విజయవాడ: చంద్రబాబు, పురందేశ్వరిపై వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఫైరయ్యారు. ప్రైవేట్ ఆస్పత్రులకు కొమ్ము కాసిన వ్యక్తి చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలో ప్రభుత్వ ఆస్పత్రులకు పెద్దపీట వేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సదుపాయాలు అందిస్తున్నారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నారన్నారు. పురందేశ్వరి టీడీపీకి తొత్తుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. నిజమైన బీజేపీ శ్రేణులు పురందేశ్వరి తీరును చూసి బాధపడుతున్నారన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన భారతీయ జనతా పార్టీకి ఏపీ అధ్యక్షురాలుగా ఉంటూ టీడీపీ కోవర్టుగా పురందేశ్వరి మారారన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆమెకు ఇసుమంతైనా ప్రేమ లేదని, టీడీపీ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీల గురించి ఏనాడూ ఆమె మాట్లాడిన పరిస్థితి లేదన్నారు. టీడీపీని బీజేపీతో జతకట్టించి వైయస్‌ఆర్ సీపీని దెబ్బతీయాలనేది పురందేశ్వరి టార్గెట్‌గా పెట్టుకున్నట్లుగా కనిపిస్తుందన్నారు.