మహిళలందరూ మేల్కొనాలి

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది

చంద్రబాబు పాలనలో మహిళలపై దాడులు పెరిగాయి

చంద్రబాబు మహిళా వ్యతిరేకి

మహిళా సాధికారత రావాలంటే రాజన్న రాజ్యం రావాలి

అనంతపురం:  మహిళలంతా ఆదిపరాశక్తులుగా మారాలని, అరాచక ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు మేల్కొనాలని వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా పిలుపునిచ్చారు. ఐదేళ్లుగా మోసం చేసిన టీడీపీని బంగాళ ఖాతంలో కలిపేద్దామన్నారు. మహిళా సాధికారత రావాలాంటే రాజన్న రాజ్యం రావాలని ఆమె ఆకాంక్షించారు. మహిళా దినోత్సవం సందర్భంగా అనంతపురంలో ఏర్పాటు చేసిన సదస్సులో రోజా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని  మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో మహిళలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆడవారి పుట్టుకను కించపరిచేలా మాట్లాడారని,‘‘ కోడలు మగబిడ్డను కంటే అత్త వద్దంటుందా అని హేళనగా మాట్లాడారని గుర్తు చేశారు. మహిళా వ్యతిరేకి అయిన చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్తే గానీ శని వదలదన్నారు. మహిళా సాధికారికత సాధించాలన్నా..మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే దేశ నలుమూలల నుంచి మహిళా నాయకురాళ్లు రావాలన్నారు.

స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కూడా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు. కారు షెడ్డులో ఉండాలి..ఆడది  వంటింట్లో ఉండాలని చెప్పిన మహానుభావుడు మన స్పీకర్‌ అని మండిపడ్డారు. వీళ్లా మహిళా సాధికారత సాధించేదని ధ్వజమెత్తారు. ఇలాంటి వాళ్లు ఉన్నంత కాలం వాళ్ల చెప్పుకింద రాళ్లలా ఉండాల్సిందే అన్నారు. మహిళా తహశీల్దార్‌ణు జుట్టుపట్టి కొడితే పట్టించుకున్న నాథుడే లేడన్నారు. మహిళా సాధికారత రావాలంటే దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ రావాలని, అది వైయస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు. ఈ విషయం ప్రతి మహిళా తెలుసుకుంది కాబట్టే ఈ రోజు మహిళలంతా వైయస్‌ జగన్‌ వెంట నడుస్తున్నారని చెప్పారు. ప్రతి తల్లి, చెల్లి కూడా నేనున్నానంటూ వైయస్‌జగన్‌ను ఆశీర్వదించి ముందుకు నడుపుతున్నారని చెప్పారు. గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు మన జీవితాలను నాశనం చేశారని, మళ్లీ అదే తప్పు చేయకూడదన్నారు. రాబోయే కాలం ఆశీర్వదకరంగా ఉండాలంటే, మహిళా సాధికారత సాధించాలంటే ప్రతి ఒక్కరూ ప్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలన్నారు. 
 

Back to Top