బీసీలంటే ఎందుకంత చిన్నచూపు చంద్రబాబూ? 

అధికారం కోల్పోయాక బలహీనవర్గాలపై టీడీపీ కపట ప్రేమ

బీసీలకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది

నామినేటెడ్‌ పదవుల్లో, పనుల్లో సైతం రిజర్వేషన్‌ కల్పించారు

పేదల సొంతింటి కలను సీఎం వైయస్‌ జగన్‌ నెరవేరుస్తున్నారు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి

తాడేపల్లి: తోకలు కత్తిరిస్తా.. తాట తీస్తా.. అని చంద్రబాబు బలహీనవర్గాలను కించపరిచాడని, టీడీపీని బీసీలు ఎప్పటికీ క్షమించరని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. ఐదేళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అడుగడుగునా అణచివేయాలని చూసిన చంద్రబాబు.. అధికారం కోల్పోయాక ఈ వర్గాలపై కపట ప్రేమ చూపిస్తున్నాడని మండిపడ్డారు. మహానేడు వేదికగా బీసీలపై మొసలి కన్నీరు కారుస్తున్నాడని, ఎన్ని కుయుక్తులు పన్నినా బలహీనవర్గాలు చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బలహీనవర్గాలకు పెద్దపీట వేశారన్నారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బలహీనవర్గాల ప్రజలు తమ న్యాయమైన హక్కుల కోసం చంద్రబాబు దగ్గరకు వెళ్తే వారిని అవమానించే రీతిలో ప్రవర్తించాడని, నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానని, మత్స్యకారుల తోలుతీస్తానని, యాదవ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరిన యువతను 24 గంటలు జైల్లో పెట్టి అవమానించాడని చంద్రబాబుపై మండిపడ్డారు. 

బీసీ వ్యతిరేక ద్వేషాన్ని చంద్రబాబు పలు సందర్భాల్లో వెల్లగక్కుకున్నాడు. చంద్రబాబుకు నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే.. వారి ఉన్నతికి ఎందుకు కృషి చేయలేదని ప్రశ్నించారు. ఒక బీసీకి సంబంధించిన న్యాయవాదికి జడ్జి అయ్యే అవకాశం వస్తే.. అతను పనికిరాడు అని గత ప్రభుత్వం కేంద్రానికి రిపోర్టు ఇచ్చిందంటే.. బలహీనవర్గాలు ఎప్పటికీ చంద్రబాబును క్షమించలేవన్నారు. 

ఓడిపోయినప్పుడల్లా బీసీలపై కపట ప్రేమ చూపించే చంద్రబాబు.. అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి కనీసం రూ.5 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. అటువంటి చంద్రబాబు బీసీల గురించి మాట్లాడడం సిగ్గుచేటు. ఆదరణ పథకం అని పెట్టి బీసీలకు ఇస్త్రీ పెట్టెలు, కత్తెరలు ఇచ్చి బలహీనవర్గాలను అభివృద్ధి చేశానని చెప్పుకునే చంద్రబాబు ఎక్కడా.. బలహీనవర్గాలకు చెందిన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అయితే వారి కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని నమ్మిన దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి, మన సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న తేడాను ప్రజలంతా గమనించాలన్నారు. 

ఏలూరులో బీసీ సదస్సులో లక్షలాది మంది సమక్షంలో చెప్పిన హామీలను తూచా తప్పకుండా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్నారన్నారు. బలహీనవర్గాల సామాజిక గౌరవం పెరిగేట్లుగా.. కొత్త కొత్త రంగాల్లో అడుగులు పెట్టేందుకు అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. అధికారంలోకి రాగానే బీసీల సమస్యలు పరిష్కరించేందుకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేశారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా.. ప్రతి నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ కల్పించారన్నారు. కాంట్రాక్టుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్‌ కల్పించారన్నారు. 

మహానేత వైయస్‌ఆర్‌ బలహీనవర్గాల పిల్లల కోసం ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకువస్తే.. ఆయన తనయుడు సీఎం వైయస్‌ జగన్‌ రెండు అడుగులు ముందుకు వేసి వందశాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌ తీసుకువచ్చారన్నారు. అమ్మఒడి పథకం కింద లక్షల మంది పిల్లలు పాఠశాలలకు వెళ్లే విధంగా తోడ్పాటును ఇచ్చారన్నారు. పేదల సొంతింటి కలను సీఎం వైయస్‌ జగన్‌ సాకారం చేస్తున్నారన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు సీఎం వైయస్‌ జగన్‌ పెద్దపీట వేశారన్నారు. 
 

Back to Top