తాడేపల్లి: చంద్రబాబు దళిత ద్రోహి అని చెప్పేందుకు రుజువులు కోకొల్లలుగా ఉన్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. రాజకీయ చరిత్ర మొత్తం నీచ సంస్కృతి కలిగిన నాయకుడు చంద్రబాబు ఒక్కడేనని ధ్వజమెత్తారు. అధికారంలో ఉండగా దళితులను పట్టించుకోని చంద్రబాబు.. నేడు దళితులకు జరుగుతున్న మేలుకు మోకాలడ్డుతున్నాడని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రి పదవులు ఇచ్చారా..? ఏనాడైనా మహిళను హోంమంత్రిగా చేశారా..? ఎన్నికల కమిషనర్‌గా న్యాయకోవిదుడైన ఎస్సీని నియమించాడా..? సమాచార శాఖ కమిషనర్‌గా ఎస్సీని నియమించాడా..? అని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ప్రశ్నించారు. పేదవారి కోసం ఇళ్ల స్థలాలు, ఇళ్లు, ఆరోగ్యం, విద్య ఆలోచన చేసిన దాఖలాలు ఉన్నాయా..? అని చంద్రబాబును నిలదీశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని మేరుగ నాగార్జున అన్నారు. రాష్ట్రంలోని సొంతిళ్లు లేని వారు ఎవరూ ఉండకూడదనే సీఎం వైయస్ జగన్ ధ్యేయమని, అక్షరాల 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు అందడాన్ని ఓర్వలేక కోర్టుకు వెళ్లి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చంద్రబాబు అడ్డుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందేవన్నారు. టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లినా.. పేదవాడికి మేలు చేయాలనే మొక్కవోని దీక్షతో కోర్టు నుంచి అనుమతి పొందైనా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం ఉన్నారన్నారు. అమరావతి ఉద్యమం పేరుతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఇదే అమరావతి ప్రాంతంలో 54వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం సంకల్పించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై ఉన్న ప్రేమ ఇదేనా.. చంద్రబాబూ..? అని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ప్రశ్నించారు. ఇంగ్లిష్ మీడియం విద్యను అడ్డుకున్నాడు.. ఎస్ఈసీగా న్యాయకోవిదుడైన దళితుడి నియామకాన్నిఅడ్డుకున్నాడు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు కేసుల్లో ఇరుక్కున్నప్పుడు నిండు అసెంబ్లీలో అంబేడ్కర్ పేరుతో తీసుకువచ్చి పబ్బం గడుపుకున్నాడని, అంబేడ్కర్ విగ్రహం, స్మృతి వనం పేరుతో ప్రజలను మభ్యపెట్టాడని మండిపడ్డారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న సీఎం వైయస్ జగన్ విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుతో పాటు పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. అంబేడ్కర్ విగ్రహం పెట్టే భూమిని గతంలో చంద్రబాబు అమ్మడానికి యత్నించారని, ఆ భూమిలో అంబేడ్కర్ విగ్రహం పెడుతుంటే.. గగ్గోలు పెట్టి వారి పార్టీ నాయకులతో ప్రెస్‌మీట్‌లు పెట్టిస్తున్నాడన్నారు. చంద్రబాబు దళిత ద్రోహి అని చెప్పడానికి కోకొల్లలుగా నిదర్శనాలు ఉన్నాయన్నారు.