లాంగ్‌మార్చ్‌కు ఎంతముట్టిందో పవన్‌ చెప్పాలి

చంద్రబాబు-పవన్‌ ఇద్దరూ కలిసి నాటకాలు

ఐదేళ్లలో ఇసుక దోపిడీ జరిగినప్పుడు లాంగ్‌మార్చ్‌ గుర్తుకు రాలేదా?

రాష్ట్రంలో వర్షాలు పడటం బాబు, పవన్‌కు ఇష్టం లేదు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 

విశాఖ:  విశాఖలో లాంగ్‌మార్చ్‌ చేపట్టిన జనసేన అధినేత పవన్‌కు చంద్రబాబు నుంచి ఎంత ప్యాకేజీ ముట్టిందో సమాధానం చెప్పాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రశ్నించారు. చంద్రబాబు-పవన్‌ ఇద్దరూ కలిసి నాటకాలాడుతున్నారని ఎమ్మెల్యే  విమర్శించారు. ఏదో రకంగా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. లాంగ్‌ మార్చ్‌తో వారి మధ్య ఉన్న దాగుడు మూతలు బయటపడ్డాయన్నారు. అబద్ధాలు, అభూత కల్పనలతో ప్రభుత్వంపై బుదర జల్లుతున్నారని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ ప్రజలకు మేలు చేస్తుంటే పవన్‌, చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పవన్‌ చంద్రబాబుకు దత్తపుత్రుడని ఎద్దేవా చేశారు. విశాఖలో కరుణం ధర్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. 2013 నుంచి 2019 వరకు పవన్‌ చేసిన లాంగ్‌మార్చ్‌లో చంద్రబాబు నుంచి ఎంత ప్యాకేజీ ముట్టిందో చెప్పాలన్నారు.  చంద్రబాబు ఐదేళ్ల పాలనలో దోచుకున్న డబ్బును పవన్‌కు పంచారని, ఆ డబ్బుతో పవన్‌ గాజువాకలో పంచారని ఆరోపించారు. నిండుకుండలా నదులు పారుతుంటే ఇసుక ఎక్కడి నుంచి దొరుకుతుందని ప్రశ్నించారు. మొన్న గుంటూరులో దీక్షా డ్రామా చంద్రబాబు సొంత కుమారుడు లోకేష్‌ ఆడితే..రేపు ఆయన దత్తపుత్రుడు పవన్‌ లాంగ్‌మార్చ్‌ డ్రామా ఆడబోతున్నారని ఎద్దేవా చేశారు. రేపు విశాఖలో జరుగుతున్న లాంగ్‌మార్చ్‌లో పవన్‌కు ఎంత ముట్టిందో చెప్పాలన్నారు. కృష్ణానది పక్కనే ఉన్న విజయవాడలోనో..గోదావరి పక్కనే ఉన్న రాజమండ్రిలోనో లాంగ్‌మార్చ్‌ పెట్టాల్సి ఉండగా విశాఖలో ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఐదేళ్లలో ఇసుక దోపిడీ జరిగినప్పుడు పవన్‌కు లాంగ్‌ మార్చ్‌ గుర్తుకు రాలేదా అని నిలదీశారు. చంద్రబాబు ఆదేశాలతో పవన్‌ విశాఖలో లాంగ్‌మార్చ్‌ పెట్టారని పేర్కొన్నారు.  చంద్రబాబు ఇంటి పక్కనే కోట్లాది రూపాయల  ఇసుక తవ్వుకుంటే పవన్‌ ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇసుక తవ్వకాల కారణంగా గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ రూ.100 కోట్ల జరిమానా విధించింది పవన్‌కు తెలియదా అని నిలదీశారు. పల్లెల్లో రైతులు సంతోషంగా ఉన్నారని, జలాశయాలన్నీ కూడా నిండుకుండలా ఉన్నాయన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని, అందుకే పవన్‌తో ఇలాంటి రాంగ్‌ మార్చ్‌ నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వర్షాలు కురవడం, నదులు నిండటం చంద్రబాబు, పవన్‌కు ఇష్టం లేదన్నారు. అందుకే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. లాంగ్‌మార్చ్‌ పవన్‌కు సూటవ్వదని, ఆయన చేసేవన్నీ షార్ట్‌మార్చ్‌లే అని ఎద్దేవా చేశారు.  

Read Also: బాబు సొంత పుత్రుడితో దీక్ష.. దత్తపుత్రుడితో లాంగ్‌ మార్చ్‌

Back to Top