రాజ్య‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో లోకేష్‌ను ఎందుకు దించ‌లేదు

దళితుడైన వర్ల రామయ్యను ఓడించి అవమానించాలనే బాబు ప్లాన్‌

చంద్రబాబు వ్యాఖ్యలను దళిత సమాజం ఎప్పటికీ మర్చిపోదు

వర్ల రామయ్య లేఖలు చిత్తుపేపర్లతో సమానం

దళిత సంక్షేమానికి సీఎం వైయస్‌ జగన్‌ పెద్దపీట వేశారు

మా ఏడాదిపాలనలో దళితజాతి మేలుపై చర్చకు సిద్ధమా..? 

వర్ల రామయ్యకు వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు సవాల్‌

తాడేపల్లి: చంద్రబాబు మెప్పుపొందడం కోసం టీడీపీ నేత వర్ల రామయ్య మూడు రోజులుగా లేఖలు రాస్తున్నాడని, ఆ ఉత్తరాలను చిత్తుపేపర్లుగా పరిగణిస్తున్నానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు అన్నారు. ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం కొరవడిందని, దళితులకు అన్యాయం, అవమానాలు జరుగుతున్నాయని, దళితుల సాధికారత లేదని, మానవ హక్కులు ఉల్లంఘించబడినవని ఆ శాఖలకు ఉత్తరాలు రాశాడని, ఇలాంటి చెత్త ఉత్తరాలు రాసిన వర్ల రామయ్యను ఏం పెట్టి కొడితే బుద్ధి వస్తుందో అర్థం కావడం లేదన్నారు. 

పుట్టిన సామాజిక వర్గం కోసం ఒక్క రోజు గళం విప్పని వర్ల రామయ్య.. నక్కజిత్తుల నారా చంద్రబాబు విష కౌలిగిలో చిక్కుకొని పదే పదే సీఎంపై మాటల దాడి, రాతల దాడి చేస్తున్నాడని మండిపడ్డారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో దళితులకు ఏం చేశారో.. సీఎం వైయస్‌ జగన్‌ ఏడాది పాలనలో దళితులకు ఎంత మేలు చేశారో.. ఎన్ని పదవులు ఇచ్చారో.. చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని, చర్చకు వచ్చే దమ్ము వర్ల రామయ్యకు ఉందా అని ప్రశ్నించారు. మంగళగిరిలో ఉన్న టీడీపీ కార్యాలయానికి అయినా వచ్చి చర్చించేందుకు సిద్ధమని సవాల్‌ విసిరారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోస్టర్ల ఖర్చు కూడా భరించలేని దళితులను ఎంపీలు, ఎమ్మెల్యేలను చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని, దళిత నేతను ఉప ముఖ్యమంత్రిని చేశారని, దళిత మహిళను హోంమంత్రిని చేశారని గుర్తుచేశారు. మాల, మాదిగ, రెల్లి మూడు కార్పొరేషన్‌లు చేసి దళిత జాతి అభ్యున్నతికి సీఎం వైయస్‌ జగన్‌ పెద్దపీట వేశారని చెప్పారు.  

హ్యూమన్‌ రైట్స్, దళిత ఎంపవర్‌మెంట్, సోషల్‌ జస్టిస్‌ గురించి నారా చంద్రబాబు జట్టు మాట్లాడితే అపహాస్యంగా ఉంటుందని రాష్ట్ర ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారని సుధాకర్‌బాబు అన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దళిత సమాజం ఉన్నంత కాలం మర్చిపోదన్నారు. వర్ల రామయ్యతో ఎన్ని డ్రామాలు ఆడించినా దళిత సమాజంలోకి చంద్రబాబుకు ప్రవేశం ఉండదన్నారు. 
 
వర్ల రామయ్యకు ఆత్మగౌరవం అనే పదం మీద గౌరవం ఉంటే.. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మాట్లాడిన నాయకుడి నాయకత్వంలో పనిచేయడం.. ఎంత వరకు సమంజసమో తేల్చుకోవాలన్నారు. ఆత్మవిమర్శ చేసుకున్న తరువాత ఇలాంటి పిచ్చిరాతలు రాయాలన్నారు. దళితులను కించపరిచేలా మాట్లాడిన నాయకుడి కాంపౌండ్‌లో పనిచేసే వర్ల రామయ్య కూడా దళిత ద్రోహి అని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మండిపడ్డారు. 

దళిత సమాజంపై చంద్రబాబుకు రవ్వంత ప్రేమ ఉన్నా.. దళితులను కించపరిచేలా మాట్లాడిన ఆదినారాయణరెడ్డి, చింతమనేని ప్రభాకర్‌ను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్‌ చేయలేదని ప్రశ్నించారు. దళితులను కించపరిచిన చంద్రబాబుకు దళిత నేత వర్ల రామయ్య ఎందుకు లేఖ రాయలేదని నిలదీశారు. దళిత జాతిని కించపరిచేలా చూసే చంద్రబాబు కింద పనిచేయడం చూసి దళితులుగా సిగ్గుపడుతున్నామని సుధాకర్‌బాబు అన్నారు. 

అమరావతిలో 54 వేల మంది దళితులకు సీఎం వైయస్‌ జగన్‌ ఇళ్ల స్థలాలు ఇస్తామంటే.. కోర్టులకు వెళ్లి ఎందుకు అడ్డుకున్నారని, అప్పుడు హ్యూమన్‌ రైట్స్‌కు ఎందుకు లేఖ రాయలేకపోయావు.. ఆ రోజు నీ గళం ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉండగా.. రాజ్యసభ సీటుకు ఎందుకు ఇవ్వలేదో ఆలోచించావా..? ఓడిపోతావని తెలిసినా కూడా ఓడించి అవమానించడం కోసం ఇప్పుడు పోటీలో పెట్టాడని వర్ల రామయ్య తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం జరిగే రాజ్యసభ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉండి ఉంటే నారా లోకేష్‌ను ఎందుకు పోటీలో పెట్టలేదు.. దళితుడైన వర్ల రామయ్యను ఎందుకు పెట్టాడో సమాజం అర్థం చేసుకోవాలని కోరారు. 

Back to Top