తాడేపల్లి: అమరావతిలో రాజధాని పేరుతో దళితుల భూములు లాక్కొని మోసం చేశాడని, దళితులంతా ఏకమై చంద్రబాబును తరిమేరోజు తొందరలోనే వస్తుందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. తనకు అందిన సమాచారం మేరకు రాజధాని ప్రాంతంలో 300 ఎకరాల దళితుల భూములు కాజేయడానికి టీడీపీ నేతలు ప్లాన్ చేశారు. రిజిస్ట్రేషన్ కాపీలు మొత్తం ఫొటోలతో సహా బయటకువచ్చాయని, చంద్రబాబు అండ్ కో బాగోతం బట్టబయలు కాబోతుందన్నారు. ఇంకా అనేక విషయాలు వెలుగులోకి రాబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, లోకేష్ చౌదరి, నారాయణ, ఇలాంటి అనేక మంది రాజధాని ప్రాంతంలో దళితుల అసైన్డ్‌భూములు భయపెట్టి అప్పనంగా లాక్కున్నారని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. అయినా.. ఈ భూ రాబంధులు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిసూ అభూతకల్పనలను సృష్టిస్తున్నారన్నారని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దళితులకు మద్దతుగా నిలబడ్డారని ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలపై ఎమ్మెల్యే మేరుగ ధ్వజమెత్తారు. దళితుల అసైన్డ్ భూములను చంద్రబాబు అండ్ కో భయపెట్టి లాక్కొని కోట్ల రూపాయలు సంపాదించారనడానికి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయన్నారు. అసైన్డ్ భూములు, దళితుల భూములు లాక్కొని అమ్ముకోవచ్చా..? ధూలిపాళ్ల నరేంద్ర చౌదరి, లోకేష్ చౌదరి సమాధానం చెప్పాలన్నారు. దళిత మెడ కోయడానికి చంద్రబాబు జీఓ నంబర్ 41 తెచ్చారని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. చంద్రబాబు అండ్ కో దోపిడీ బయటపడేందుకు చాలా తక్కువ వ్యవధి ఉందని, అనేక విషయాలు బహిర్గతం కాబోతున్నాయన్నారు. 54వేల మందికి రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్తారా..? ఇదేనా దళితులపై ఉన్న ప్రేమ అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరుతుంటే ఓర్వలేక.. దళితులకు ఇచ్చే ఇళ్ల స్థలాలపై కోర్టులకు వెళ్లిన నీచ సంస్కృతి చంద్రబాబుదని దుయ్యబట్టారు. ప్రజాక్షేత్రంలోనైనా, చట్టసభలోనైనా.. చంద్రబాబును ఆధారాలతో సహా ఉతికిఆరేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.