పిన్నెళ్లిని కాదు..మోసం చేసిన చంద్రబాబును కొట్టాలి

వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై బురద జల్లడమే టీడీపీ పని

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

అమరావతి: రాజధానిపై ఒక్క మాట కూడా మాట్లాడని ప్రభుత్వ విప్‌ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై రైతుల ముసుగులో టీడీపీ గుండాలు దాడి చేశారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. పిన్నెళ్లిని కాదు..రైతులను మోసం చేసిన చంద్రబాబును కొట్టాలని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే పిన్నేళ్లి రామకృష్ణారెడ్డిపై జరిగిన దాడిని ఎమ్మెల్యే రోజా తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు రాజకీయంగా దిగజారిపోయారనడానికి ఇదో ఉదాహరణ. చంద్రబాబుకు ఇలాంటివి అలవాటే. ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించే సమయంలోనూ, పరిటాల రవి ఘటనలోనూ చంద్రబాబు ఇదే పంథాను అవలంభించారు. రైతుల ముసుగులో టీడీపీ గుండాలు ఈవిధంగా దాడులు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా రైతులు నిరసనలు తెలుపుతున్నారనే అపోహా కల్పించి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై బురద జల్లడమే టీడీపీ పనిగా పెట్టుకుంది. ఎప్పటి నుంచో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలో రాజధానులు పెడుతుంటే రైతులెందుకు బాధపడుతున్నారో అర్థం కావడం లేదు. భూముల రేట్లు పడిపోతాయని చంద్రబాబుకు బాధగా ఉంది. అక్కస్సుతోనే దాడులకు పాల్పడుతున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ఎక్కడా కూడా అమరావతిని మార్చుతున్నానని చెప్పలేదు. అమరావతితో పాటు ఈ మూడు రాజధానులు డెవలప్‌ చేస్తామని ప్రకటన చేశారు.  అమరావతి రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ రోజు టీడీపీ నేతలు రైతుల ముసుగులో దాడి చేస్తున్నారు. కొట్టాల్సింది పిన్నేళ్లిని కాదు..మోసం చేసి ఇంతవరకు ప్లాట్లు ఇవ్వని చంద్రబాబుకు కొట్టాలి. 2018లోగా రాజధాని కట్టేస్తానని, రైతులందరికీ న్యాయం చేస్తామని చంద్రబాబు చెప్పారు. 2019 వరకు రాజధాని కట్టలేదు. రైతులను ముంచారు. ఈ రోజు రాజధానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని ప్రభుత్వ విప్‌పై టీడీపీ గుండాలు దాడి చేయడం కేవలం రెచ్చగొట్టే పద్ధతి, గుండాగిరి. సీఎం వైయస్‌ జగన్‌ లా అండ్‌ ఆర్డర్‌ కాపాడేందుకు కృషి చేస్తున్నారు. గుండాగిరి చేస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదు. చట్టం తన పని తాను చేస్తుంది. అమరావతి రైతులకు సీఎం వైయస్‌ జగన్‌ న్యాయం చేస్తారు. ఏ రైతు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. వైయస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రైతులకు అండగా ఉన్నాం. శాంతియుతంగా ఆందోళనలు చేపట్టాం. ఈ రోజు టీడీపీ నేతలు రైతుల పేర్లపై అరాచకాలు చేస్తున్నా..కూడా ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సీఎం వైయస్ జగన్‌ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా, ఎవరిని అరెస్టు చేయకుండా సంయమనంతో వ్యవహరిస్తున్నారు. మొన్న జర్నలిస్టులపై దాడి చేశారంటే వీళ్లు రైతులు కారు. రైతులు అన్నం పెడతారే కానీ, ఎవరి తలలు పగులగొట్టరు. కేవలం వైయస్‌ఆర్‌సీపీ నేతలను రెచ్చగొడుతున్నారు. ఇది మంచి పరిణామం కాదు.  మొన్న తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలపై దాడులు చేశారని ఖండించిన చంద్రబాబు ఒకే రాష్ట్రంలోని వ్యక్తులతో ప్రజాప్రతినిధులను కొట్టించడం ఎంతవరకు న్యాయం. చంద్రబాబు కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో తాను జీరో అయిపోతున్నానన్న భయంతో రాజధానిని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయకుండా ఒకచోటే ఉంచాలనే ప్రయత్నంతో భయభ్రాంతులకు గురి చేయాలని ఇలాంటివి చేస్తున్నారు. పిన్నెళ్లిపై దాడి చంద్రబాబు వేసిన స్కేచ్‌ మాత్రమే. రాజధానిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. గత ఐదేళ్లలో ఎందుకు రాజధానిలో ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ కూడా కట్టలేదు. గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. తాత్కాలికం పేరుతో కోట్లు దోచేశారు. ఆ రోజు హుండీలు పెట్టి చందాలు పోగు చేసినా..,చంద్రబాబు కుటుంబం ఒక్క రూపాయి కూడా దానం చేయలేదు. ఇలాంటి దాడులకు భయపడేది లేదు. దీన్ని అందరూ ఖండిస్తున్నారు. పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి. పోలీసు వ్యవస్థ స్ట్రీట్‌గా ఉండాలి. సీఎం వైయస్‌ జగన్‌పై బురద జల్లేందుకు కుట్రతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. మమ్మల్ని చంపి శవాలపై రాజకీయాలు చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పడం తథ్యం.

Back to Top