్నా చాలా గౌరవం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టులు, న్యాయవ్యవస్థ గౌరవంగా ఉండాలన్నదే మా అభిమతం. మా ఉద్దేశం. దానికి కట్టుబడి ఉంటాం. మాకు అంత గౌరవం ఉంది కాబట్టే, మాకు అనేక సందర్భాల్లో మాకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా, పూర్తి సంయమనం పాటిస్తున్నాం.

ఎన్నికలపై జడ్జీ వ్యాఖ్య..
ఇటీవల ఒక జడ్జి అక్కడ (కోర్టులో) లేని అంశాలు పస్తావిస్తున్నారు. నిన్న ఒక సందర్భంలో ఎన్నికలు తొందరగా వస్తాయి అని వ్యాఖ్యానించారు. మరి వారి ఉద్దేశం ఏమిటో మాకు అర్ధం కావడం లేదు. వెంటనే అడ్వకేట్‌ జనరల్‌ స్పందించారు. ‘మీ ద్వారా తెలియజేస్తున్నాను. వారికి చెప్పండి. ఎన్నికలు కాల పరిమితిలోనే జరుగుతాయి. ఎన్నికలు తొందరగా రావు. వారికి ఆ అవకాశం ఇవ్వబోము’ అని చెప్పారు. ఆ జడ్జీ అలా ఎందుకు అన్నారో మాకు అర్ధం కావడం లేదు. దీనిపై జ్యుడీషియరీలో ఉన్న పెద్దలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పొలిటికల్‌ కనెక్టివిడీ ఉన్న విషయాలు అక్కడ ప్రస్తావించడంతో, కొన్ని పత్రికలు, కొన్ని సంస్థలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయి.

చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం..
జ్యుడీషియరీ, రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో అలాంటివి జరగకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయ కోణంలో జ్యుడీషియరీ కామెంట్స్‌ను వాడుకుంటున్నారు. నిన్న ఈనాడులో ఒక స్టోరీ వచ్చింది. కోర్టులో చేసిన వాదనల సందర్భంగా జడ్జీ చేసిన వ్యాఖ్యలను కూడా రాజకీయ పతాక శీర్షికగా ఒక పార్టీకి అనుకూలంగా పెద్దగా రాశారు. ఆ వి«ధంగా రాయడం ఎంత వరకు సబబు అన్నది జడ్జీ  ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

అవి గుర్తెరగాల్సి ఉంది..
ఇటీవలే తాజా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ న్యాయమూర్తులకు అప్పీల్‌ చేశారు. ఆయన సుప్రీంకోర్టు న్యాయవాది. వాదనల సందర్భంగా జడ్జీలు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు రాజకీయ పక్షాలు, కొన్ని సంస్థలు, విద్రోహ శక్తులకు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త సంయమనంతో ఉండాలని ఆయన కోరారు. జడ్జీల వ్యాఖ్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే ఇటీవల చెన్నై కోర్టు ఒక కేసులో ఎన్నికల సంఘంపై హత్య కేసు నమోదు చేయమని ఆదేశించింది. దానిపై స్పందించిన సుప్రీంకోర్టు.. అలా పరిధి దాటి మాట్లాడకూడదని స్పష్టం చేసింది. కోర్టులు అలా మాట్లాడకూడదని వెల్లడించింది. అందువల్ల కోర్టుల్లో వ్యాఖ్యానాలను, రాజకీయ పక్షాలు తమకు అనుకూలంగా వాడుకోవడం సరికాదని, అలాంటి వ్యాఖ్యానాలు చేయకూడదని సాక్షాత్తూ మాజీ రాష్ట్రపతితో పాటు, సుప్రీంకోర్టు కూడా కోరింది.

