నారా లోకేష్‌.. నోరు అదుపులో పెట్టుకో

ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడితే సహించం

మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టడమే టీడీపీకి తెలుసు

గురజాల, దాచేపల్లి మున్సిపాలిటీల్లో వైయస్‌ఆర్‌ సీపీదే విజయం

ప్రభుత్వ సంక్షేమ పథకాలే వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులను గెలిపిస్తాయి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్‌రెడ్డి

గుంటూరు: దొడ్డిదారిన ఎమ్మెల్సీ, మంత్రి అయిన చరిత్ర లోకేష్‌ది. నారా లోకేష్‌ నోరు అదుపులో పెట్టుకోవాలి. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను ఏకవచనంతో మాట్లాడితే సహించం’ అని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి లోకేష్‌ను హెచ్చరించారు. కుప్పం మున్సిపాలిటీలోనూ వైయస్‌ఆర్‌ సీపీ విజయం ఖాయమన్నారు. దాచేపల్లి, గురజాల మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలు పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్‌రెడ్డిలు ఇంటింటి ప్రచారం అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గ్రామంలో, పట్టణంలో ఎక్కడకు వెళ్లినా, ఏ పేద కుటుంబం తలుపుతట్టినా.. సంక్షేమ పథకాలు అందుతున్నాయనే చెబుతున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వం బురదజల్లుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పల్నాడు ప్రాంతం సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందన్నారు. పల్నాడు ప్రాంత పేద ప్రజలను వైద్యపరంగా ఆదుకోవడానికి పిడుగురాళ్ల నడిబొడ్డులో మెడికల్‌ కాలేజీకి సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారన్నారు. అవినీతి, వివక్ష లేని పరిపాలన అందిస్తున్నారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి.. కచ్చితంగా సాయం చేస్తారనే నమ్మకం, భరోసా ప్రజల్లో ఉందన్నారు. గురజాల, దాచేపల్లిలో వైయస్‌ఆర్‌ సీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

తెలుగుదేశం పార్టీకి ప్రజలే బుద్ధిచెబుతారు : ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి
900 ఏళ్ల చరిత్ర కలిగిన గురజాల, దాచేపల్లి గ్రామాలను పట్టణాలను చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. విద్య, వైద్య, సాగు, తాగునీటి పరంగా, సొంత ఇళ్ల పట్టాలు, రోడ్ల పరంగా పల్నాడు ప్రాంత రూపురేఖలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మార్చేస్తున్నారని, పిడుగురాళ్లలో 800 పడకల ఆస్పత్రి అతిత్వరలో ప్రజలకు అందుబాటులోకి రాబోతుందన్నారు. పల్నాడులో పీహెచ్‌సీ సెంటర్లు కాకుండా ఇప్పుడున్న 100 పడకలకు పదిరెట్లు 1000 పడకల ఆస్పత్రులు అందుబాటులోకి రాబోతున్నాయన్నారు. పిడుగురాళ్లను పట్టణం చేసిన ఘనత, అద్దంకి–నార్కట్‌పల్లి హైవే రోడ్డు నిర్మించిన ఘనత దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిదని గుర్తుచేశారు. సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పల్నాడుకు మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రి, గుంటూరు–నాగార్జునసాగర్‌ నేషనల్‌ హైవే, ప్రతి గ్రామానికి మంచినీరు, సొంత ఇంటి పట్టాలు, నవరత్నాలు.. ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. 

తెలుగుదేశం పార్టీ పల్నాడుకు చేసిందేమీ లేదన్నారు. కనీసం గురజాల, దాచేపల్లిని మున్సిపాలిటీలు ఎందుకు చేయలేకపోయారు..? అని ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క కాలేజీ, ఆస్పత్రి, హైవే, పట్టణం, మంచినీరు ఇచ్చావా అని నిలదీశారు. మతాలు, కులాలను రెచ్చగొట్టి చిచ్చుపెట్టడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని మండిపడ్డారు. తప్పకుండా 15వ తేదీన తెలుగుదేశం పార్టీకి ప్రజలు బుద్ధిచెబుతారన్నారు.  
 

తాజా ఫోటోలు

Back to Top