సీఎం వైయస్‌ జగన్‌ బీసీల పక్షపాతి

బలహీనవర్గాల అభ్యున్నతికి బడ్జెట్‌ కేటాయింపులు హర్షణీయం

రాష్ట్రంలోని బీసీలంతా సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం

గత ప్రభుత్వం బీసీ, ఎస్సీలను కించపరిచేలా పాలన చేసింది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి

విజయవాడ: బీసీ గర్జనలో ఇచ్చిన హామీ మేరకు తూచా తప్పకుండా వాటన్నింటినీ అమలు చేసేందుకు బడ్జెట్‌ రూపొందించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని బలహీనవర్గాల ప్రజలంతా కృతజ్ఞతలు తెలుపుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రాజ్యం వచ్చిందన్నారు. అన్నివర్గాలకు మేలు చేసే విధంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బడ్జెట్‌ కేటాయింపులు చేశారన్నారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారు. వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చే ఆలోచన చేయలేదు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రాకముందు అరకొర పక్కా బిల్డింగులు, చాలీచాలని స్కాలర్‌షిపులు కేటాయింపులు చేశారు కానీ, మొత్తం బీసీ జాతి అభివృద్ధి చెందే విధంగా నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రులు గతంలో మహానేత వైయస్‌ఆర్‌.. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. బీసీ గర్జనలో రాష్ట్రంలోని అన్ని బలహీనవర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యా, ఆర్థిక పరంగా నిధులు ఏర్పాటు చేసి అండగా ఉంటామని జననేత చెప్పారో దానికి కార్యచరణ కూడా బడ్జెట్‌ ద్వారా ప్రారంభించారు. 

రజకులకు, నాయీ బ్రాహ్మణులకు, దర్జీలకు, చేనేతలకు ప్రత్యేక ఆర్థిక సహాయం చేస్తానని బీసీ గర్జనలో ఇచ్చిన హామీ మేరకు వాటన్నింటినీ బడ్జెట్‌లో రూపొందించి దానికి కావాల్సిన కేటాయింపులు చేసినందుకు ఈ వర్గాలన్నీ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఎన్నికలు, మేనిఫెస్టో, రాజకీయాలు అనే విషయాలు కాకుండా బలహీనవర్గాల జీవన ప్రమాణాలు పెంచాలి. బలహీనవర్గాలు కూడా సమాజంలో ఒక భాగమని చెప్పేందుకు ఈ బడ్జెట్‌ కేటాయింపులు జరిగాయి.

గతంలో వైయస్‌ఆర్‌ ఫీజురియంబర్స్‌మెంట్‌ ద్వారా అనేక లక్షల మంది పేద విద్యార్థులను డాక్టర్లు, ఇంజనీర్లుగా చేశారు. అనేక లక్షల బీసీ కుటుంబాలకు గృహ నిర్మాణ పథకం ద్వారా పక్కా గూడు ఏర్పాటు చేశారు. బలహీనవర్గాల కుటుంబాలు ఆరోగ్య సమస్య వచ్చి డబ్బు భారంతో బాధపడకుండా ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేశారు. మహానేత అడుగు జాడల్లో నడుస్తూ.. చదివించడం దండగ అనే ఆలోచన ఏ తల్లికి రాకూడదని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒకటవ తరగతి నుంచే అమ్మ ఒడి పథకం ఏర్పాటు చేసి రూ. 15000 ఇచ్చి పిల్లలను ఇంటర్మీడియట్‌ వరకు చదివించండి అని ప్రతి తల్లికి భరోసా ఇచ్చారు. డిగ్రీ నుంచి ఏ చదువు చదివినా నేనే ఖర్చు భరిస్తానని చెప్పారు. 

బీసీలను రాజకీయంగా ఉపయోగించుకున్న ఏ నాయకుడు వారి అభ్యున్నతికి ఆలోచించలేదు, కానీ సీఎం వైయస్‌ జగన్‌ గవర్నమెంట్‌ ద్వారా నామినేషన్‌ పద్ధతుల్లో ఇచ్చే కాంట్రాక్టులను బలహీనవర్గాలకు, దళితులకు రిజర్వు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏ ఎమ్మెల్యే అయినా సరే నామినేషన్‌ పద్ధతిలో బీసీలు, ఎస్సీలకు కాంట్రాక్టులు కట్టబెట్టాలనే నిర్ణయం తీసుకున్నందుకు బీసీల తరుఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అన్ని నామినేటెడ్‌ పద్ధవుల్లో, దేవాదాయ కమిటీల్లో అన్నింట్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా అన్ని తూచా తప్పకుండా బడ్జెట్‌లో రూపొందించారు. మత్స్యకారులు చనిపోతే రూ. 10 లక్షల పరిహారం, వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతి రూ. 4 వేలను రూ. 10 వేలకు పెంచడం, డీజిల్‌ సబ్సిడీ, దర్జీలకు రూ. 10 వేలు, నాయీ బ్రాహ్మణులకు రూ. 10 వేలు ఇవన్నీ బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. రూ. 15 వేల కోట్లు సబ్‌ప్లాన్‌ ద్వారా బలహీనవర్గాలకు ఇస్తామని బీసీ గర్జనలో ఇచ్చిన హామీ మేరకు బడ్జెట్‌లో కేటాయించారు. గత ప్రభుత్వం బలహీనవర్గాలను కించపరిచే విధంగా పాలన చేసింది. కానీ, సీఎం వైయస్‌ జగన్‌ బడ్జెట్‌లో కేటాయించిన నిధులన్నీ బలహీనవర్గాల అభ్యున్నతికి ఖర్చు చేస్తారు. బలహీనవర్గాల రాజ్యం వచ్చింది. 

 

Back to Top