ఆలోచించమని వేడుకుంటున్నాం..
మాకు న్యాయవ్యవస్థ మీద, ఆ జడ్జీ మీద చాలా గౌరవం ఉంది. కాబట్టి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుతున్నాం. మీ వ్యాఖ్యలు ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగా ఉన్నాయి. అది సబబా అని మేము భావిస్తున్నాం. కాబట్టి ఆ వ్యాఖ్యలను ఒకసారి సమీక్షించుకోవాలని కోరుతున్నాం. న్యాయవ్యవస్థ స్వతంత్య్ర ప్రతిపత్తికి అది అవసరమా? ఒక్కసారి ఆలోచించమని వేడుకుంటున్నాం. మీరు ఆదేశించండి. మా ప్రభుత్వం అమలు చేస్తుంది. మాకు కోర్టులన్నా, న్యాయమూర్తులన్నా చాలా గౌరవం ఉంది. మీరు తీర్పులో రాయాల్సిన పదజాలాన్ని రాయకుండా, వాదనల సందర్భంగా చేస్తున్న వ్యాఖ్యానాలను కొన్ని రాజకీయ పక్షాలు, కొన్ని పత్రికలు వాడుకుంటున్నాయి. ఆ పత్రికలు స్వార్థ ప్రయోజనాలు ఆశించి, ఆ రాజకీయ పార్టీలకు అనుకూలంగా పని చేస్తున్నాయి. కాబట్టి ఆ దుష్ట శక్తులకు మీరు ఉపయోగపడొద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాం.

కొన్నింటి ప్రస్తావనతో సమస్యలు..
ఒకరు చేయాల్సిన పనిని మరొకరు ఎత్తుకోవడం అనేది ఎంత వరకు సబబు? మీరు ఆలోచించండి. ఎన్నికలు అనేవి, ప్రజాభిప్రాయం పొందడం అనేది రాజకీయ పార్టీల బాధ్యత. దాన్ని వేరే వారు ఎత్తుకుంటే ఎలా? ఎవరి బాధ్యతలు వారికి ఉన్నాయి. వాటి పరిధిలో ఉండకుండా, ఒకరు చేయాల్సిన పనిని మరొకరు ఎత్తుకుంటే ఎలా? ముఖ్యంగా న్యాయవ్యవస్థ. దీనిపై అందరికీ గౌరవం. ఎవరైనా తమకు అన్యాయం జరిగిందని అనుకుంటే, న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తారు. అందుకే కోర్టు ఆదేశాలను అందరూ పాటిస్తారు. కానీ కోర్టు కూడా తమ పరిధిలో లేని అంశాన్ని ప్రస్తావించడం వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయి. ఇది మంచి పరిణామం కాదని గౌరవ న్యాయస్థానానికి, జడ్జీకి విజ్ఞప్తి చేస్తున్నాం.

మీరే అలా మాట్లాడడం సబబా?..
ఇటీవల జడ్జీ.. మా (తన కూతురు) అమ్మాయికి రాజధాని ఎక్కడో తెలియదని గతంలో అన్నారు. నిజానికి రాజధాని అంశం హైకోర్టు విచారణ పరిధిలో ఉంది. సుప్రీంకోర్టులోనూ వ్యాజ్యం కొనసాగుతోంది. మీరు దానిపై విచారణ చేస్తూ, ఆ విధంగా కామెంట్స్‌ చేయొచ్చా? ఇంకా అనేక సందర్భాల్లో తమ పరిధిలో లేని అనేక అంశాలు ప్రస్తావిస్తూ, చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. అందుకే నమస్కరిస్తూ.. చాలా గౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు, మా పార్టీకి కోర్టులన్నా, న్యాయమూర్తులన్నా చాలా గౌరవం ఉంది. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగ గౌరవం పెంచాలి కానీ, కన్ఫ్యూజన్‌ క్రియేట్‌ చేయడం సరికాదని గౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నాం.

పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నాం..
ఎస్సీల అభివృద్ధిపై ఈ ప్రభుత్వం కంటే గతంలో ఎవరైనా ఇంత చిత్తశుద్ధి చూపారా? వారి కోసం గతంలో ఎవరైనా ఇన్ని పథకాలు, కార్యక్రమాలు అమలు చేశారా?. నాడు–నేడు కింద పాఠశాలలను ఏ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామో మీకు తెలియదా? పేద వర్గాలంటే ఎంతో అభిమానమున్న, వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ఎంతో పని చేస్తున్న ఈ ప్రభుత్వంపై ఆ విధంగా కామెంట్స్‌ చేసి, కొన్ని రాజకీయ పక్షాలకు, ఆ మీడియా సంస్థలకు ఉపయోగ పడడం ఎంత వరకు వాంఛనీయం? ఎంత వరకు సబబు? అని జడ్జీకి విజ్ఞప్తి చేస్తున్నాం.

