తిరుపతి: చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చిత్తూరు జిల్లా వాసులకు బాగా తెలుసు అని, తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడం సిగ్గుచేటని ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. అసలు ఉందో.. ఊడిపోయిందో తెలియని జనసేన పార్టీ తిరుపతి ఉప ఎన్నికల్లో నిల్చుంటాం.. సీటు కావాలని అడుగుతుందంటే విడ్డూరంగా ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచి తప్పుకుంటాం.. తిరుపతిలో సీటు ఇవ్వండి అని అడుగుతున్నారంటే.. మ్యాచ్ ఫిక్సింగ్‌లు చేసుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తిరుపతి ఉప ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తిరుపతిలో ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి ఎంపీగా గెలిచిన వైయస్ఆర్ సీపీ నేత బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో చనిపోయారని, ఆ కుటుంబ సభ్యులు ఎన్నికలకు ఆసక్తి చూపకపోవడంతో వారికి ఒక నామినెటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సీఎం నిర్ణయించారన్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఒక యువకుడికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందన్నారు. 2019లో వైయస్ జగన్మోహన్రెడ్డిని నమ్మిన ప్రజలు తిరుపతి ఎంపీ స్థానాన్ని వైయస్ఆర్ సీపీకి అందించారన్నారు. సీఎం వైయస్ జగన్ 17 నెలల తన పాలనతో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి అండగా నిలిచారని, ఉప ఎన్నికలో గతం కంటే ఎక్కువ మెజార్టీని ప్రజలు వైయస్ఆర్ సీపీకి అందిస్తారని చెప్పారు.
చంద్రబాబు మాటలు నమ్మడం ప్రజలు ఎప్పుడో మానేశారని ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు నమ్ముకుంటాడని, బాబు చెప్పినట్లుగా తోక పార్టీలు నడుచుకుంటున్నాయన్నారు. నీతి, నిజాయితీ లేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ప్రతిపక్షాలన్నీ ఎంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడినా... తిరుపతిలో వైయస్ఆర్ కాంగ్రెస్‌పార్టీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు.