నారా వారి పాలన కాదు..సారా పాలన

ఎమ్మెల్యే రోజా

దశలవారీగా మద్యపాన నిషేధాన్ని స్వాగతిస్తున్నాం

బెల్టుషాపులను రద్దు చేస్తానని సంతకం చేసిన బాబు మరిచిపోయారు

బాబు పాలనలో వీధికో బెల్టు షాపు

అమరావతి: ఐదేళ్లు రాష్ట్రంలో సాగింది నారావారి పాలన కాదని, సారా పాలన అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు మద్యం పాలసీతో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దశలవారీగా మద్యపాన నిషేధాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్యే రోజా అన్నారు. మద్యపాన నిషేధంపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. టీడీపీ హయాంలో గుడి, బడి, అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ మద్యం షాపులు ఏర్పాటు చేశారని విమర్శించారు. 2 కోట్ల మంది మహిళలను అవమానించి, వాళ్ల జీవితాలతో ఆడుకున్నారని, చంద్రబాబు చేసిన తొలి సంతకం బెల్టుషాపుల రద్దు అభాసుపాలైందని ధ్వజమెత్తారు. బాబు దిగిపోయేసరికి రాష్ట్రంలో 40 వేలకు పైగా బెల్టు షాపులు ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో 9 వేల బడులు మూసేశారు. గతంలో మద్యం అమ్మకాలు చూస్తే..చంద్రబాబు మద్యం మాఫియాతో కుమ్మక్కై 2022 వరకు మద్యం అమ్మకాలకు అనుమతిచ్చారు. రూ.2 లకే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ ఇస్తామన్నారు..ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, వీధికో బెల్టుషాపు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో ఉన్న ఎక్సైజ్‌ మంత్రి బీర్‌ హెల్త్‌ డ్రింక్‌ అని ప్రచారం చేసి మద్యం అమ్మకాలు పెంచేలా వ్యవహరించారని తప్పుపట్టారు. మద్యం పాలసీ వల్ల మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

24 గంటలు ఏటీఎంలు ఉన్నాయో లేవో కానీ, చంద్రబాబు పరిపాలనలో ఎనీ టైమ్‌ మందు దొరికేదన్నారు. మద్యానికి పేదలను బానిసలుగా మార్చి వారి రక్తాన్ని పీల్చి పిప్పి చేశారు. నారా వారి పాలన కాదు..సారా పాలన అని చంద్రబాబుపై ప్రజలు ముద్రవేసే విధంగా పాలించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మద్యం పాలసీ వల్ల ఆడవాళ్ల ధన,మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో మహిళలపై క్రైమ్‌ రేటు పెరిగిందని చెప్పారు. ఇలాంటి దౌర్భగ్యమైన మద్యం పాలసీ అమలు చేశారు కాబట్టే చంద్రబాబును మహిళలు కుక్కర్లో వేసి పిండి చేశారని తెలిపారు. ఆయన సీనియారిటీ ఎందుకు పనికొచ్చిందని ప్రశ్నించారు. మహిళలను అగౌరవపరచడంలో ఆయన అనుభవం పనికి వచ్చిందన్నారు. ఐదేళ్ల ఆడపిల్ల నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ల వరకు ఎవరికి రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. రిషితేశ్వరి అనే విద్యార్థిని చంద్రబాబు అసమర్ధ పాలనలో ర్యాగింగ్‌కు గురై బలైందని ఆవేదన వ్యక్తం చేశారు.

పాలు అమ్మే చోట, కురగాయాలు అమ్మే చోట, బీచ్‌ల వద్ద బీర్‌ షాపులు పెట్టి ఎవరికి మనశ్శాంతి లేకుండా చేశారని విమర్శించారు. వైజాగ్‌ బీచ్‌లో బికినీ పెస్టివల్‌ పెట్టాలని చూశారని, ఆ రోజు వైయస్‌ జగన్‌ నాయకత్వంలో మహిళలు పెద్ద ఎత్తున గళం ఎత్తడంతో ఆ ఫెస్టివల్‌ను రద్దు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు చేసిన పాపాలన్ని కడిగేసుకునేందుకు పసుపు–కుంకుమ పథకంతో రూ.10 వేలు ఇచ్చి మభ్యపెట్టాలని చూశారన్నారు. మహిళలు చంద్రబాబు కంటే తెలివిగా ఆలోచించి ఆయన ఇచ్చిన రూ.10 వేలు తీసుకొని ఉప్పు, కారం ఆయన కళ్లలో కొట్టి 23 సీట్లు ఇచ్చి మూలన కూర్చోబెట్టారని తెలిపారు. మహిళ ఆదిపరాశక్తి అయితే తట్టుకోలేమని ఇప్పటికైనా చంద్రబాబు తెలిసి రావాలని సూచించారు. మహిళా పక్షపాత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కాబట్టే ఈ బిల్లును ధైర్యంగా తీసుకువచ్చారన్నారు. ఐదేళ్ల పాటు కష్టపడిన మహిళలంతా కూడా వైయస్‌ జగన్‌ అన్న మనకు విముక్తి లభిస్తుందని సంతోషంగా ఉన్నారని చెప్పారు. నెల రోజుల్లోనే మద్యపాన నిషేదంపై అవసరమైన  చర్యల్లో తొలి అడుగుగా ఇలాంటి బిల్లుపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మహిళా ఎమ్మెల్యేగా గర్వ పడుతున్నానని, ఇలాంటి నాయకుడి నాయకత్వంలో పని చే స్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. దశలవారీగా మద్యపాన నిషేదాన్ని స్వాగతిస్తున్నట్లు రోజా తెలిపారు. మద్య అమ్మకాల్లో ప్రభుత్వ అజమాయిషి ఉంటేనే దాన్ని నియంత్రించడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. 

 

Back to Top