సస్పెండ్ చేస్తే అతని పచ్చరంగు మారుతుందా..?

రాజకీయ లబ్ధికోసమే ముస్లింలపై బాబు మొసలి కన్నీరు

నంద్యాల ఘటనపై సీఎం వైయస్‌ జగన్‌ వెంటనే స్పందించారు

నిందితులకు బెయిల్‌ ఇప్పించింది తెలుగుదేశం పార్టీ నేతలే

పని అయిపోయాక రామచంద్రరావును టీడీపీ నుంచి సస్పెండ్‌ చేసిన బాబు

హక్కుల కోసం ప్లకార్డులు పట్టుకున్న ముస్లిం యువకులను హింసించింది బాబే 

ముస్లింలకు చంద్రబాబు చేసిన ద్రోహం ఎవరూ మర్చిపోలేదు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మండిపాటు

తాడేపల్లి: ఒక మ‌హిళా అధికారిని ఓ శాస‌న‌స‌భ్యుడు జుట్టుప‌ట్టుకొని ఈడ్చుకుంటూ లాక్కెళ్లి దాడి చేయ‌డం, వీఆర్‌ఓ దుస్తులు విప్పి అతనిపై దాడి చేయడం, ఓ దళిత మహిళను వివస్త్రను చేసి దాడి చేయడం, ఒక ఐపీఎస్‌ అధికారిపై ప్రజా ప్రతినిధులు దాడి చేయడాన్ని రాక్షస పాలన అంటారని, చంద్రబాబు హయాంలో జరిగిందంతా రాక్షస పాలనే అని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి ధ్వజమెత్తారు. అధికారులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా ఇద్దరినీ పిలిచి రాజీ చేయడాన్ని దుర్మార్గపు పాలన అంటారని మండిపడ్డారు. నంద్యాల ఘటన చాలా బాధాకరమని, ఆ ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే స్పందించి బాధ్యులను సస్పెండ్‌ చేయించడంతో పాటు అరెస్టు చేసి జైలుకు కూడా పంపించారన్నారు. ఆ ఘటనను అడ్డంపెట్టుకొని చంద్రబాబు శవరాజకీయాలు చేయడం అభ్యంతరకరం అని, రాజకీయ లబ్ధి కోసం బాబు వెంపర్లాడుతున్నాడని ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మండిపడ్డారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నంద్యాల ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిన బాధ్యులను అరెస్టు చేస్తే.. చంద్రబాబు తన పార్టీకి చెందిన లాయర్‌తో నిందితులకు బెయిల్‌ ఇప్పించాడని మండిపడ్డారు. పని అయిపోయిన తరువాత పార్టీ నుంచి ఆ లాయర్‌ను సస్పెండ్‌ చేశామని చెప్పి నమ్మించాలనుకుంటే ప్రజలు అంతా అమాయకులు అనుకుంటున్నావా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నుంచి రామచంద్రారావును సస్పెండ్‌ చేసినంత మాత్రాన అతని పచ్చరంగు మారుతుందా..? అని ప్రశ్నించారు. 

బాధ్యులపై చర్యలు తీసుకోవడమే కాకుండా సలాం కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం అందించి, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. 

చంద్రబాబు నీతి ఏంటో ప్రజలందరికీ తెలుసు అన్నారు. అధికారం లేనప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం పుట్టానని, అధికారంలో ఉన్నప్పుడు బడుగు, బలహీనవర్గాలను నాశనం చేయడానికి పుట్టాను అన్నట్లుగా చంద్రబాబు విధానాలు ఉంటాయని ఎమ్మెల్యే పార్థసారధి గుర్తుచేశారు. ముస్లింల గురించి ఇవాళ చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడని, గుంటూరులో నిర్వహించిన ‘నారా హమారా.. టీడీపీ హమారా’ మీటింగ్‌లో హామీలు అమలు చేయాలని ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిసిన నంద్యాలకు చెందిన ముస్లిం యువకులను ఏ విధంగా చంద్రబాబు హింసించారో ప్రజలు మర్చిపోలేదన్నారు. 

తన పెట్టుబడి దారుడు నారాయణ, చేతగాని కుమారుడు లోకేష్‌ను ఎమ్మెల్సీలను చేసి మంత్రులుగా చేసిన చంద్రబాబుకు.. ముస్లింలను మంత్రులుగా చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ముస్లింలు, ఎస్సీ, ఎస్సీ, బీసీలు అంటే అపారమైన ప్రేమ ఉంది. వైయస్‌ కుటుంబం మొత్తానికి బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలపై ప్రేమ ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ కల్పించిన ఘనత దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిది అని గుర్తుచేశారు. 17 నెలల కాలంలో రూ. 3,428 కోట్లను సంక్షేమ పథకాల రూపంలో ముస్లిం మైనార్టీలకు సీఎం వైయస్‌ జగన్‌ అందించారన్నారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ముస్లిం మైనార్టీల కోసం కేవలం రూ.2,661 కోట్లు మాత్రమే ఖర్చు చేశాడన్నారు. చంద్రబాబు తన పార్టీ ఉనికి కోసం, రాజకీయ లబ్ధి కోసం హైదరాబాద్‌లో కూర్చొని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మండిపడ్డారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top