'ఉక్కు' పరిరక్షణ పోరాటం ఉధృతం చేస్తాం

స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు సీఎం వైయస్‌ జగన్‌ ఉక్కు సంకల్పంతో ఉన్నారు

ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్రకు విశేష మద్దతు లభిస్తోంది

ప్రధానికి లేఖ రాస్తే జైల్లో పెడతారని చంద్రబాబుకు భయం

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

విశాఖపట్నం: స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉక్కు సంకల్పంతో ఉన్నారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజా తెలిపారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేపట్టిన పాదయాత్రకు రాష్ట్రం నలుమూలల నుంచి విశేష మద్దతు లభిస్తోందని చెప్పారు. కేంద్రం దిగిరాక‌పోతే పోరాటాన్ని మ‌రింత ఉధృతం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. విశాఖపట్నం స్టీల్‌ పరిరక్షణ పోరాట యాత్ర పేరిట ఎంపీ విజయసాయిరెడ్డి చేపట్టిన పాదయాత్రలో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 

‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అని 32 మంది ప్రాణ త్యాగాలు చేసిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను సాధించారు. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్రమంతా వ్యతిరేకిస్తుంది. ప్లాంట్‌ పరిరక్షణ కోసం సీఎం వైయస్‌ జగన్‌ ఉక్కు సంకల్పంతో ఉన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ జేఏసీ నేతలతోనూ సీఎం సమావేశమయ్యారు. వారి చెప్పిన అన్ని విషయాలను అంగీకరించారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రధానికి లేఖ కూడా రాశారు. లోక్‌సభ, రాజ్యసభలో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు మాత్రమే స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం వాయిస్‌ను వినిపించారు. ప్రజల సెంటిమెంట్‌ను కేంద్రం తెలుసుకోవాలని వైయస్‌ఆర్‌ సీపీ తరఫున ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేపట్టారు. విశేషంగా ప్రజలంతా సంఘీభావం తెలియజేశారు. 

14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు విశాఖకు వచ్చి మొసలికన్నీరు కారుస్తున్నాడు. స్టీల్‌ ప్లాంట్‌ను సీఎం అమ్ముకోవాలని చూస్తున్నాడని దుష్ప్రచారాలు చేస్తున్నాడు. మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ వ్యక్తి కూడా ఇలాంటి మాటలు మాట్లాడడు. కేంద్ర ప్రభుత్వ సంస్థతో సీఎం వైయస్‌ జగన్‌కు ముడిపెట్టి బురదజల్లడం బాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. 

ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ ప్రధానికి లేఖ రాశారు. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ చంద్రబాబు, ఆయన కొడుకు ఎందుకు లేఖరాయలేకపోయారు. లేఖ రాస్తే చేసిన తప్పులకు జైల్లో పెడతారని భయంతో వణికిపోతున్నారా..? 56 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసిన దరిద్రమైన చరిత్ర చంద్రబాబుది. 2019లో తెలుగుదేశం పార్టీని 23కు పరిమితం చేసి చంద్రబాబును పీకి హైదరాబాద్‌లో పడేశారు. నిన్న పంచాయతీ ఎన్నికల్లో 14 సీట్లకు పరిమితం చేసి చంద్రబాబును కుప్పం నుంచి కూడా పీకేశారు. ఇకనైనా అబద్ధాలు చెప్పడం, బురదజల్లే రాజకీయాలు మానుకోవాలని కోరుతున్నాను’ అని ఎమ్మెల్యే ఆర్కే రోజా సూచించారు. 
 

Back to Top