తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో అమలు అవుతున్న సామాజిక న్యాయం భారతదేశంలో మరే రాష్ట్రంలో లేదని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చినన్ని రాజకీయ పదవులు బలహీనవర్గాల ముఖ్యమంత్రులు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇవ్వలేదని అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన `సుపరిపాలనకు మూడేళ్లు` కార్యక్రమంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ పాల్గొని ప్రసంగించారు.
ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇంకా ఏం మాట్లాడారంటే..
ప్రతి ఒక్కరూ సీఎం వైయస్ జగన్ పరిపాలనకు ముందు సామాజిక న్యాయం ఎలా ఉంది.. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉందన్నది బేరీజు వేసుకుంటున్నారు. కోనసీమకు అంబేడ్కర్ జిల్లా పేరు పెట్టాలని అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ లు మొదట డిమాండ్ చేశారు. ఆ తర్వాత ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టింది. దీన్ని జీర్ణించుకోలేని సంఘ విద్రోహ శక్తులు దళిత మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇళ్ళ మీద దాడులు చేసి, తగలబెట్టి, హింసకు పాల్పడినా కనీసం టీడీపీ, జనసేన పార్టీలు ఖండించలేదు. ఆ వర్గాల పట్ల ఆ పార్టీలకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుంది.
సామాజిక న్యాయం అంటే తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఒక బూటకం, ఎన్నికల నినాదం మాత్రమే. ఈ పార్టీలను దళిత, బలహీన వర్గాల వాడల్లోకి కూడా రానివ్వరు. గ్రామ సచివాలయ వ్యవస్థ, నూతన జిల్లాలు ఏర్పాటు, మరెన్నో సంక్షేమ పథకాల ద్వారా సీఎం వైయస్ జగన్ రాష్ట్రంలో గొప్ప పరిపాలన అందిస్తున్నారు.
మన యుద్ధం రాక్షసులతో.. : ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా పాలనకు మూడేళ్ళు పూర్తయ్యాయని, అయితే, ప్రభుత్వంపై రాక్షస మూకలు, ఎల్లో మూకలు దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. వీరితో రాబోయే రెండేళ్ళు కూడా యుద్ధం చేయాలన్నారు. టీడీపీతోపాటు ఎల్లో మీడియా రాక్షసులపై మనం యుద్ధం చేస్తున్నామన్న విషయాన్ని కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలని సూచించారు.