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా?
ఒక పత్రిక చూడండి. ఎలా రాసిందో. చివరకు జడ్జీ పేరు కూడా రాసి, ఆయన వ్యాఖ్యానాలన్నీ ప్రచురించారు. మరి వాటన్నింటినీ తీర్పులో రాస్తారా? అలా చేస్తే మేము అప్పీల్‌కు వెళ్తాం. మరి ఆ పని చేయనప్పుడు వాదనల సందర్భంగా చేసిన వ్యాఖ్యానాలను కూడా ఇలా తమకు అనుకూలంగా పతాక శీర్షికల్లా రాస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా?  మీరు ఏదైనా ఉంటే తీర్పులో రాయండి. దాన్ని గౌరవంగా అమలు చేస్తాం. విభేదాలు ఉంటే అప్పీల్‌ చేస్తాం. కానీ అలా చేయకుండా, మీరు కూడా రాజకీయ పక్షాల మాదిరిగా మాట్లాడుతూ, ఆ పత్రికలు, ఆ దుష్ట చతుష్టయానికి ఉపయోగపడితే..  ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ స్ఫూర్తిని, న్యాయవ్యవస్థ గౌరవాన్ని ఏ విధంగా కాపాడుకున్న వాళ్లం అవుతాం. రాజకీయ పార్టీలకు ఎన్నో లక్ష్యాలు ఉంటాయి. గోల్‌ కొట్టాలని అనుకుంటారు. దానికి వారి మార్గాలు వారే చూసుకుంటారు. అందులో మీ సహకారం ఎందుకు? 

పొలిటికల్‌ కామెంటింగ్‌ వద్దు. వేడుకుంటున్నాం..
అందువల్ల.. ‘ఐ సిన్సియర్లీ అప్పీల్‌ టు హానరబుల్‌ జడ్జెస్‌.. హానరబుల్‌ కోర్ట్స్‌.. నాట్‌ టు అండర్‌ టేక్‌ పొలిటికల్‌ కామెంటింగ్, వైల్‌ హోల్డింగ్‌ జ్యుడీషియల్‌ వర్క్‌’. ఇటీవలే సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఒక ఎంపీ ఎలా మాట్లాడాలనేది మేము ఎలా చెబుతున్నాం. వారు ఇతరులను గాయపర్చే విధంగా మాట్లాడొద్దని పేర్కొంది. ఇది ఈనెల 4న అన్ని పత్రికల్లో వచ్చింది. అంటే తాము చేసే వ్యాఖ్యలు రాజకీయ పక్షాలకు ఉపయోగపడే విధంగా ఉండొద్దని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చివరకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా అదే చెప్పారు.

వినమ్రపూర్వకంగా ఇది మా విజ్ఞప్తి..
మాకు కోర్టులన్నా, జడ్జీలన్నా చాలా గౌరవం ఉంధి. రాజధాని అమరావతిపై మాకు ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. ఆ అంశం ఇప్పుడు కోర్టుల పరి«ధిలో విచారణలో ఉంది. సుప్రీంకోర్టు, హైకోర్టు విచారణలో ఉన్న ఆ అంశంపై మీరు బయట ఓపెన్‌ ఫోరమ్‌లో అలా మాట్లాడడం, మీ వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేయడం వాంఛనీయమేనా? అది రాజ్యాంగ పరిధి గీత దాటడం కాదా? ఒక్కసారి ఆలోచించమని సగౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎంపైర్స్‌ వంటి వారు. కోర్టులంటే మాకు గౌరవం ఉంది. న్యాయవ్యవస్థ స్వతంత్య్ర ప్రతిపత్తి అంటే మాకు చాలా గౌరవం. కోర్టుల తీర్పులు మేము పాటిస్తాం. కాబట్టి మరోసారి సిన్సియర్‌గా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయపరమైన అంశాలను ప్రస్తావించకండి అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ వేడుకున్నారు.

Back to Top