టీడీపీ హయాంలో ఇసుక దోపిడీ 

ఇసుక గురించి టీడీపీ ధర్నాలు చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  

 అమరావతి:  ఏపీలో ఇసుక కొరత ఉందంటూ టీడీపీ వాళ్లు ధర్నాలు చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు, ఆయన కొడుకు ఒక ఇంటిని ఆక్రమించుకుని నివసిస్తున్నారని, గతంలో వారి ఇంటి వెనుక డ్రెడ్జర్ల సాయంతో ఇసుకను తవ్వితే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ పెనాల్టీ విధించిన విషయాన్ని వారు మర్చిపోయారా? అని ప్రశ్నించారు.  టీడీపీ హయాంలో ఇసుక దోపిడీని పలువురు అధికారులు అడ్డుకున్నారని, ఓ మహిళా అధికారిపై నాడు టీడీపీ ఎమ్మెల్యే దాడికి పాల్పడ్డారని విమర్శించారు. నాడు మహిళా అధికారికి అండగా నిలబడాల్సిన చంద్రబాబు, తమ ఎమ్మెల్యేను సమర్థించుకున్నారని, అటువంటి వ్యక్తి ఈరోజున ఇసుక దోపిడీ గురించి మాట్లాడటం కన్నా అన్యాయం, దారుణం ఇంకేమైనా ఉంటుందా అని అన్నారు.

 బొత్స వాస్తవం చెబితే ప్రతిపక్షం రాద్ధాంతం తగదు
రాజధాని గురించి మంత్రి బొత్స సత్యనారాయణ వాస్తవ పరిస్థితులు చెప్పారని, వరద నీరు వస్తే అక్కడి పరిస్థితి ఎలా ఉందో చెబితేనే దానిపై ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తోందని ఆర్కే విమర్శించారు. చంద్రబాబునాయుడు తన అనుకూల మీడియాతో దీనిపై దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా చేయొద్దని మేధావులు, కమిటీలు చేసిన సూచనలను చంద్రబాబు నాడు పట్టించుకోలేదని విమర్శించారు. ఈ తప్పుల వల్ల భావితరాలు దెబ్బతింటాయన్న వాస్తవాన్ని బొత్స సత్యనారాయణ చెప్పడాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టడం కరెక్టు కాదని అన్నారు.
 

Back to Top